Abn logo
Oct 14 2021 @ 00:27AM

పోయిరా బతుకమ్మ

- జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
- బతుకమ్మపాటలతో మార్మోగిన ఊరువాడా
- గౌరమ్మకు ప్రత్యేక పూజలు


కామారెడ్డి/కామారెడ్డి టౌన్‌, అక్టోబరు 13:
తెలంగాణ ఆడ బిడ్డల పండుగ బతుకమ్మ.. ప్రపంచంలో ఎక్కడా మహిళలకంటూ ప్రత్యేక పండుగ లేదు. కానీ తెలంగాణ అతివలకు బతుకమ్మ ఆ లోటును పూడ్చింది. తీరొక్క పువ్వును తీసుకొచ్చి అందంగా బతుకమ్మ పేర్చి ఆడపడచులు ఆడిపాడే వేడుక ఇది. ఎంగిలిపూలతో మొదలయ్యే బతుకమ్మ సంబురం తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తోంది. బుధవారం సద్దుల బతుకమ్మ సందర్భంగా నేలపై పూల సింగిడి విరిసింది. తీరొక్క చెట్టుకు పూసిన పూలతో అక్కాచెల్లెళ్లు పేర్చిన బతుకమ్మలతో వాకిళ్లు కొత్తశోభను సంతరించుకున్నాయి. ఆడ బిడ్డల బతుకమ్మ ఆటతో ఊరువాడ సందడిగా మారాయి. మహిళలు గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. తొమ్మిది రోజులు కొలిచిన గౌరమ్మను రాత్రి వేళ నీటిలో నిమజ్జనం చేశారు. అనంతరం పసుపు, గంధాలు పూసుకుని మహిళలు సత్తుపిండి వాయినం ఇచ్చి పుచ్చుకున్నారు. ఏడాదంతా తమ బతుకును చల్లగా చూడాలని గంగమ్మ ఒడికి చేరిన గౌరమ్మను వేడుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టెక్రియల్‌ ప్రాంతంలో 15 ఫీట్ల బతుకమ్మను కమ్మరి శ్రీను తయారు చేయడంతో ఆయనను స్థానిక కౌన్సిలర్‌ శంకర్‌రావు సన్మానించారు. వీక్లీ మార్కెట్‌, సాయి మందిర్‌, ధర్మశాల, హౌజింగ్‌ బోర్డు, శారదమాత ఆలయం, సంకష్టహర గణపతి ఆలయం, గోపాలస్వామి గుడి, దుర్గామాత గుడి, రాజరాజేశ్వరీ మాత ఆలయం, రాజానగర్‌, ఇందిరానగర్‌, వాంబేకాలనీ, గాంధీనగర్‌, ఎన్‌జీవోఎస్‌ కాలనీ, వివేకానందకాలనీ, అయ్యప్పనగర్‌, ముదాంగల్లి, శేర్‌గల్లి, పంచౌరస్తా కూడళ్ల వద్ద మహిళలు బతకమ్మ ఆటలు ఆడారు. అదే విధంగా పలు ప్రధాన కూడళ్లలో, ఆలయాల్లో బతుకమ్మలను ఒక చోట చేర్చి ఆడపడుచులు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మ పండుగ సంబరాల్లో చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా ఆటలాడుతూ ఆనందంగా ఉత్సవాల్లో పాల్గొన్నారు. పలు చోట్ల రంగు రంగుల బతుకమ్మలు కనువిందు చేశాయి. అనంతరం బతుకమ్మ నిమజ్జనానికి ఏర్పాటు చేసిన కామారెడ్డి చెరువు, టెక్రియాల్‌ చెరువు దగ్గరలోని నీటి తొట్టీల్లో నిమజ్జనం చేశారు.  ఇతర ప్రాంతాల నుంచి తమ తల్లిగారి ఇంటికి వచ్చిన ఆడపడచులు తమ పిల్లా పాపలతో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో, ఆయా గ్రామాల్లో ప్రజలు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. గంటల కొద్ది ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడి ఆడపడుచులు వారి యొక్క భక్తిని చాటుకున్నారు. చెరువు గట్లపైనా బతుకమ్మకు నివేదించిన ప్రసాదాన్ని పంచుకున్నారు. పల్లెల్లోని చెరువులన్నీ పూలవనంగా మారాయి. చెరువు గట్లన్నీ జన సంద్రంతో నిండాయి.  అనంతరం పసుపు కుంకుమలు పంచుకున్నారు. వారు తెచ్చిన పులిహోర, మలీద ముద్దలను పంచుకున్నారు. వచ్చే సంవత్సరం మళ్లీ రావే బతుకమ్మ అని పాటలు పాడుతూ ఉత్సవాలు నిర్వహించారు.

సంస్క ృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ : స్పీకర్‌ పోచారం
బాన్సువాడ, అక్టోబరు 13: తెలంగాణ సంస్కృతి, సంప్రదా యాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని రాష్ట్ర శాసన సభాప తి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు సతీమణి పుష్ప పాల్గొని ఆడ పడుచులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్ర ం బతుకమ్మ పండుగతో ప్రసిద్ధి గాంచిందని, తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రపంచంలో ఏ దేశంలో చూసినా బతుకమ్మ పండుగను కుల, మతాలకు అతీతంగా బతుకమ్మ పండుగను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆడ పడుచులు కలిసి, మెలసి ఆడే పండుగ బతుకమ్మ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పోచారం సురేందర్‌ రెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రాం రెడ్డి, మండలంలోని టీఆర్‌ఎస్‌ నాయ కులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్‌ : కామారెడ్డి పట్టణంలోని 25వ వార్డులో గల వాసవీ కాలనీ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. స్థానిక కాలనీలోని మహిళలు, యువతు లు, చిన్నారులు సద్దుల బతుకమ్మను పేర్చి ఆటపాటలతో వేడుక నిర్వహించారు. సంఘం ప్రతినిధులు ఉత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్‌ కారంగుల అంజల్‌రెడ్డి, సంఘం అధ్యక్షుడు గోపు సత్తయ్య, ఉపాధ్యక్షుడు బాలరాజ్‌ గౌడ్‌, రమేష్‌గౌడ్‌, క్రిష్ణ, ప్రధాన కార్యదర్శి క్రిష్ణమూర్తి, కళ్యాణ్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.