Abn logo
Apr 22 2021 @ 00:41AM

ఈ నేలపై రాజకీయ దండయాత్రలా?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు జరిగిన ప్రతి పోరాటం, ప్రతి త్యాగం ఎంతో విలువైనవి. చరిత్రలో నిలిచిపోయినవి. రాష్ట్రం వచ్చిన తరువాత పాలకుడి నైజం మారింది. విధానాలు మారాయి తప్ప ఆత్మగౌరవానికి ఢోకా రాలేదు. ఇప్పటి పాలకులపై సంధించబడుతున్న ప్రతి ప్రశ్న, ప్రతి నిరసన, ప్రతి ఆరోపణ వాస్తవమే కావచ్చు. ఇప్పుడు ప్రజలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. విమర్శిస్తున్నారు. తెలంగాణ వారు, తెలంగాణేతరులు పాలకుల తప్పులను ఎత్తి చూపడంలో తప్పులేదు. మద్దతు ఇవ్వడంలో అభ్యంతరం లేదు కానీ, ఆ వంకతో ఈ నేలపై రాజకీయ దండయాత్రలు చేస్తామంటే ప్రజలు సహించరు. ఘనమైన చరిత్ర గల తెలంగాణ భూమిపుత్రులు స్వాగతించరు, ప్రతిఘటిస్తారు.


నిన్న మొన్నటి వరకు మా పాలన మాకేనని నినదించిన జనం ఇక్కడి యాస, బాస ఒంటబట్టని ఆంధ్ర ప్రాంత నేతను నెత్తిన ఎత్తుకుని ఊరేగరు. భారతదేశంలో అనేక రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. కానీ వారెవరూ అధికారం కోసం షర్మిల వలె పార్టీ పెడతామని అనడం లేదు. ఎందుకంటే  ఒక ప్రాంతం మూలసిద్ధాంతం, అక్కడి ప్రజల అస్తిత్వ భావనల గొప్పదనం వారికి తెలుసు. అది డబ్బుతో కొంటే వచ్చేది కాదు. ఒక ప్రాంత భూమిపుత్రిక లేదా పుత్రుడు అనే హోదా రావడమనేది మాటలకందని వర్ణనాత్మకమైనది.


షర్మిల చెబుతున్న, చేస్తున్న రాజకీయగారడీ తెలుసుకోలేనంత అమాయకులు తెలంగాణలో ఎవరూ లేరు. మెట్టినింటి బిడ్డగా షర్మిలకు ఇక్కడ జీవించే హక్కులు, వృత్తిపరమైన హక్కులు, రాజకీయంలో కొనసాగే హక్కులు ఉంటాయి. కానీ ఇక్కడి ప్రజల మీద అధికారం చెలాయిస్తాననే వాదనాపరమైన సందర్భం ఉండదు. పాలనలో భాగస్వామి కావచ్చు. ఇక్కడున్న, ఇప్పుడున్న పార్టీలలో చేరవచ్చు. తన ఆలోచనలను పంచుకోవచ్చు. ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలలో మనగలిగే స్వేచ్ఛ ఉంటుంది. అంతకుమించిన చొరవగానీ, ఆధిపత్యం గానీ లభించదు. అమెరికా లాంటి దేశంలో తెలుగువారు అక్కడి రాజకీయ పార్టీలలో చేరి వారి మద్దతుతో పాలనలో భాగస్వామ్యం పొందుతున్నారు. అంతే తప్ప కొత్త పార్టీలు పెట్టడం లేదు. అక్కడి రాజకీయ పార్టీలు కల్పించే అనేక హోదాలలోకి ఒదిగిపోతున్నారు. అవకాశాలను పొందుతున్నారు. షర్మిల లాగా స్వయంప్రకటిత అధికారం అంటూ వాదిస్తే అసలుకే మోసం వస్తుంది. జయలలిత కూడా జన్మతః కర్ణాటకకు చెందినవారని అంటుంటారు. ఆమె తమిళనాడులో ఎంజి రామచంద్రన్‌ నెలకొల్పిన పార్టీలో చేరారు తప్ప మొదటగానే సొంతంగా పార్టీ పెట్టలేదు.


భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం చూస్తే షర్మిల పార్టీ పెట్టడానికి అర్హురాలే. అయితే జాతీయ దృక్పథం ఉండే పార్టీ పెట్టాలి గానీ ప్రాంతీయ అస్తిత్వాన్ని సవాలు చేసే స్థితిలో కాదు. ఈ రెండు చాలా భిన్నమైనవి. ఈ లాజిక్‌ తెలియనట్లు నటిస్తే మునిగిపోయేది ఆమే. ఈ నేల మీద ఆమె కలలు నెరవేరవు.


షర్మిల ఆంధ్రప్రదేశ్‌లోనే తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. తన స్థానాన్ని మెరుగుపరచుకోవాలి. అక్కడ ఆమెకు ప్రాంతపరమైన సమస్య ఉండదు. ఆమె ఆంధ్ర ప్రాంత భూమిపుత్రిక అనేది జగద్విదితం. ఈ విషయంలో ఆమెకు అక్కడ ఏ అడ్డంకి ఉండదు. తన అన్న జగన్‌ పరిపాలనలోని లోపాలను ఎత్తి చూపాలి. అక్కడి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలి. అమరావతి రైతులు సంవత్సరకాలంగా రాష్ట్ర రాజధానిని మార్చవద్దని డిమాండ్‌ చేస్తూ, ఆ మేరకు మార్చబోమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి రాజధాని గుండెకాయ వంటిది కనుకే దాని పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. ముప్పై మూడు వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతులకు జగన్‌ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని షర్మిల ఎండగట్టాలి. అపరిపక్వ పనులతో ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్ఠ దిగజారుతున్న విషయాన్ని తన అన్నకు బోధపరచాలి. ఎన్నికల ముందు జగన్‌ గెలుపు కోసం రాష్ట్రమంతా తిరిగి ఒక్క ఛాన్స్‌ ఇవ్వండని అర్థించిన షర్మిల, తన మాటలు మరిచిపోయి ప్రవర్తిస్తే ఆమె నైతికతను కోల్పోయినట్లుగా ప్రజలు భావిస్తారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను విరమించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే పని షర్మిల చేయాలి. తన అన్న జగన్‌ పాలనలో జరుగుతున్న అవకతవకలను సరిదిద్దడానికి తన రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించాలి. తెలంగాణ ప్రభుత్వంపై ఆమె విసురుతున్న మాటలు, సమస్యల పేరిట వదులుతున్న బాణాలు అన్నీ తన ప్రాంతంలోని పాలకులపై ప్రయోగించాలి. డబ్బులున్నాయి గదా అని రాజకీయం చేస్తే బూడిదే మిగులుతుంది. ప్రేమ ఉన్నచోట, ఆదరించే ప్రజలు ఉన్నచోట షర్మిల పోరాటం చేస్తే సఫలీకృతమవుతుంది. తెలంగాణ సమస్యల గురించి ఇక్కడి ప్రజాసంఘాలు, మేధావులు మాట్లాడుతున్నారు. పోరాటం చేస్తున్నారు. షర్మిల చేత పాఠాలు చెప్పించుకునే స్థితిలో తెలంగాణ ప్రజానీకం లేదు అని తెలుసుకోవాలి.


తెలంగాణ ప్రజలు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన కొన్ని మంచి పనులను గుర్తుంచుకుంటారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, కొన్నిరకాల పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు మొదలైన పనులతో ఆయన ప్రజాసమూహంలో ఆత్మీయ నాయకుడిగా నిలిచిపోయారు. ఆయన స్థానాన్ని అలాగే పదిలంగా ఉంచనీయండి. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకుందామని ఆలోచించి రాజకీయ దండయాత్రలు చేస్తే ప్రజలు సెంటిమెంటుతో ఓడిస్తారు. తన తండ్రి రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడిన తీరును, చర్చల పేరుతో పిలిచి ఉద్యమశక్తులను అణచివేసిన తీరును ఇక్కడి వారు మరిచిపోరు.


విద్యార్థులు విత్తులు చల్లి, కలముల కంచెలు వేసి, పాటల పందిరి వేసి, ప్రేమ, త్యాగాలతో పెంచిన తెలంగాణ మొక్కను కాపాడుకుంటాం. దానిని ఇతరులు ముట్టుకోకుండా ఆత్మాభిమానం అనే కోట కడతాం.

జోగు అంజయ్య (జరసం)

Advertisement
Advertisement
Advertisement