మ. 2.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
విజయమే లక్ష్యంగా భారత్
భారీ స్టేడియంలో ‘తొలి’ మ్యాచ్
ఇంగ్లండ్‌తో డే/నైట్ టెస్టు
గులాబీ టెస్టు అంటేనే టీమిండియాతో పాటు అభిమానులకు కూడా అడిలైడ్ మ్యాచ్ గుర్తుకురాక మానదు. అందులో కేవలం 36 పరుగులకే కుప్పకూలి అవమానకరంగా ఓడాల్సి వచ్చింది. ఇప్పుడు అతి భారీ స్టేడియంలో.. ఫ్లడ్‌లైట్ల వెలుతురు మధ్య మరో పింక్ బాల్ టెస్టుకు రంగం సిద్ధమైంది. ఓ రకంగా భారత్‌కు ఈ మ్యాచ్ సమరంలాంటిదే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌కు చేరాలంటే కోహ్లీ సేన ఇక ఓడకూడదు. ఇందులోగెలిచి మరో టెస్టును డ్రా చేసుకున్నా ఫర్వాలేదు. ఒకవేళ మిగిలిన రెండింట్లో ఇంగ్లండ్ ఒక్క మ్యాచ్ గెలిచినా భారత్ ఆశలు ఆవిరవుతాయి. మరోవైపు పిచ్‌ను అంచనా వేస్తూ తుది జట్టు ఎంపికలో రెండు జట్లూ ఆచితూచి అడుగులేస్తున్నాయి.
జట్లు (అంచనా)
భారత్: రోహిత్, గిల్, పుజార, కోహ్లీ (కెప్టెన్), రహానె, పంత్, అశ్విన్, అక్షర్, ఇషాంత్, ఉమేశ్, బుమ్రా.
ఇంగ్లండ్: సిబ్లే, క్రాలే, బెయిర్‌స్టో, రూట్ (కెప్టెన్), స్టోక్స్, పోప్, ఫోక్స్, బెస్/వోక్స్, ఆర్చర్, లీచ్, అండర్సన్.
ఇప్పటిదాకాజరిగిన 15 పింక్ బాల్ టెస్టుల్లో పేసర్లు 354, స్పిన్నర్లు 115 వికెట్లు తీశారు.
మొతేరాలో జరిగిన చివరి టెస్టు (2012)లోనూ భారత్-ఇంగ్లండ్ జట్లే తలపడ్డాయి. పుజార అజేయ డబుల్ సెంచరీతో గెలిపించాడు.
పిచ్
మొతేరా పిచ్ పచ్చికతో కళకళలాడుతోంది. దీంతో మ్యాచ్ సాగుతున్నకొద్దీ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండవచ్చు. అయితే ఆరంభంలో మాత్రం బంతి స్వింగ్ అయ్యే చాన్స్ కనిపిస్తోంది. ఇంగ్లండ్ నెట్ సెషన్లోనూ ఇది రుజువైంది. మ్యాచ్ రోజుల్లో సగటు ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా ఉండడంతో వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు.
అహ్మదాబాద్: నాలుగు టెస్టుల సిరీస్ 1-1తో సమమైన వేళ ఆధిపత్యం కోసం భారత్-ఇంగ్లండ్ సమాయత్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో బుధవారం నుంచి మూడో టెస్టు జరుగనుంది. డే/నైట్ టెస్టు కావడంతో ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2.30 నుంచి ఆరంభమవుతుంది. పునర్నిర్మాణం తర్వాత ఈ మైదానంలో జరగబోతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే. స్వదేశంలో భారత జట్టుకిది రెండో గులాబీ టెస్టు కాగా ఓవరాల్‌గా మూడోది. తొలిసారి కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో ఆడిన టెస్టులో గెలవగా.. ఆ తర్వాత గతేడాది చివర్లో అడిలైడ్‌లో ఆసీ్‌సపై ఓడింది. మరోవైపు రెండో టెస్టులో ఇంగ్లండ్పైౖ ఘనవిజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్‌లో అదే జట్టుతో ఆడడం కష్టమే. అందుకే తుది జట్టును ఎంపిక చేయడం టీమ్ మేనేజ్మెంట్కు సవాల్‌గా మారనుంది. అలాగే ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బంతి స్పందించే తీరును బట్టి ఎంపిక ఉండనుంది. ఇక ఇంగ్లండ్ జట్టు కూడా తమ చివరి డే/నైట్ టెస్టులో కివీస్ చేతిలో 58 పరుగులకే కుప్పకూలింది.
ఐదో బౌలర్ ఎవరు?:
రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్ బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నాడు. బౌలింగ్‌లో అతడితోపాటు ఇషాంత్, స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ ఖాయంగానే కనిపిస్తున్నారు. ఇక ఐదో బౌలర్‌గా ఎవరనేది ఆసక్తికరంగా మారింది. దీనికోసం కుల్దీప్, ఉమేశ్ యాదవ్, సిరాజ్‌లతో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా పోటీలో ఉన్నాడు. పింక్ బాల్, మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జట్టు ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో వెళ్లే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే కుల్దీ్‌పకు ఉద్వాసన తప్పదు. ఇక ఉమేశ్, సిరాజ్‌లో ఒకరికి చోటుంటుంది. అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఫిట్‌గా ఉన్న ఉమేశ్ ఆడేందుకు ఎక్కువ చాన్స్ ఉంది. ఇక బ్యాటింగ్ విభాగంలో మార్పులేమీ కనిపించడం లేదు. అయితే కోహ్లీ చివరిసారి శతకం సాధించింది బంగ్లాతో జరిగిన పింక్ టెస్టులోనే. ఈసారి కూడా అదే రీతిన చెలరేగి పరుగుల కరవును తీర్చుకుందామనుకుంటున్నాడు. గిల్, రోహిత్ శుభారంభం అందిస్తే మిడిలార్డర్లో పుజార, రహానె, పంత్ ప్రభావం చూపగలరు.
బెయిర్‌స్టో, అండర్సన్ రాక:
జానీ బెయిర్‌స్టో రాకతో ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగం పటిష్ఠం కానుంది. దీంతో కెప్టెన్ రూట్‌పై భారం తగ్గనుంది. అలాగే విశ్రాంతిలో ఉన్న స్టార్ పేసర్ అండర్సన్ ఈసారి సంధ్యా సమయంలో బంతిని స్వింగ్ చేస్తూ భారత్‌ను ఇబ్బందిపెట్టే అవకాశముంది. ఆర్చర్ కూడా గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చాడు. ఇక రెండు టెస్టుల్లోనూ నిరాశపరిచిన లారెన్స్‌పై వేటు ఖాయమే. క్రాలే ఫిట్‌గా ఉండడంతో ఓపెనర్ బర్న్స్ స్థానం సందేహంలో పడింది. ఇద్దరు స్పిన్నర్లతో దిగితే లీచ్, బెస్ తుది జట్టులో ఉంటారు. లేకుంటే మూడో పేసర్‌గా క్రిస్ వోక్స్ ఆడతాడు.
ఇన్నాళ్లకు సొంతగడ్డపై..
భారత క్రికెట్ జట్టులో స్పీడ్‌స్టర్ బుమ్రా అత్యంత కీలక బౌలర్. అయితే కెరీర్లో 18 టెస్టులు, 67 వన్డేలు, 50 టీ20లు ఆడిన ఈ స్టార్ పేసర్ ఇన్నాళ్లకు స్వస్థలం అహ్మదాబాద్‌లో తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. జట్టులోకి వచ్చి ఐదేళ్లవుతున్నా కెరీర్లో తొలి 17 టెస్టులు విదేశాల్లోనే ఆడిన ఈ స్టార్ పేసర్ ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ద్వారా భారత్‌లో ‘అరంగేట్రం’ చేశాడు. రెండో టెస్టుకు విశ్రాంతి తర్వాత ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో కుటుంబ సభ్యులు, కోచ్‌లు, శ్రేయోభిలాషుల మధ్య ఆడబోతున్నాడు. అటు అతడిని అభిమానించే వారంతా కూడా ప్రత్యక్షంగా అతడి ఆటను వీక్షించేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే తమ జట్టుకు అత్యధిక (22) టెస్టు విజయాలు అందించిన కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీని విరాట్ కోహ్లీ అధిగమిస్తాడు. అలాగే ఇంగ్లండ్ గెలిస్తే తమ జట్టుకు ఎక్కువ విజయాలు (27) అందించిన సారథిగా మైకేల్ వాన్‌ను జో రూట్ వెనక్కినెడతాడు.