Abn logo
Mar 31 2020 @ 18:02PM

హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసిన వృద్ధుడు.. రసగుల్లా పెట్టిన పోలీసులు..!

లక్నో: లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారి పట్ల పరుషంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించిన వాళ్ల నుంచే తాజాగా ప్రశంసలు అందుకుంటున్నారు యూపీ పోలీసులు.  హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసిన వృద్ధుడి పట్ల మానవత్వాన్ని చాటుకుని శెభాష్ అనిపించుకున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వ్యవహారంపై వివరాల్లోకి వెళితే.. నిన్న లక్నో పోలీసు హెల్ప్‌లైన్‌కి ఓ పెద్దాయన ఫోన్ చేశారు. మధుమేహం కారణంగా తనకు షుగర్ లెవల్స్ పడిపోయాయనీ... అర్జంటుగా రసగుల్లా తీసుకురావాలన్నది దాని సారాంశం. దీనిపై స్పందించిన పోలీసులు హుటాహుటిన రసగుల్లాలు తీసుకెళ్లి ఒంటరిగా ఉన్న ఆ పెద్దాయనను కాపాడారు. దీనిపై హజ్రత్ గంజ్ ఎస్‌హెచ్‌వో సంతోష్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘అవతలి వ్యక్తి స్వరం వినగానే ఇది అబద్దం కాదని గుర్తించాం. వెంటనే బయల్దేరి సదరు కాలర్ రామచంద్ర ప్రసాద్ కేసరి ఇంటికి రసగుల్లాలు తీసుకెళ్లాం. అప్పుడు ఆ ఇంట్లో పెద్దాయన ఒక్కరే హైపోగ్లైసెమియా (చక్కెర స్థాయిలు తక్కువగా ఉండడం) స్థితిలో ఉన్నారు. ముఖం పాలిపోయి కదల్లేని పరిస్థితిలో ఉన్నారు. మేము తీసుకెళ్లిన ఆరు రసగుల్లాల్లో అప్పటికప్పుడు నాలుగు రసగుల్లాలు తిన్నారు. తర్వాత నెమ్మదిగా సాధారణ స్థితికి వచ్చారు... ’’ అని పేర్కొన్నారు.


కేసరి సతీమణి చనిపోగా ఆయన పిల్లలంతా విదేశాల్లో ఉండడంతో ఒక్కరే ఉంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆయన దగ్గరున్న స్వీట్లన్నీ అయిపోవడంతో వేరే దారిలేక పోలీస్ హెల్ప్‌లైన్‌కి కాల్ చేసినట్టు ఆయన తెలిపారు. కాగా యూపీ పోలీసులు ఇటీవల హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసిన ఓ గర్భిణీ మహిళకు ఆహారం అందించిన సంగతి తెలిసిందే. కాగా కొందరు ఆకతాయిలు హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేసి పిజ్జా, పాన్, లిక్కర్ కూడా అడుగుతున్నారని ఓ పోలీస్ అధికారి తెలిపారు. కొందరు పిల్లలైతే హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేసి ఐస్‌క్రీమ్‌లు, రొట్టెలు, ఫుట్‌బాల్ కూడా అడుగుతున్నారట! అయితే నిజంగా అవసరంలో ఉంటే మాత్రం తప్పకుండా తాము స్పందిస్తామని సదరు అధికారి తెలిపారు. 

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement