Abn logo
May 4 2021 @ 15:35PM

'విస్టా' నిర్మాణం నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్.. 17న సమగ్ర విచారణ

న్యూఢిల్లీ: సెంట్రల్ విస్టా ఎవెన్యూ రీడవలప్‌మెంట్ ప్రాజెక్టుకు చెందిన నిర్మాణ కార్యక్రమాలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సమగ్ర విచారణను ఈనెల 17వ తేదీకి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. దేశంలో కరోనా ఉధృతంగా ఉన్న కారణంగా ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధారిటీ ఉత్తర్వులకు లోబడి సెంట్రల్ విస్టా ఎవెన్యూ రీడవలప్‌మెంట్ ప్రాజెక్టుకు చెందిన నిర్మాణ కార్యక్రమాలను నిలిపివేయాలని పిటిషనర్లు కోరారు. దీనిపై సమగ్ర విచారణను 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ డీన్ పటేల్, జస్టిస్ జస్మీత్ సింగ్‌తో కూడిన బెంచ్ మంగళవారంనాడు పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ తన వాదనను వినిపిస్తూ, పిటిషన్‌లో పేర్కొన్న విషయాలు వాస్తవమా కాదా అనేది సందేహాస్పదమని, పిటిషన్‌ను తిరస్కరించాలని కోర్టును కోరారు. పిటిషనర్లు అన్య మల్హోత్రా, సోహైల్ హష్మి తరఫున సీనియర్ అడ్వికేట్ సిద్ధార్ధ్ లుథ్రా తన వాదనలు వినిపించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రాజెక్టు పనులు కొనసాగించడం వల్ల ఢిల్లీ ప్రజలతో పాటు ఇందుకోసం పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్నారు. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వులను ఇది స్పష్టంగా ఉల్లంఘించడమేనని కూడా కోర్టు దృష్టికి తెచ్చారు. ఢిల్లీ కరోనా కోరల్లో చిక్కుకున్న తరుణంలో దానిని అదుపు చేసేందుకు రాష్ట్రం, ఏజెన్సీలు చేస్తున్న ప్రయత్నాలకు కూడా ఇది విఘాతమవుతుందని అన్నారు. నిర్మాణం పూర్తి కావడానికి గడువు నిర్దేశించినంత మాత్రాన అది 'నిత్యావసర సర్వీసు' కిందకు ఎలా వస్తుందని పిటిషనర్లు ప్రశ్నించారు. 2020 డిసెంబర్‌లో ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో నిర్మాణ పనులు ఈ ఏడాది జనవరి 5 నుంచి ప్రారంభమయ్యాయి.

Advertisement
Advertisement
Advertisement