Abn logo
May 5 2020 @ 00:49AM

సుభిక్ష సేద్యానికి విధాన బాటలు

ఏ రంగంలో విధాన రూపకల్పనకైనా ఆ రంగంలో పనిచేస్తున్న శ్రామిక ప్రజల, మహిళల, దళితుల, ఆదివాసీల, సామాజికంగా వెనుకబడిన వర్గాల, అంగవైకల్యం కలిగిన వ్యక్తుల ప్రయోజనాల పరిరక్షణ, సహజ వనరుల సమర్థ వినియోగం, పర్యావరణ పరిరక్షణ మార్గదర్శకంగా ఉండాలి. ఈ లక్ష్యసాధనకు దోహదంచేసే పది అంశాలను విధిగా పరిగణనలోకి తీసుకుని సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించాలి. కరోనా విలయానంతరం ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి ఆ సమగ్ర సేద్య విధానమే నాంది కావాలి.


ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి ఆరు సంవత్సరాలు పూర్తికావస్తున్నా తెలంగాణకు ఒక సమగ్ర వ్యవసాయ విధానం లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించాలని, అమలు చేయాలని రైతు సంఘాలు చాలా కాలంగా అడుగుతున్నాయి. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం గ్రామీణ ప్రజలతోనూ, రైతులతోనూ, రైతులతో పనిచేస్తున్నవారితోనూ, వ్యవసాయ రంగంపై అధ్యయనం చేస్తున్నవారి తోనూ ఏనాడూ చర్చించలేదు. రాష్ట్ర పాలకులు ఏకపక్ష వైఖరితో తమకు తోచిన పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారు. అయితే వర్తమానంలో గ్రామీణ ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించడం లేదు. ఎప్పటికప్పుడు ఉపన్యాస ధోరణితో ప్రగతి భవన్ నుండి భవిష్యత్ చిత్రపటాలను ఆవిష్కరించడం మనం గమనిస్తూనే ఉన్నాం.


ఫలితంగా ఇప్పటికీ ఒక సమగ్ర వ్యవసాయ విధానం లేకుండానే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం నడుస్తున్నది. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి. కౌలు రైతుల ఘోష వినబడుతూనే ఉంది. వ్యవసాయేతర అవసరాలకు సాగు భూమి పెద్ద ఎత్తున మళ్ళించడం జరుగుతూనే ఉంది. నిర్వాసితులు, భూసేకరణ బాధితులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. గ్రామీణ మహిళలకు రైతులుగా గుర్తింపు లేకపోవడం, ఆదివాసీల పోడు భూములకు పట్టాలు రాకపోవడం, వ్యవసాయ కూలీల కోసం ఒక సమగ్ర సాంఘిక భద్రతా పథకం లేకపోవడం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం సరిగా అమలు కాకపోవడం మనం చూస్తున్నవే. 


భూ సంస్కరణలు అమలు కావడం లేదు, భూమి లేని ప్రజలకు భూ పంపిణీ కోసం ఒక విధానం లేకపోవడం గమనిస్తూనే ఉన్నాం. గ్రామాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి కావటం లేదు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు అందటం లేదు. రాష్ట్రంలో పంటల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నా, వాటిని తగ్గించేందుకు ఒక విధానమే లేదు. పర్యావరణహిత సుస్థిర, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఏ పథకాలూ అమలు చేయడం లేదు. పంట రుణాలు, పంటల బీమా, యాంత్రీకరణ లాంటి ఇతర సబ్సిడీ పథకాలు అరకొరగా మాత్రమే అమలవడం... ఇప్పటికీ కొనసాగుతున్నది.


సాగునీరు ఉంటే చాలు వ్యవసాయం అభివృద్ధి అయిపోతుందన్న వాదన కానీ, సన్న బియ్యంకు డిమాండు ఉంది కాబట్టి వాటిని మాత్రమే పండించాలనే వాదన కానీ, 24 గంటల విద్యుత్ సరఫరా అద్భుతం అనే వాదన కానీ, అత్యంత అశాస్త్రీయమైనవి. భూమిపై పట్టా హక్కులు ఉన్నవారిని మాత్రమే రైతులుగా గుర్తిస్తామనే వైఖరి కూడా అంతే అన్యాయమైనది. ఒక రాష్ట్రానికి సమగ్ర వ్యవసాయ విధానం ఉండటం ఎంత అవసరమో, అశాస్త్రీయ, అస్థిర, అన్యాయ వైఖరులు కలిగిన ప్రభుత్వ అధినేత చేతుల్లో ఆ విధానం రూపొందించే హక్కు ఉండటమూ అంతే ప్రమాదకరం. ఏ రంగంలో విధాన రూపకల్పనకైనా ఆ రంగంలో పనిచేస్తున్న శ్రామిక ప్రజలు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, సామాజికంగా వెనుకబడిన వర్గాలు, అంగవైకల్యం కలిగిన వ్యక్తుల ప్రయోజనాల పరిరక్షణ, సహజ వనరుల సమర్థ వినియోగం, పర్యావరణ పరిరక్షణ... ఇవన్నీ మార్గదర్శకంగా ఉండాలి. వీటిపై స్పష్టత లేకుండా, చర్చ లేకుండా కేవలం అధికార పీఠాల ఆదేశాలతో రూపొందే విధాన పత్రాలు అసలు సమస్యలను పరిష్కరించక పోగా ఆ విధానంతో వాస్తవ లబ్ధిదారులుగా ఉండాల్సిన వారికి ఏ ప్రయోజనమూ లభించదు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ రంగం కోసం ఒక సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించేటప్పుడు ఈ క్రింద తెలిపిన 10 అంశాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. అవి: 


రాష్ట్ర సహజ వనరులపై (అడవులు, సాగు భూములు, పడావు భూములు) అంచనా ఉండాలి. సాగు భూములను వ్యవసాయేతర అవసరాలకు విచ్చలవిడిగా మళ్ళించడం ఆపాలి. భూమి వినియోగ విధానాన్ని ముందుగా తీసుకురావాలి. సాగునీటి వనరుల నిర్వహణ బాధ్యత (చెరువులు, పంపుసెట్లకు విద్యుత్, ఎత్తిపోతల పథకాల నిర్వహణ) పూర్తిగా ప్రభుత్వమే తీసుకోవాలి. 


రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే నిర్వహించాలి. రెవెన్యూ రికార్డులను పూర్తిస్థాయిలో ఆధునికీకరించాలి. 1973 భూ గరిష్ఠ పరిమితి చట్టం అమలు చేసి మిగులు భూములను వెలికి తీసి భూమిలేని పేదలకు పంచాలి. బీడు భూములను కూడా వ్యవసాయ యోగ్యంగా మార్చాలి. గ్రామాలలో ఉమ్మడి భూములను గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో రక్షించాలి. రాష్ట్రంలో కౌలు రైతులను గుర్తించాలి. వారికి అన్ని రకాల మద్దతు అందించాలి. గ్రామీణ మహిళలను రైతులుగా గుర్తించాలి. మహిళల చేతుల్లో సాగు భూములు ఉండేలా భూ పంపిణీ, రెవెన్యూ, వారసత్వ ఆస్తి పంపిణీ చట్టాలను సమగ్రంగా అమలు చేయాలి. ఆదివాసీ ప్రాంతాలలో అటవీ హక్కుల చట్టం, 1/70 చట్టం, పీసా చట్టం సమగ్రంగా అమలు చేయాలి. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి.


వ్యవసాయ కూలీల కోసం సమగ్ర సాంఘిక భద్రతా చట్టాన్ని రూపొందించాలి అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పరిచి వ్యవసాయ కూలీలను అందులో సభ్యులుగా చేర్చాలి. గ్రామీణ ఉపాధి హామీ కార్మికులను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో భాగస్వాములను చేయాలి. రైతు బీమా పథకాన్ని ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా 75 సంవత్సరాల వయస్సుకు గరిష్ఠ పరిమితిని పెంచి కుటుంబం యూనిట్‌గా చేయాలి.


నేల స్వభావం, సాగునీటి అందుబాటు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలు వేసేలా ప్రోత్సహించాలి. ఈ విషయంపై రైతులలో విస్తృత అవగాహన కల్పించాలి. పంట మార్పిడి జరుగుతున్న సందర్భాలలో విత్తనం నుండి మార్కెటింగ్ వరకు అన్ని రకాల సేవలు సకాలంలో అందేలా ఏర్పాటు చేయాలి. 


రాష్ట్రంలో సాగు భూములలో వేసే పంటలకు అవసరమైన భూసారం పెంపుదల కోసం ప్రత్యేక పథకాలను రూపొందించాలి. రసాయన ఎరువుల వినియోగం తగ్గించడం సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించడం కోసం ఒక సమగ్ర విధానం రూపొందించాలి. సస్య రక్షణ కోసం, కలుపు నివారణ కోసం విష రసాయనాల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసేలా రైతులకు అవగాహన, శిక్షణ అందించాలి. తొలి మూడు సంవత్సరాలు సేంద్రీయ వ్యవసాయం వైపు 50 శాతం పెట్టుబడులు మళ్ళించాలి. 


రాష్ట్రస్థాయిలో సమగ్ర విత్తన చట్టం తేవాలి. విత్తన ఉత్పత్తి చేసే రైతుల, వినియోగదారులైన రైతుల ప్రయోజనాలను కాపాడేలా ఈ చట్టం ఉండాలి. రాష్ట్రంలో అన్ని పంటలకు అవసరమైన విత్తనాలు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేలా ప్రణాళిక రూపొందించాలి.


రైతుబంధు పథకాన్ని వాస్తవ సాగు దారులకు మాత్రమే అమలు చేయాలి. బ్యాంకుల నుండి, సహకార సంఘాల నుండి పంట రుణాలను వాస్తవ సాగు దారులకు మాత్రమే అందించాలి. వ్యవసాయ అనుబంధ రంగాల సబ్సిడీ పథకాలను పూర్తిగా వాస్తవ సాగు దారులకు, గ్రామీణ కుటుంబాల జీవనాధారాల మెరుగుదలకు మాత్రమే అమలు చేయాలి. పంటల బీమా పథకం మార్గదర్శకాలను సవరించి ప్రకృతి వైపరీత్యాల వల్ల (కరువు, వర్షాభావ పరిస్థితులు, వడగండ్ల వానలు సహా) నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వీలుగా తిరగరాయాలి.


రైతులు పండించే కూరగాయలు, పండ్లు, పూలు సహా అన్ని పంటలకు శాస్త్రీయ పద్ధతిలో రాష్ట్రస్థాయిలో ఉత్పత్తి ఖర్చులను లెక్క వేయాలి. దానికి అనుగుణంగా రాష్ట్రస్థాయిలో న్యాయమైన ధరలను ప్రకటించాలి. ప్రభుత్వం, వ్యాపారులు, ప్రాసెసింగ్ కంపెనీలు.. ఎవరు కొన్నా ఈ ధరలు చెల్లించేలా చట్టబద్ధత కల్పించాలి. 


గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, MACS, FPO లలోకి రైతులను సమీకరించాలి. కస్టమ్ హైరింగ్ సెంటర్‌లు, గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, డ్రయింగ్ యార్డులు, ప్రాసెసింగ్ యూనిట్లు లాంటి మౌలిక వసతులను ఈ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించాలి. ఈ సంస్థలకు వడ్డీలేని లేదా అతి తక్కువ వడ్డీలతో బ్యాంకు రుణాలను సమకూర్చాలి. ఒక పది సంవత్సరాల పాటు ఈ సంస్థల కార్యకలాపాలపై జీఎస్టీ మినహాయించాలి. 


రైతులకు, గ్రామీణ ప్రజలకు అన్ని రకాల సేవలు గ్రామ పంచాయతీ పరిధిలో అందేలా గ్రామ రైతు సేవా కేంద్రాలను ఏర్పరచాలి. ఈ కేంద్రాల నిర్వహణకు మానవ వనరులను, వసతులను అందించాలి. సబ్సిడీపై విద్యుత్తు, ఇంటర్నెట్ ఈ–సెంటర్లకు అందించాలి. వ్యవసాయ శాఖ, పరిశోధన, విద్యకు బడ్జెట్లో కేటాయింపులు పెంచి, ఈ మూడు విభాగాలను సామాజిక తనిఖీ కిందకు తీసుకురావాలి.


ఈ పది అంశాలపై రైతులతో, రైతు సంఘాలతో, నిపుణులతో, వ్యవసాయ శాస్త్రవేత్తలతో, ఆర్థికవేత్తలతో విస్తృతంగా చర్చించాలి. విధాన రూపకల్పన తర్వాత దాని అమలు కోసం తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, దానికి అవసరమైన నిధులను కేటాయించడం చాలా ముఖ్యమని మరి చెప్పనవసరం లేదు. కరోనా విలయానంతరం ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి ఈ సమగ్ర సేద్య విధానమే నాంది కావాలి. 

కన్నెగంటి రవి

రైతు స్వరాజ్య వేదిక

Advertisement
Advertisement
Advertisement