Abn logo
Oct 9 2021 @ 23:25PM

పోడు పంచాయితీ

మాచారెడ్డిలోని పోడు భూములు

- జిల్లాలో వేల ఎకరాలలోనే వివాదంలో ఉన్న పోడు భూములు
- 7వేల ఎకరాల పైగా పోడు భూములు వివాదంలో ఉన్నట్లు గుర్తింపు
- ఐదు మండలాల్లో ఈ భూములు ఎక్కువగా ఉన్నాయి
- దశాబ్దాలుగా ఈ భూముల్లో సాగు చేసుకుంటున్న పేదలు
- ఆ భూముల్లో పంటల సాగును అడ్డుకుంటున్న అటవీశాఖ
- పోడు రైతులకు తప్పని కష్టాలు

కామారెడ్డి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): రాజంపేట మండలం షేర్‌శంకర్‌ తండాలో రాజు అనే రైతు తన పోడు భూముల్లో పంటలు సాగు చేస్తుండగా ఫారెస్ట్‌ అఽధికారులు అడ్డుకుని మొక్కలు నాటేందుకు ప్రయత్నం చేయగా స్థానిక రైతులు అడ్డుకున్నారు. గత నెల రోజుల కిందట గాంధారి మండలంలోని గుర్జల్‌ తండా శివారులో ఓ రైతు పోడు భూముల్లో సాగు చేసిన సోయా పంటను సంబంధిత శాఖ అధికారులు తొలగించారు. మాచారెడ్డి మండలంలోని మరో తండా పరిధిలో పోడు భూముల్లో రైతులు సాగు చేస్తున్న పంటలను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఇలా జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా పోడు భూముల వివాదం నెలకొంటూనే ఉంది. పోడు భూముల్లో సాగుచేసుకుంటున్న రైతులకు పట్టాలు ఉన్నప్పటికీ ఆ భూములన్నీ తమవేనంటూ అటవీశాఖ అధికారులు అడ్డు పడుతుండడంపై బాధిత రైతులు మండి పడుతున్నారు. జిల్లాలోని ఆయా ప్రతిపక్షపార్టీల నేతలు సైతం పోడు భూములపై పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం బాధిత రైతుల సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదు. దీంతో పోడు భూముల రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య పంచాయతీ నెలకొంటూనే ఉంటుంది.
జిల్లాలో 7 వేల ఎకరాలకు పైగా వివాదంలో పోడు భూములు
జిల్లాలో గత కొన్ని సంవత్సరాల నుంచి అటవీ, రెవెన్యూ భూములు వివాదంలోనే ఉంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 7వేల ఎకరాలకు పైగా అటవీ భూములు వివాదంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కామారెడ్డి డివిజన్‌ పరిఽధిలో 60,920 ఎకరాలలో అటవీ భూములు ఉండగా ఇందులో వివాదం లేని భూములు 58,434 ఉన్నాయి. వివాదంలో ఉన్న భూములు 2,484 ఎకరాలలో ఉన్నాయి. ఎల్లారెడ్డి డివిజన్‌లో మొత్తం 82,835 ఎకరాలలో ఫారెస్ట్‌ భూములు ఉండగా ఇందులో వివాదంలో లేనివి 80,814 ఎకరాలలో వివాదంలో ఉన్న భూములు 2021 ఎకరాలలో ఉన్నాయి. బాన్సువాడ డివిజన్‌లో 55,319 ఎకరాలలో అటవీ భూములు ఉండగా ఇందులో వివాదం లేని భూములు 52,622 ఎకరాలలో, వివాదంలో ఉన్న భూములు 2,697 ఎకరాలలో ఉన్నాయి. అయితే ఈ వివాదంలో ఉన్న భూములు ఈ ఐదు మండలాల్లోనే ఉన్నట్లు అఽధికారులు గుర్తించారు. మాచారెడ్డి, జుక్కల్‌, నాగిరెడ్డిపేట, గాంధారి, లింగంపేట మండలాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. 5వేల మంది పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. మాచారెడ్డి మండలంలోని రెవెన్యూ భూములు అటవీశాఖ పరిధిలో వస్తాయంటూ ఆ శాఖ అధికారులు కందకాలు తవ్వేశారు. సంయుక్త సర్వే చేపట్టి హద్దులు నిర్ణయించిన అటవీశాఖ అధికారులు ససేమిరా అంటున్నారు.
ఏళ్ల తరబడి పోడు భూముల్లో సాగు
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దశాబ్దాల కాలంగా పోడు సేద్యం నడుస్తోంది. అప్పట్లో పని చేసిన అటవీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వేలాది ఎకరాల అటవీ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. అయితే కొందరు డబ్బు ఉన్నోళ్లు, బడాబాబులు కూడా అటవీ భూములను ఆక్రమించి అమ్ముకున్నారు. వారి నుంచి కొనుగోలు చేసిన ఎంతో మంది పేదలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా అడవిని నరికేసి, భూములను కబ్జా చేసిన వారిని వదిలేసి ఏళ్ల తరబడిగా పంటను సాగు చేసుకుంటున్న వారిపై ప్రతాపం చూపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఇచ్చిన పట్టాలు ఉన్న వారిని వదలడం లేదు. జిల్లాలో వేలాదిమంది రైతులకు అప్పట్లో అటవీహక్కు పత్రాలు అందించారు. వాటి ఆధారంగా రుణాలు తీసుకుని పంటలు సాగు చేసుకున్నారు. అయినప్పటికీ అటవీఅధికారులు అవేమీ పట్టించుకోకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం
రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన, కొత్త రెవెన్యూ, అటవీ చట్టాలను తీసుకురావడం, రెవెన్యూలో  వివాద భూముల పరిష్కారానికి నూతన ఒరవడిని సృష్టిస్తున్నప్పటికీ జిల్లాలో మాత్రం అటవీ, రెవెన్యూ శాఖ అధికారుల మధ్య సమన్వయ లేమీతో వివాదాలలో ఉన్న భూములు పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో ఆ భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్న రైతులకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. హద్దులు తేలాక ఆయా భూములు వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఫలితంగా సాగుదారులు పథకాలకు దూరమవుతున్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజాప్రతినిధులు పలు సమావేశాల్లో చర్చిస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లా కలెక్టరే స్వయంగా ఈ భూములను పరిష్కరించాలని ఇటు ప్రజాప్రతినిధులు అటు బాధిత రైతులు కోరుతున్నారు.
ఇలా చేస్తేనే పరిష్కారం
అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు పలుమార్లు జాయింట్‌ సర్వే నిర్వహిస్తున్నా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడంతో వివాదాలు పరిష్కారం కావడం లేదు. సర్వే నిర్వహించే అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు సంబంధిత శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అటవీ, రెవెన్యూ శాఖల జాయింట్‌ సర్వేకు కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాన్సువాడ రెవెన్యూ డివిజన్‌ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రెండేళ్ల కిందట నస్రూల్లాబాద్‌ మండలంలో సంయుక్త సర్వే నిర్వహించారు. ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం చూపారు. ఇదే మాదిరిగా అధికారులు పాత రికార్డులు పట్టాల ఆధారంగా సంయుక్త సర్వే చేస్తే సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది.