Abn logo
Feb 25 2020 @ 13:36PM

పురుషుల్లో ఈ సమస్యలుంటే పిల్లలు పుట్టడం కష్టమే..!

సురక్షితంగా గమ్యం చేరుకోవాలంటే ప్రయాణికుడు, వాహనం మెరుగ్గా ఉండాలి. గర్భధారణ జరగాలంటే, వీర్యకణాలతో పాటు, వాటిలోని జన్యు పదార్థం ఆరోగ్యంగా ఉండాలి. అండాలను చేరుకోవడం కోసం పయనించే జన్యు పదార్థానికి వీర్యం ఓ వాహనంలా ఉపయోగపడుతుంది. అయితే వీర్యంలో లోపాలు ఉన్నా, వీర్యకణాల్లోని జన్యుపదార్థంలో లోపాలు ఉన్నా అండం ఫలదీకరణ జరగదు. ఒకవేళ జరిగినా మూడు నెలలు తిరగకుండానే అబార్షన్‌ అయిపోతూ ఉంటుంది. సాధారణంగా గర్భం దాల్చకపోవడానికి మహిళల మీదే అపవాదు మోపుతూ ఉంటారు. కానీ దీనిలో పురుషులకూ సమ బాధ్యత ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణాలు..


పరిమాణం: వీర్య పరిమాణం సుమారుగా 1.5 మిల్లీ లీటర్ల నుంచి 2 మిల్లీ లీటర్ల పరిమాణం ఉండాలి. ఇంతకంటే తక్కువ ఉంటే గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతాయి.


వీర్యకణాల సంఖ్య: గర్భధారణకు అవసరమైన వీర్యకణాల సంఖ్య, ఒక మిల్లీలీటరుకు 15 మిలియన్ల నుంచి 30 మిలియన్లు ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే సమస్య ఉన్నట్టు భావించాలి. 


రంగు: వీర్యం రంగు తెల్లగా ఉండాలి. పచ్చగా ఉంటే ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్టు, ఎర్రగా ఉంటే వీర్యంలో రక్తం కలుస్తున్నట్టు అర్థం. ఈ సమస్యలు ఉన్నా గర్భధారణ సాధ్యపడదు.


చిక్కదనం: వీర్యం జిగటగా ఉండాలి. నీళ్లలా ఉంటే హర్మోన్ల సమస్య ఉందని అర్థం. ఇలాంటి పల్చని వీర్యం గర్భధారణ జరగనివ్వదు.


వీర్యం కరిగే తత్వం: చిక్కగా ఉండే వీర్యం గది ఉష్ణోగ్రత దగ్గర 15 నిమిషాల్లో కరిగిపోవాలి. ఇలా జరగకపోతే వీర్యంలో ఇన్‌ఫెక్షన్‌ ఉందని అనుకోవాలి. ఇన్‌ఫెక్షన్‌ గర్భధారణకు ప్రధాన అడ్డంకి!


చీము కణాలు: వీర్యంలో చీము కణాలు ఉంటే, ఇన్‌ఫెక్షన్‌ ఉందని అర్థం చేసుకోవాలి.


కదలికలు: వీర్యంలో కదిలే శుక్రకణాలు 32శాతం ఉంటే సరిపోతుంది. అంతకంటే తక్కువ ఉంటే సమస్య ఉందని భావించాలి.


శుక్ర కణం నిర్మాణం: శుక్ర కణం, తల, తోక, ఆకార నిర్మాణంలో లోపాలు. ఈ లోపాల కారణంగా శుక్రకణం అండంలోకి ప్రవేశించలేదు.


అతుక్కుపోయి ఉండడం: వీర్యకణాలు స్వతంత్రంగా కదలకుండా, ఒకదానికి మరొకటి అతుక్కుపోయి ఉండవచ్చు. ఇందుకు ఇన్‌ఫెక్షన్లే కారణం.


వృషణాల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం: బిగుతైన లోదుస్తులు ధరించడం, ఎక్కువ సమయం పాటు కుర్చీల్లో కూర్చుని పని చేయడం, వేడితో కూడిన వాతావరణంలో పని చేయడం (వంటవాళ్లు, కొలిమి దగ్గర పనిచేసే వాళ్లు) వల్ల వృషణాల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా శుక్రకణాల నాణ్యత దెబ్బతింటుంది.


చికిత్సలు ఉన్నాయి!

జన్యుపరమైన సమస్యలు మినహా వీర్యానికి సంబంధించిన ప్రతి సమస్యకూ చికిత్సలు ఉన్నాయి. ప్రోస్టేట్‌ గ్రంథిలో సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు, హార్మోన్లలో హెచ్చుతగ్గులు, వేరికోసిల్‌ లాంటి పలు ఆరోగ్యపరమైన సమస్యల మూలంగా వీర్యసంబంధ సమస్యలు తలెత్తవచ్చు. వీటిన్నిటినీ మందులతో సరిదిద్దే వీలుంది. వేరికోసిల్‌ చివరి దశకు చేరుకున్నప్పుడు మాత్రమే సర్జరీ అవసరం పడవచ్చు. మొదటి దశలో ఉంటే, మందులతో సరిదిద్దవచ్చు. అలాగే వీర్య సమస్యలకు ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్లు కూడా కారణమే! కాబట్టి వాటిని మానుకోవాలి. చికిత్స సమయంలో ఈ దురలవాట్లను మానుకోకపోతే వైద్య ఫలితం దక్కదు. 


ఈ పరీక్ష ఎవరికి అవసరం?

పెళ్లైన ఏడాది వరకూ:  ఎటువంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించకపోయినా, గర్భం దాల్చనప్పుడు....


ఏడాది లోపే.....

ఈ కింది కోవలకు చెందిన పురుషులు పెళ్లైన ఏడాది లోపే పరీక్ష చేయించుకోవాలి.


వీర్య సంబంధ సమస్యలు అన్నదమ్ములు, దగ్గరి బంధువుల్లో ఉన్న సందర్భాల్లో...

బాల్యంలో వృషణాలకు సర్జరీ జరిగినా, హెర్నియా సర్జరీ జరిగినా.... 

వృషణాలకు ఇన్‌ఫెక్షన్‌ వచ్చి తగ్గిన సందర్భంలో...

కేన్సర్‌ చికిత్స తీసుకున్నవారు   ఫ  స్టెరాయిడ్‌ థెరపీలు తీసుకున్న వారు.


ఇదీ పద్ధతి!

వీర్య పరీక్షకు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లి వీర్యం ఇవ్వవచ్చు అనుకుంటే పొరపాటు. వీర్య పరీక్షలో కచ్చితమైన ఫలితాలు దక్కడం కోసం వీర్యం సేకరించే పద్ధతి, పాటించవలసిన నియమాలు ఇవే! 


వీర్య సేకరణకు మూడు రోజుల ముందు వరకూ (హస్తప్రయోగం, స్వప్న స్ఖలనం, లైంగికంగా కలవడం) స్ఖలనం జరిగి ఉండకూడదు. అలాగే 7రోజుల పాటు స్ఖలనం జరపకుండా వీర్యాన్ని సేకరించకూడదు.


వీర్యాన్ని ఇంటి దగ్గర సేకరిస్తే, ఆ డబ్బాను కాగితంలో చుట్టి శరీరానికి దగ్గరగా ఉంచి, ల్యాబ్‌కు చేర్చాలి. శరీర ఉష్ణోగ్రతకు దగ్గర్లోనే వీర్యకణాలు సజీవంగా ఉంటాయి. కాబట్టి అతి చల్లని, లేదా అతి వేడి వాతావరణంలో వాటిని ఉంచకూడదు.


వీర్యం సేకరించిన 40 నిమిషాల్లోగా ల్యాబ్‌కు అందించాలి.

ల్యాబ్‌లో అందించే స్టెరైల్‌ కంటెయినర్‌లోనే వీర్యాన్ని సేకరించాలి.

స్ఖలనం కోసం ఎటువంటి క్రీమ్‌లూ, నూనెలూ వాడకూడదు.

కండోమ్‌ ఉపయోగించకూడదు.


స్ఖలనం సమయంలో వెలువడే పూర్తి వీర్యాన్ని సేకరించాలి. ఒకవేళ వీర్యం కొంత కింద పడిపోతే పరీక్ష మానుకుని, తిరిగి మూడు రోజుల తర్వాత ప్రయత్నించాలి.


వైరల్‌ ఫీవర్‌ లాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు నెల రోజుల వరకూ పరీక్ష చేయించకూడదు.


పరీక్షా సమయం!

వీర్య పరీక్ష (సెమన్‌ ఎనాలసిస్‌)కు కనీసం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. ఎవరైనా అరగంటలోపు రిపోర్టు అందిస్తున్న పక్షంలో ఆ ఫలితాన్ని అనుమానించాలి.లోపాలు కనిపెట్టవచ్చు!

వీర్య పరీక్ష కూడా రక్త పరీక్ష లాంటిదే! రక్తానికి సంబంధించి ఎన్ని రకాల పరీక్షలు ఉంటాయో, వీర్యానికి సంబంధించి కూడా పలు రకాల పరీక్షలు ఉంటాయి. కాబట్టి ఒకే ఒక పరీక్ష (సెమన్‌ ఎలాలసిస్‌)తో వీర్యంలోని అన్ని లోపాలనూ కనిపెట్టడం కుదరదు. అవసరాన్ని బట్టి వీర్యంలోని ఇతరత్రా అంశాలను గమనించే ఇతర పరీక్షలు అవసరం పడతాయు.


- డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి, ఆండ్రాలజిస్ట్‌

జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌

8332850090 (కన్సల్టేషన్‌ కోసం)