May 14 2021 @ 22:46PM

ప్రతి చిన్న విషయం ముఖ్యమైనదే

కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సినీతారలు పలు రూపాల్లో ప్రయత్నిస్తున్నారు. కరోనా వైరస్‌, వ్యాక్సినేషన్‌, వైద్య పద్ధతులను గురించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో చైతన్యవంతం చేస్తున్నారు. తాజాగా కథానాయిక పూజాహెగ్డే ఓ వీడియో ద్వారా కరోనా సమయంలో ఆక్సీమీటర్‌ ఉపయోగించే విధానం గురించి ప్రజలకు తెలియజేశారు. ఆక్సిమీటర్‌ ఎలా ఉపయోగించాలి?, ఆక్సిజన్‌ స్థాయి,  పల్స్‌రేటును ఎలా కొలవాలి? అనే  విషయాలను చిన్న వీడియో రూపంలో అర్థమయ్యేలా చె ప్పే ప్రయత్నం చేశారు. ఇటీవల కరోనా బారిన పడిన పూజా కొన్ని రోజులు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నారు.


‘‘నేను కరోనా బారిన పడ్డప్పుడు ఆక్సిజన్‌ లెవల్స్‌ను చాలా జాగ్రత్తగా పరిశీలించాలని వైద్యులు చెప్పారు. మా డాక్టర్‌ వివరించేదాకా ఆక్సిమీటర్‌ను ఎలా ఉపయోగించాలనే విషయం నాకు తెలియలేదు. ప్రజలకు ఉపయోగపడుతుందని భావించి ఆ వివరాలను మీతో పంచుకుంటున్నాను. కొవిడ్‌ పై పోరాటంలో ప్రతి చిన్న విషయం ముఖ్యమైనదే’’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇటీవల హీరో కార్తి, మాళవికా మోహనన్‌ కరోనా పై ప్రజల్లో అపోహలను తొలగించేందుకు ప్రముఖ వైద్యులను ఇంటర్వ్యూ చేసిన వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.