Abn logo
May 8 2020 @ 03:21AM

కరోనా పై ‘రాజకీయ’ సమరం

కరోనా విపత్తుకు వ్యతిరేకంగా పోరాడేందుకు అగ్ర శ్రేణి రాజకీయవేత్తలందరూ కలసికట్టుగా ఒక ‘జాతీయ టాస్క్‌ఫోర్స్’ ను ఎందుకు ఏర్పాటు చేయకూడదు? ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వాధికారులకు గానీ లేదా కేంద్రీకృత రాజ్య యంత్రాంగానికి గానీ సకల అధికారాలు అప్పగించడం వల్ల ప్రజల శ్రేయస్సుకు ఏ విధంగాను దోహదం జరగదు. లాక్‌డౌన్ అనంతర సమస్యల పరిష్కారంలో రాజకీయ వేత్తల ప్రమేయం మరింత ఎక్కువగా వుండితీరాలి.


పదవీ ప్రాభవంలో ఉన్న నేతలకు, వారి నిర్ణయాలను అమలుపరిచే లేదా ప్రభావితం చేసే బ్యూరోక్రాట్లకు మధ్య ఉండే సంబంధం ఆసక్తిదాయకమైనది. అదెంత విచిత్ర చాణక్యాలతో ఉంటుందో 1980 దశకపు సుప్రసిద్ధ బీబీసీ టెలివిజన్ కామెడీ ‘యస్ మినిస్టర్’ అద్భుతంగా వెల్లడించింది. మనసులో నిలిచిపోయే ఒక సన్నివేశంలో బ్యూరోక్రాట్ సర్ హంఫ్రీ అప్లిబి, మంత్రి జేమ్స్ హాకెర్ మధ్య సంభాషణ ఎలా సాగిందో చూడండి: ‘ఈ మం త్రిత్వ శాఖను నడిపేందుకు మీరు ఇక్కడ మంత్రిగా నియమితులు కాలేద’ని మంత్రి మహాశయునికి సర్ హంఫ్రీ చెబుతాడు. నిర్ఘాంత పోయిన మంత్రి ఆగ్రహంతో ఇలా ప్రతిస్పందిస్తాడు: ‘ఏమిటి నీ ఉద్దేశం? నేను ఈ మంత్రిత్వ శాఖకు బాధ్యుడినని నేను భావిస్తున్నాను. ఈ శాఖా మంత్రిని నేనని ప్రజలూ విశ్వసిస్తున్నారు’. బ్యూరోక్రాట్ లిప్తపాటు కూడా తొణకలేదు. నిమ్మళంగా ఇలా అన్నాడు: ‘మీ మీద సంపూర్ణ గౌరవంతోనే నేనీ మాట చెబుతున్నాను. మీరు భావిస్తున్నదీ, ప్రజలు విశ్వసిస్తున్నదీ తప్పు’. ‘మరయితే ఈ మంత్రిత్వ శాఖను నడుపుతున్నదెవరు?’అని మంత్రి ఉద్రేకంతో ఊగిపోతూ అడిగాడు. మందహాసం చేస్తూ బ్యూరోక్రాట్ ప్రశాంతంగా, నిశ్చిత స్వరంతో ఇలా సమాధానమిచ్చాడు:‘ నేనే ఈ శాఖను నిర్వహిస్తున్నాను!’


సరే, వాస్తవ జీవితంలో ఈ దేశ ప్రజలకు సర్ హంఫ్రీ అప్లిబే లాంటి వారు ఎంతమంది తటస్థించలేదు కనుక?! భవన్‌ల, సచివాలయాల అజ్ఞాత ‘ఉక్కు చట్రం’ వెనుక పాలనా యంత్రాంగాన్ని అదుపు చేస్తున్న సర్వ శక్తిమంతులు వారు. ఆర్థిక సరళీకరణ అనంతర యుగ కథనాలు మాత్రం విధాన రూపకల్పన విషయంలో ఇప్పుడు వారికి అంతగా ప్రాధాన్యం లేదని ఘోషిస్తున్నాయి. అయితే ఇది పూర్తిగా తప్పుడుభావన. అవును, పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని త్యజించిన తరువాత పూర్వపు లైసెన్స్-పర్మిట్ రాజ్ అధికారాలను ఉపసంహరించుకోవడం జరిగింది. అయినప్పటికీ బ్యూరోక్రాట్లకు ఇప్పటికీ ముఖ్యంగా ఏదైనా ఒక సంక్షోభ కాలంలో వినియోగించేందుకు అపరిమిత అధికారాలున్నాయి. గత ఆరువారాల సంఘటనలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. 


కొవిడ్- 19 ప్రమాద ఘంటికలు అందరికీ విన్పించడం ఆరంభమైన (గత మార్చి నెల నడిమినాళ్ల) నాటి నుంచి, ఈ దేశ పాలనలో ఒక చిన్న బ్యూరోక్రాట్ల బృందం బృహత్తర పాత్ర నిర్వహిస్తున్నది. 19వ శతాబ్దిలో ప్లేగ్ మహమ్మారిని నియంత్రించడానికి తీసుకొచ్చిన ‘ఎపిడెమిక్స్ డిసీజ్ ఆక్ట్-–1897’ చట్టం నుంచి సంక్రమించిన అధికారాలను ఆ బృందం పూర్తిస్థాయిలో చెలాయిస్తోంది. ఆ పురాతన చట్టం తో పాటు ఇటీవలి ‘నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఆక్ట్’ చట్టాన్ని అనుసరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉన్నాతాధికారులు 130 కోట్ల భారతీయుల భవిష్యత్తును నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తున్నారు. 


అసాధారణ పరిస్థితులను అసాధారణ చర్యలతోనే ఎదుర్కోవాలి. నూరేళ్ళకొకసారి విరుచుకుపడే మహమ్మారి నెదుర్కొనేందుకు కఠిన చట్టాలను కట్టుదిట్టంగా అమలుపరచడం మినహా దేశానికి గత్యంతరముండబోదు. ముఖ్యంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను అమలుపరచవలసి వచ్చినప్పుడు కఠినచట్టాలను ప్రయోగించడం తప్పనిసరి. కరోనా విపత్తుపై పోరుకు దేశవ్యాప్త లాక్‌డౌన్ ఒక అత్యంత ఉపయోగకర, ఆవశ్యక చర్య అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అంతకంతకూ విజృంభిస్తున్న వైరస్‌ను కట్టడి చేసేందుకు కొంత వ్యవధి అవసరం. ఆ వెసులుబాటును లాక్‌డౌన్ తప్పక ఇస్తుంది. బ్యూరోక్రాటిక్ ఆదేశాలు, పోలీసు లాఠీల ద్వారా లాక్‌డౌన్‌ను అమలుపరచడం ఒక ఎత్తయితే జీవనాధారాలను పరిరక్షించేందుకు సానుకూల పరిస్థితులను సృష్టించడం మరో ఎత్తు. ఈ రెండూ భిన్నమైన బృహత్తర బాధ్యతలు. ఆరు వారాల క్రితం దేశ పౌరులు అందరూ ఖచ్చితంగా లాక్‌డౌన్ పాటించేలా చేసేందుకు కఠిన చర్యలు చేపట్టడం తప్పనిసరి అయింది.


అయితే ఇప్పుడూ అదే విధంగా వ్యవహరించడం జరిగితే లాక్‌డౌన్ నుంచి నిష్క్రమించడం మరింత సంక్లిష్టమవుతుంది. లాక్‌డౌన్‌ను ఉపసంహరించుకోవడం చాలా జాగ్రత్తగా, అత్యంత మెళకువతో జరగాల్సిన ప్రక్రియ అని నొక్కి చెప్పవలసివున్నది. ఉదాహరణకు ఈ–-కామర్స్ డెలివరీ సిస్టమ్స్ వ్యవహారాలనే తీసుకోండి. తొలుత ఈ డెలివరీ సేవలను ఇంటింటికీ వెళ్ళి అందించే వెసులు బాటును ఈ-–కామర్స్ కంపెనీలకు ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. ఆ తరువాత ఆ సేవలలో నిత్యావసరాలు, నిత్యావసరాలు కానివి అనే ప్రత్యేకతలను సృష్టించారు. దరిమిలా రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఏ సేవలను అం దించాలో నిర్దేశించారు. ఇలా చేయ డం ద్వారా కంపెనీలు, వినియోగదారులలో ఒక అయోమయం నెలకొన్నది. ప్రభుత్వ యంత్రాంగం తన ఆదేశాలపై తరచు వివరణలు ఇవ్వడం కూడా జరిగింది. దురదృష్టమేమిటంటే ఆ వివరణలు వినియోగదారులకు అవసరమైన సరుకులు భద్రంగా చేరేందుకు మరింత అవరోధాలయ్యాయి. కొవిడ్ -19, లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మొత్తం 4147 ఆదేశాలు జారీ చేసినట్టు ఒక అంచనా (హోం, ఆరోగ్య మంత్రిత్వ శాఖలకు ‘వివరణల’ మంత్రిత్వ శాఖలుగా పునఃనామకరణం చేయాలనే జోక్ ఒకటి మీడియా వర్గాలలో బాగా విన్పిస్తోంది మరి).


బలప్రయోగం జరిపే రాజ్యవ్యవస్థ మానవతా దృక్పథంతో వ్యవహరించదు. విషమిస్తోన్న వలస కూలీల సమస్యతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే ఇందుకొక నిండు నిదర్శనం. ప్రభుత్వం చేపట్టిన ప్రతి చర్యలోనూ వలస కూలీల దుర్భర పరిస్థితి పట్ల సహానుభూతి పూర్తిగా కొరవడింది. స్వస్థలాలకు వెళ్లదలుచుకున్నవారికి ఉచిత రైలు ప్రయాణ సదుపాయాన్ని కల్పించడంపై వివాదాన్నే చూడండి. తొలుత రైల్వే మంత్రిత్వ శాఖ రూపొందించిన నోట్‌లో సమాజపు అంచున జీవిస్తున్నవారిపట్ల కరుణ పూర్తిగా కొరవడింది. ‘స్వస్థలాలకు వెళ్ళిపోవడానికి అనుమతించిన ప్రయాణీకులకు స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలే రైలు టిక్కెట్లను అందజేస్తాయి. వారి నుంచే టికెట్ చార్జీని వసూలు చేసి, ఆ సొమ్మును రైల్వే శాఖకు అందజేస్తుంది’ అనేది ఆ నోట్ లోని ఒక అంశం. ఇది స్పష్టం చేస్తున్నదేమిటి? భారత రాజ్యవ్యవస్థ ఒక నగదు వసూలు కేంద్రమనే కాదూ! వలసకార్మికుల విషయానికి వస్తే– వారు విధిగా తమ రైలు టిక్కెట్లకు చార్జీలు చెల్లించాలని, లేనిపక్షంలో ఎక్కడ వున్నవారు అక్కడే వుండిపోవాలని నిర్దేశించడమే కాదూ? లాక్‌డౌన్ పొడిగింపునకు తీవ్ర బాధితులయినవారిని కనీసం స్వస్థలాలకు క్షేమంగా పంపించవలసిన నైతిక బాధ్యత తమకు ఉన్నదని కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ అధికారంలో వున్న ప్రభుత్వాలు ఎందుకు గుర్తించలేదు? ఈ వ్యవహారంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నిజంగా జోక్యం చేసుకోవలసిన అవసరమున్నదా? 


వలస కార్మికుల తరఫున కాంగ్రెస్ నాయకురాలు అలా జోక్యం చేసుకోవడం రాజకీయ ప్రయోజనాలను ఆశించేననడంలో సందేహం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలోనూ వలసకూలీల సంక్షేమానికి ప్రాధా న్యం లభించడం లేదు మరి. అయి తే కరోనా వైరస్‌పై యుద్ధాన్ని పార్టీ విభేదాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు సమైక్యంగా చేయాల్సిన అవసరమున్నదనే సత్యాన్ని సోనియా వ్యాఖ్యలు స్పష్టం చేశా యి. నిజమేమిటంటే కరోనా సంక్షో భం ప్రారంభమైన తరువాత అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ కార్యకలాపాలపై మారటోరియం పాటి స్తున్నాయి. జాతీయ సమైక్యత, సంఘీభావం అవసరమైన సందర్భంలో అందుకు విరుద్ధంగా పార్టీ లు, నాయకుల తమ దైన శైలిలో వ్యవహరించడం దేశ ప్రజల శ్రేయస్సుకు హాని కలిగించడమే అన్న భావన ప్రజల్లో నెలకొన్నది. 


అయితే భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణకు, అర్థవంతమైన చర్చలకు ఆస్కారం లేకపోవడం ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందా? విధాన నిర్ణయాలు ప్రజా స్వామ్యయుతంగా తీసుకోవాలి. అలా కాకుండా పాలకులు నిరంకుశాధికార తత్వంతో వ్యవహరిస్తే అది ప్రజలకు మేలు చేయకపోగా ఎనలేని హాని చేస్తుంది. కరోనా విపత్తుకు వ్యతిరేకంగా పోరాడేందుకు అగ్ర శ్రేణి రాజకీయవేత్తలందరూ కలసికట్టుగా ఒక ‘జాతీయ టాస్క్‌ఫోర్స్’నెందుకు ఏర్పాటు చేయకూడదు? అపార వైవిధ్యపూరిత, ప్రజాస్వామ్య సమాజంలో ప్రజలు ఎన్నుకోని ప్రభుత్వాధికారులకు గానీ లేదా కేంద్రీకృత రాజ్య యంత్రాంగానికి గానీ సకల అధికారాలు అప్పగించడం ఏమాత్రం అభిలషణీయంకాదు. అలా చేయడం వల్ల ప్రజల శ్రేయస్సుకు ఏ విధంగాను దోహదం జరగదు. ఢిల్లీలోనూ, జిల్లా కేంద్రాలలోనూ ఉన్న ఉన్నతస్థాయి బ్యూరోక్రాట్లు తమ విధులను అత్యంత శ్రద్ధతో నిర్వహిస్తూ ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బ్యూరోక్రాట్లకు ప్రజలతో విస్తృత, సన్నిహిత సంబంధాలు ఉండవు. పైగా సాచివేత ధోరణులతో వ్యవహరించే పాలనా వ్యవస్థలకు వారు బందీలు అన్న సత్యాన్నికూడా మనం విస్మరించకూడదు. అందుకే రాబోయే నెలల్లో క్లిష్ట పరిస్థితులను నెదుర్కోవడంలో రాజకీయ నాయకులు మరింత చురుగ్గా, సమైక్యంగా వ్యవహరించవలసిన అవసరమున్నది. లాక్‌డౌన్ అనంతరసమస్యల పరిష్కారంలో రాజకీయవేత్తల ప్రమేయం మరింత ఎక్కువగా వుండి తీరాలి. గత ఆరువారాలుగా ఉన్నతస్థాయి బ్యూరోక్రాట్లు మన కరోనా బాధిత దేశ పాలనా వ్యవహారాలను నిర్వహించారు. ఇక ఇప్పుడు ఏది చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్న విషయమై రాజకీయవేత్తలు తమ మనసులోని మాటను నిర్భయంగా చెప్పాలి.


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Advertisement
Advertisement
Advertisement