Abn logo
Jul 10 2020 @ 04:55AM

ప్లాస్మా థెరపీ ఎప్పుడు?

మరణాలు పెరుగుతున్నా అలసత్వం

స్టేట్‌ కొవిడ్‌ సెంటర్లో కనిపించని ఏర్పాట్లు

దాతలు సిద్ధంగా ఉన్నా.. స్పందన లేదు


కర్నూలు, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 సోకితే నయం చేసే ఔషధాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులకు వినియోగించే మందులు, యాంటి బయాటిక్స్‌, ఇమ్యూనిటీ బూస్టర్లను వినియోగించి ఈ వ్యాధిని నయం చేస్తున్నారు. నేరుగా వైరస్‌ను నిర్మూలించే ఔషధాలు వచ్చేందుకు చాలా సమయం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్‌, మందులు వచ్చినా అవి ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటాయో చెప్పలేమని అంటున్నారు. కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ప్లాస్మా థెరపీ అత్యుత్తమ మార్గమని భావిస్తున్నారు. ఢిల్లీలో ఓ బాధితుడు ప్లాస్మా థెరపీతో కోలుకోవడంతో దీనిపై ఆశలు చిగురించాయి. 


ప్లాస్మా థెరపీకి కర్నూలు బోధనాసుపత్రికి అనుమతి వచ్చింది. యంత్రాంగం ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు మెడికల్‌ కాలేజీలో ఎథిక్స్‌ కమిటీ ఏర్పాటు అయింది. ఐసీఎంఆర్‌ అనుమతి కూడా లభించింది. దాతల నుంచి ప్లాస్మాను కూడా సేకరించారు. కానీ చికిత్సకు కావాల్సిన వసతుల కల్పనలో జిల్లా ప్రభుత్వాసుపత్రి యంత్రాంగం జాప్యం చేస్తోంది. ఆది నుంచి కరోనాను తేలిగ్గా తీసుకుంటున్న జిల్లా వైద్యాధికారులు ఇపుడు కూడా అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కరోనా వ్యాప్తిలోనే కాదు మరణాల పరంగా కూడా రాష్ట్రంలో కర్నూలు జిల్లాదే మొదటి స్థానం. ప్లాస్మా థెరపీతో బాధితులు త్వరగా కోలుకుంటారని, మరణాల రేటు తగ్గుతుందని అంటున్నారు. అయినా జిల్లా వైద్యాధికారులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో తెలియడం లేదు. 


ప్లాస్మా థెరపీ అంటే..

కొత్త వైరస్‌, బాక్టీరియా మానవ శరీరంలోకి ప్రవేశించగానే ప్రతి రక్షకాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఉపయోగపడతాయి. కానీ అందరిలో ఇవి ఒకే మోతాదులో ఉత్పత్తి కావు. ఈ కారణంగా వ్యాధి త్వరగా నయమవ్వదు. ఇలాంటి వారికి అదే వైరస్‌ నుంచి కోలుకున్న వారి రక్తంలోని ప్రతి రక్షకాలను (ప్లాస్మా) సేకరించి ఎక్కిస్తారు. వైరస్‌ నుంచి కోలుకున్న ఇరవై ఎనిమిది రోజుల తర్వాత ప్లాస్మాను సేకరిస్తారు. కోలుకున్న ప్రతి వ్యక్తి నుంచి ప్లాస్మాను సేకరించడానికి వీలు కాదు. అరవై ఏళ్ల లోపు వయసు వారు, దీర్ఘకాలిక రోగాలు లేనివారు, 40 శాతానికి పైగా ప్రతి రక్షకాలు ఉన్న వారి నుంచి మాత్రమే ప్లాస్మాను సేకరిస్తారు. జిల్లాలో కొవిడ్‌ నుంచి కోలుకున్న పలువురు ప్లాస్మా ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. 


సిద్ధం కాని ప్రత్యేక వార్డు

ప్లాస్మా చికిత్స అనుమతులకు దరఖాస్తు చేసేముందు తగిన వసతుల కల్పనపై దృష్టి సారించాలి. అన్ని సిద్ధంగా ఉంటే వెంటనే చికిత్స ప్రారంభించవచ్చు. కానీ జిల్లాలో ప్లాస్మా చికిత్సకు అనుమతులు వచ్చి చాలా రోజులు అయినా ఆ దిశగా అడుగులు పడటం లేదు. కొవిడ్‌ మరణాలు గణనీయంగా పెరిగినా పట్టించుకోవడం లేదు. ప్లాస్మా థెరపీకి ప్రత్యేక వసతులు అవసరం.


బాధితులకు ఏసీ గదులు తప్పనిసరి. గది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే ప్రతిరక్షకాలు చిట్లిపోతాయి. ప్లాస్మాను సేకరించాలంటే కనీసం గంటన్నర సమయం పడుతుంది. ముగ్గురు దాతల నుంచి ప్లాస్మా సేకరించాలంటే ఒక్కొక్కరు కనీసం మూడు గంటలు వేచి ఉండాల్సి వస్తుంది. అంతసేపు దాతలు ఉండటానికి తగిన వసతి లేదు. మూత్ర విసర్జన చేయాలన్నా ఏర్పాట్లు లేవు. దీనిపై స్పందించేందుకు కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ నిరాకరించారు. 

Advertisement
Advertisement
Advertisement