Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఠాణా.. ప్రక్షాళన

అవినీతి, నిర్లక్ష్యమే కారణం

నచ్చిన స్టేషన్‌లో తిష్టవేస్తున్న కొందరు

బదిలీ చేసినా అటాచ్‌మెంట్‌ పేరుతో అక్కడికే.. 

సివిల్‌ పంచాయతీలలో  బిజీబిజీగా ఇంకొందరు.. 

లూప్‌లైన్‌లో  వేయాలనుకుంటున్న కొత్వాల్‌ 

ప్రొబేషన్‌ పూర్తి చేసుకున్న వారికి పోస్టింగ్‌? 

భారీగా ఎస్‌ఐల బదిలీలు


హైదరాబాద్/బంజారాహిల్స్‌: అవినీతి.. విధుల్లో నిర్లక్ష్యం, సివిల్‌ పంచాయతీలు.. వెరసి నగర పోలీసింగ్‌ తప్పటడుగులు వేస్తోంది. పోస్టింగ్‌ల్లో నేతల ప్రమేయం పెరిగిపోయింది. బదిలీ చేసినా కొందరు మళ్లీ అదే స్థానానికి వచ్చి పాతుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీసింగ్‌ను గాడిలో పెట్టేందుకు సీపీ అంజనీకుమార్‌ పూనుకున్నట్లు తెలుస్తోంది.  కిందిస్థాయి నుంచి మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎస్‌ఐల స్థాయి నుంచి ప్రక్షాళన ప్రారంభించినట్లు తెలుస్తోంది. సిఫారసులతో తాము కోరుకున్న పీఎ్‌సలలో పని చేస్తున్న వారిని తప్పించి, కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. సిటీ కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటికే సుమారు వంద మందికి పైగా ఎస్‌ఐలను బదిలీ చేయగా, ఇంకో 200 మందిని బదిలీ చేసే అవకాశముందని తెలుస్తోంది. 


పాతుకుపోయారు.. 

నగరంలో అనేక పోలీసుస్టేషన్‌లో సీనియర్‌ ఎస్‌ఐలు పాతుకుపోయారు. ప్రధానంగా పశ్చిమ మండలం, మధ్యమండలంలోని ఎస్‌ఐలు ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నారు. ఒక వేళ ఎవరినైనా బదిలీ చేస్తే, వెంటనే తిరిగి  అదే ఠానాకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే      పెద్ద స్థాయిలో పైరవీలు చేయించుకుని అటాచ్‌మెంట్‌ మీద అయినా వస్తున్నారు. గతేడాది నగర సీపీ సుమారు 60 మంది ఎస్‌ఐలను బదిలీ చేశారు. ఇందులో పశ్చిమమండలానికి చెందిన 35 మంది ఉన్నారు. వీరిలో సగానికి పైగా అటాచ్‌మెంట్‌ పేరిట తాము కోరుకున్న ఠాణాలకు తిరిగి చేరుకున్నారు. అలాగే, నగర పోలీ్‌సస్టేషన్లలో 2010-2012 బ్యాచ్‌కు చెందిన అధికారులే అధికంగా పోస్టింగ్‌ తీసుకున్నట్లు ఇటీవల ఓ నివేదిక సీపీ  చేతికి అందినట్లు తెలిసింది.  వీరంతా సుమారు నాలుగు, ఐదేళ్లుగా తాము కోరుకున్న ఠాణాల్లో పనిచేస్తున్నట్టు తేలింది. 2014 బ్యాచ్‌కు చెందిన వారు కూడా తాము కోరుకున్న ఠాణాలకు బదిలీ చేయించుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వరుసగా రెండుసార్లు ఒకే ఠాణాలో పని చేసిన వారిని లూప్‌లైన్‌లోకి తీసుకెళ్లాలని పోలీస్‌ బాస్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. 


 పోస్టింగ్‌ కోసం పైరవీలు 

తాజాగా రెండు దఫాల్లో సుమారు వంద మంది ఎస్‌ఐల బదిలీ జరిగింది. ఇందులో కొందరికి ఠాణాలో పోస్టింగ్‌లు ఇవ్వలేదు. దీంతో  మెజారిటీ ఎస్‌ఐలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల సిఫారసు లేఖలతో కమిషనర్‌ను కలిసి, తమకు ఠాణా పోస్టింగ్‌లే కావాలని కోరినట్లు తెలిసింది. సిఫారసులతో వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కొత్వాల్‌ హెచ్చరించారని చెప్పుకుంటున్నారు. అయినా, వెనక్కి తగ్గని కొందరు తమకు ఠాణా పోస్టు ఇవ్వకుంటే,  సైబరాబాద్‌ లేదా రాచకొండకు బదిలీ చేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎస్‌బీ, సీసీఎ్‌సలో పని చేయలేమని తెగేసి చెబుతున్నారట..  

ఫిర్యాదుల నేపథ్యంలో.. 

ఎస్‌ఐల బదిలీల వెనుక వారి అవినీతి ఓ కారణమని తెలుస్తోంది.  పశ్చిమ మండలంలో రెండు సంవత్సరాల్లో సుమారు 15 మంది అధికారులు ఏసీబీకి చిక్కారు. మరో 20 మంది అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్‌ బారిన పడారు. ఇలాంటి ఘటనలు నగర పోలీసు శాఖకు మచ్చ తీసుకువచ్చాయి. అలాగే, సివిల్‌ పంచాయితీలు చేయడంతోపాటు కేసుల విషయంలో చాలా మంది భారీగా డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు పలువురు నేరుగా ఆయనకు ఫిర్యాదులు చేశారు. ఠాణాల్లో పాతుకుపోయిన  కొందరు ఎస్‌ఐలు తమ సెక్టార్‌లలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ప్రక్షాళన అవసరమని కొత్వాల్‌  భావిస్తున్నారు.


కొత్తవారితో సాధ్యమేనా?

నగరంలో కొత్తగా రిక్రూట్‌ అయిన 180 మంది ఎస్‌ఐలు ప్రొబెషనరీ పిరియడ్‌ పూర్తి చేసుకుని పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. వీరందరికీ అవకాశం కల్పించేందుకు బదిలీల ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే, నగర పోలీసింగ్‌లో అనుభవజ్ఞులు లేకపోతే శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యమేనా అని కొందరు అనుమానిస్తున్నారు. ప్రముఖుల బందోబస్తు, ఆందోళనలు, ఉత్సవాలు, పండగల సమయాల్లో నగరంలో బందోబస్తు కీలకం. ఇలాంటి కీలక సమయాల్లో కొత్త ఎస్‌ఐల పనితీరు ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకమే. అయితే, నగరంలో ఇప్పటికే 2014, 2019 బ్యాచ్‌ అధికారులు పని చేస్తున్నారని.. కొత్తవారు చేరితే అందరూ కలిసి పని చేసి మంచి ఫలితాలు సాధిస్తారని అంటున్నారు.  

Advertisement
Advertisement