న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని చినాబ్ నదిపై నిర్మిస్తున్న భారీ ఉక్కు వంతెన నిర్మాణం పూర్తికావచ్చినట్టు కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. 476 మీటర్ల పొడవున, విల్లు ఆకారంలో.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనగా చెబుతున్న దీని ఫోటోను ఇవాళ ఆయన ట్విటర్లో షేర్ చేసుకున్నారు. ‘‘మౌళిక వసతుల కల్పనలో మరో అద్భుతం రూపుదిద్దుకుంటోంది. మరో ఇంజినీరింగ్ మైలురాయి దిశగా భారతీయ రైల్వే పరుగులు పెడుతోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా పేరుతెచ్చుకోనుంది...’’ అని గోయల్ ట్వీట్ చేశారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు కశ్మీర్‌ను అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా ఈ విల్లు వంతెనను నిర్మిస్తున్నారు. 2017 నవంబర్‌లో మెయిన్ ఆర్చ్ పనులు ప్రారంభమయ్యాయి.