Abn logo
Mar 25 2020 @ 02:40AM

సంక్షోభ వేళ రాజకీయాలు!

ప్రధాని మోదీ తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలలోనే కరోనా వైరస్ తీవ్రత విషయమై అవగాహన కలిగించలేకపోయారని అనేక ఘటనలు నిరూపిస్తున్నాయి. లక్నోలో ఒక రాజకీయ నాయకుడు ఏర్పాటు చేసిన విందుకు బిజెపి మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ఆమె కుమారుడు, బిజెపి ఎంపి దుష్యంత్ సింగ్ హాజరు కావడమే ఇందుకు నిదర్శనం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్  సింగ్ చౌహాన్ ఎన్నికైన తర్వాత ఆ పార్టీ నేతలు సమావేశమై చేతులు చేతులు కలుపుకుని, ఒకరికొకరు తిలకాలు దిద్దుకుని అభినందనలు తెలుపుకున్నారు. వారికెవ్వరికీ కరోనా వైరస్ తీవ్రత తెలియదా?


ప్రపంచంలో ఎక్కడ  ఏ పరిణామం జరిగినా దాని ప్రభావ పర్యవసానాలు మన దేశంపై పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఢిల్లీలో పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.  ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి స్పందిస్తేనే ముఖ్యమంత్రులు ఆయన దారిని అనుసరిస్తారు. సోషల్ మీడియా యుగంలో  ఏ పరిణామమైనా క్షణాల్లో ప్రపంచ పరివ్యాప్తమైపోతోంది. ఫిబ్రవరి 5న పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెందిన  ఒక ముఖ్య నేత విలేఖరులతో మాట్లాడుతూ పార్లమెంటు, ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి నివాసాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యాలయాలు అత్యంతాధునికమైన రీతిలో రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ దాకా రోడ్డుకు ఇరువైపులా నిర్మిస్తున్నట్లు వివరించారు. అలా నిర్మించాలంటే చాలా కాలం పడుతుంది కదా.. అని ఒక విలేఖరి ప్రశ్నించినప్పుడు ఆధునిక కాలంలో ఎంత పెద్ద నిర్మాణాలనైనా అనతికాలంలో నిర్మించవచ్చని ఆయన వివరించారు. కరోనా వైరస్ జబ్బు సోకిన వారికి చికిత్స చేసేందుకు చైనా  ప్రభుత్వం వుహాన్‌లో పదిరోజుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వేయి పడకల ఆస్పత్రిని పది రోజుల్లో నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విచిత్రమేమంటే ఆ నాయకుడు ఈ విషయం వివరిస్తున్న నాటికి కరోనా వైరస్ బీభత్స స్వరూపం గురించి ఆయనకే కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఎవరికీ తెలిసినట్లు లేదు. నిజానికి అంతకు రెండు నెలల క్రితమే చైనాలో కరోనా వైరస్ ప్రబలింది. 2019 డిసెంబర్ 10న తొలి పేషెంట్ అస్వస్థతకు గురై ఆస్పత్రికి చేరుకున్నాడు. అది అంతుపట్టని వ్యాధి అని చైనా ప్రజలకు ఆ తరువాత కొద్ది రోజులకు గానీ తెలియలేదు. కొద్ది మంది మరణించిన తర్వాత డిసెంబర్ 31న గాని చైనా ఆ వాస్తవాన్ని గుర్తించి  ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెప్పలేకపోయింది. ఆ తర్వాతే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రంగంలోకి దిగారు. చైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. జనవరి 15 నుంచి ఇతర దేశాల్లో ఈ వ్యాధి వల్ల మరణాలు మొదలయ్యాయి. 


చైనా కరోనా వైరస్‌ను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా చర్యలు తీసుకుంటున్న సమయానికి ప్రపంచం మేలుకోవడం ప్రారంభించింది. కానీ ప్రపంచం, చైనా కంటే దాదాపు రెండు నెలలు వెనుకబడింది. అంత వేగంగా స్పందించేందుకు ఏ దేశప్రభుత్వమూ సిద్ధం కాలేదు. సిద్ధ మయ్యే నాటికే అనేక దేశాల్లో ఆ వైరస్ భీతావహ పరిస్థితిని సృష్టించింది. మన దేశంలో అయితే అసలు కరోనా వైరస్ ప్రవేశిస్తుందని కూడా ఎవరూ ఊహించలేకపోయారు. చైనాలో  కరోనా వైరస్ వల్ల ఆ దేశం ఆర్థికంగా దెబ్బతింటుందని, మన దేశం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని చైనాను ఆర్థికంగా అధిగమించవచ్చునని సంబరపడిపోయిన వారున్నారు.కాని ఫిబ్రవరి 24,- 25 తేదీల్లో భారత దేశ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎలాంటి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోకుండానే వెనుదిరిగిపోయారు. అయితే, అంతకు నెల రోజుల ముందే జనవరి 29న అమెరికా అధ్యక్షుడు ‘వైట్ హౌజ్ కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్’ను ఏర్పాటు చేశారు. జనవరి 31న అమెరికాలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి చైనా నుంచి వచ్చే ప్రయాణీకులపై నిషేధాజ్ఞలు విధించారు. కానీ ఈ చర్యలు సరిపోవని అమెరికా గుర్తించేసరికి మంచి కాలం మించిపోయింది. అప్పటికే యూరప్‌లో ముఖ్యంగా ఇటలీలో  చైనా పర్యాటకుల ద్వారా కరోనా వైరస్ వ్యాపించింది. ఫిబ్రవరి 22న ఇటలీలో తొలి మరణం సంభవించి, క్రమంగా దేశమంతా విస్తరించి నెలలోపలే వేలాది మంది మరణించారు. జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ కూడా వణికిపోతున్నాయి.


యుద్ధ ప్రాతిపదికన నిర్మించిన అత్యవసర ఆసుపత్రులు మూసేసి, కరోనా వైరస్ పీడితులు ఒక్కరూ కూడా లేరని చైనా ప్రకటించే నాటికి ప్రపంచమంతా ఆ మహమ్మారి ప్రబలిపోయింది. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో అది విజృంభించింది. అక్కడ ఈ అంటువ్యాధి అత్యంత వేగంగా వ్యాపిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం హెచ్చరించింది. ప్రపంచమంతా వణికిపోతున్న పరిస్థితుల్లో మన దేశం ఎప్పుడు మేలుకొంది? మనం జాగ్రత్తలు ఎప్పుడు తీసుకోవడం ప్రారంభించాం? మార్చి మొదటి వారంలోనే మోదీ ప్రభుత్వం కరోనా వైరస్ గురించి తీవ్రంగా ఆలోచించడం, పరిస్థితిని సమీక్షించడం ప్రారంభించినట్లు స్పష్టమవుతోంది. హోలీ సందర్భంగా అందరూ కలుసు కోవడం మానేయాలని ప్రధానమంత్రి మార్చి 4న పిలుపునీయడంతో జనం ఆలోచనలో పడ్డారు. అయితే బిజెపి నేతలు కానీ, ప్రతిపక్షాలు కానీ ప్రధాని పిలుపును సీరియస్‌గా తీసుకున్నట్లు కనపడడం లేదు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 6 మధ్య బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా తన కుమారుడి వివాహం సందర్భంగా రాజస్థాన్, బిలాస్ పూర్, న్యూఢిల్లీల్లో విందులు నిర్వహించారు. మార్చి 6న ఢిల్లీలో నిర్వహించిన విందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా జరిగింది. అంటే అప్పటి వరకూ బిజెపి పెద్దలు, ప్రభుత్వాధినేతలకు కరోనా వైరస్ తీవ్రత అర్థం కాలేదనే తెలుస్తోంది.


మార్చి మొదటి వారంలో పార్లమెంటు ఉభయ సభలూ, ప్రతిపక్షాలు సృష్టించిన గలాభాతో స్తంభించిపోయాయి. ఈ గందరగోళానికి కారణం   కరోనా వైరస్ కాదు. ఢిల్లీ అల్లర్లపై చర్చ జరగాలని, ప్రధానమంత్రి సమాధానం ఇవ్వాలని వారు పట్టుబట్టారు. హోలీ సందర్భంగా నాలుగు రోజులు సెలవు ప్రకటించి మార్చి 11న మళ్లీ సమావేశమయ్యే నాటికి మధ్యలో బిజెపి నేతలు కాంగ్రెస్ యువనేత జ్యోతిరాదిత్య సింధియాను తమ వైపుకు తిప్పుకుని, 22 మంది ఎమ్మెల్యేలను బెంగలూరు తరలించడం ద్వారా  మధ్యప్రదేశ్ ఆపరేషన్‌ను పూర్తి చేసి ప్రతిపక్షాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశారు. దీనితో ప్రతిపక్షాలు కుదేలైపోయి ఢిల్లీ అల్లర్లపై హోంమంత్రి అమిత్ షా సమాధానంతో సంతృప్తి పడాల్సి వచ్చింది. సరిగ్గా అదే సమయానికి  కరోనా వైరస్ తీవ్రత గురించి పార్లమెంటులో రణగొణ ధ్వనులు మొదలయ్యాయి. ఎంపీలు మాస్కులు ధరించి రావడం ప్రారంభించారు. మార్చి 16న వివిధ మంత్రిత్వ శాఖల ఆర్థిక పద్దులను గిలటిన్ చేసినప్పటికీ ఫైనాన్స్ బిల్లును ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచారు. ఎందుకంటే ఫైనాన్స్ బిల్లును ఆమోదిస్తే మరునాటి నుంచి ఎంపీలెవరూ పార్లమెంటుకు రారని ప్రభుత్వానికి తెలుసు. ఎందుకు మార్చి 22 వరకూ ఫైనాన్స్ బిల్లును ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచారు? దీనికీ మధ్యప్రదేశ్ రాజకీయాలకూ సంబంధం ఉన్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కరోనా వైరస్‌తో విశ్వాస పరీక్ష జరపకుండా మధ్యప్రదేశ్ అసెంబ్లీ వాయిదా పడిన నేపథ్యంలో ఆ వ్యవహారం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఒక కొలిక్కి వచ్చి కమల్‌నాథ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాతే పార్లమెంట్ వాయిదా వేయడానికి ఆస్కారం కలిగింది. అప్పటివరకూ పార్లమెంట్ వాయిదా వేస్తే కరోనా వైరస్ పట్ల ప్రజల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని వాదించిన బిజెపి నేతల వద్ద  మార్చి 23న ఫైనాన్స్ బిల్లును హడావిడిగా ఆమోదించి తొమ్మిది రోజులు ముందుగా పార్లమెంటును ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో చెప్పడానికి సమాధానం లేదు. అయిదు రోజుల క్రితం జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి తొలి సారి ప్రసంగిస్తూ సామాజిక దూరం పాటించాలని చెప్పినప్పటికీ పార్లమెంటు సమావేశాలు యథావిధిగా జరపాల్సి వచ్చింది. ప్రధానమంత్రి తమ పార్టీ సభ్యుల్లోనే కరోనా వైరస్ తీవ్రత విషయమై అంగాహన కలిగించలేక పోయారని అనేక ఘటనలు నిరూపిస్తున్నాయి. లక్నోలో ఒక రాజకీయ నాయకుడు ఏర్పాటు చేసిన విందుకు బిజెపి మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ఆమె కుమారుడు, బిజెపి ఎంపి దుష్యంత్ సింగ్ హాజరు కావడమే ఇందుకు నిదర్శనం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఎన్నికైన తర్వాత ఆ పార్టీ నేతలు సమావేశమై చేతులు చేతులు కలుపుకుని, ఒకరికొకరు తిలకాలు దిద్దుకుని అభినందనలు తెలుపుకున్నారు. వారికెవ్వరికీ కరోనా వైరస్ తీవ్రత తెలియదా?  ప్రజారోగ్య సంబంధిత సంక్షోభాన్ని యుద్ధ ప్రాతిపదికన ఎదుర్కోవడం కన్నా రాజకీయాలే ప్రధానం కాబోలు. 


ఇతర దేశాలతో పోలిస్తే కరోనా వైరస్‌పై పోరులో మనం కనీసం మూడు వారాలు వెనక్కు ఉన్నామన్న విషయం స్పష్టమవుతోంది. కరోనా వైరస్ తీవ్రత గ్రహించిన తర్వాతే  అధికారికంగా విదేశాలనుంచి వచ్చిన వారి గురించి లెక్క మొదలైంది. మార్చి 22 నుంచే మన ప్రభుత్వాలు చర్యల తీవ్రతను పెంచడం ప్రారంభించింది. గత రెండునెలల్లో ఎంత మంది ఎక్కడి నుంచి వచ్చారో కరోనా వైరస్ ఎవరెవరికి సోకిందో లెక్కలేదు. ఆరోగ్య సంరక్షణ అందుబాటు విషయంలో ప్రపంచంలోని 195 దేశాల్లో భారత దేశం 145వ స్థానంలో ఉన్నది. మన దేశంలో ప్రభుత్వాసుపత్రుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో తెలియనిది కాదు. కరోనా వైరస్ తీవ్రత ఎంతో విషమంగా ఉన్న సమయంలో కూడా ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ప్రతిష్ఠాత్మక రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి వెళితే వరండాల నిండా దిక్కుమొక్కులేని జనం పడి ఉండడం కనిపిస్తారు. ఎయిమ్స్, సఫ్దర్ జంగ్ ఆస్పత్రుల్లో పరిస్థితి కూడా అంతే.


కరోనా వైరస్ ధనికులకూ, పేదవారికీ తేడా చూపదని చెబుతున్నారు. కాని ఇళ్లలో పనిచేసే పనిమనుషులు, ఆఫీసుల్లో పనిచేసే ఆఫీసు బాయ్స్, దుకాణాల్లో పనిచేసే వారు, ఆటోరిక్షా, రిక్షాలు నడిపేవారు, గుళ్ల ముందు అడుక్కునే అభాగ్యులు, సెక్యూరిటీ గార్డులు, ఇంకా అనేకానేకమంది శ్రమజీవులు తల దాచుకునేందుకు స్థలం లేక పేవ్‌మెంట్ మీదనే పడుకునే వారు ఈ కర్ఫ్యూ కాలంలో ఎక్కడికి వెళతారో, ఏం తిని జీవిస్తారో ఊహించుకుంటేనే దుర్భరంగా అనిపిస్తోంది.  కరోనా వైరస్ ప్రభావం తీవ్రత ఏమిటో తెలియాలంటే మరో మూడు వారాలైనా వేచి చూడాలని ప్రధానమంత్రి తాజాగా స్పష్టం చేశారు. సంపద సృష్టించేవారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే 76 సార్లు రాయితీలు ప్రకటించారు. మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి సందర్భంగా పన్ను రిటర్ను దాఖలు చేయడం, ఇతర నిబంధలను సరళీకృతం చేయడం గురించి మంగళవారం చర్యలు ప్రకటించారు. సామాన్యుల గురించి ఆమె ఎప్పుడు ఆలోచించడం ప్రారంభిస్తారో?


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Advertisement
Advertisement
Advertisement