Abn logo
Feb 26 2021 @ 03:56AM

మొతేరాలో మోతెక్కించారు

రెండే రోజుల్లో.. ఖేల్‌ ఖతం 

పది వికెట్లతో భారత్‌ ఘనవిజయం

అక్షర్‌కు 11 వికెట్లు

ఇంగ్లండ్‌తో డే/నైట్‌ టెస్టు

ఒకే ఒక్కడు


బంతి బంతికి వికెట్‌ పడుతుందేమో అనేంత ఉత్కంఠ.. ఎటుపోయి ఎటు మలుపు తిరుగుతుందోనని ఉద్విగ్నత మధ్య సాగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని కుప్పకూల్చి.. స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి.. మొతేరాలో మధుర విజయం నమోదు చేసింది.


నరేంద్ర మోదీ స్టేడియంలో ముగిసిన పింక్‌ బాల్‌ టెస్టులో స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. డే/నైట్‌ టెస్టుల్లో 11 వికెట్లు (6+5) తీసిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. కమిన్స్‌ (10) రెండో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు.. గులాబీ టెస్టులో అక్షర్‌ వరుసగా రెండుసార్లు ఐదేసి వికెట్లు తీసిన తొలి బౌలరయ్యాడు. శివరామకృష్ణన్‌, అశ్విన్‌ తర్వాత ఇంగ్లండ్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 5 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గానూ నిలిచాడు.


అద్భుతం అనదగ్గ భారీ క్రికెట్‌ స్టేడియంలో చివరకు గులాబీ టెస్టు కూడా ‘మహాద్భుతం’గానే ముగిసింది. ఏ జట్టూ కనీసం 150 పరుగులు చేయలేదు.. అటు మ్యాచ్‌ కూడా ఆరు సెషన్ల పాటైనా జరగలేదు. కానీ రెండు రోజుల్లోపే పది వికెట్ల తేడాతో భారత్‌ ఘనవిజయం అందుకుంది. ఇదెలా సాధ్యమనుకుంటున్నారా..? అంతా మొతేరా పిచ్‌ మహిమ! 


అక్షర్‌, అశ్విన్‌ స్పిన్‌ మాయ. ప్రత్యర్థి 20 వికెట్లలో ఈ ఇద్దరే 18 తీశారు. గింగిరాలు తిరిగే ట్రాక్‌పై చేసేదేమీ లేకపోవడంతో ఇరు జట్లలోని ఐదుగురు పేసర్లు ప్రేక్షక పాత్ర వహించారు. ముఖ్యంగా అక్షర్‌ రెండు ఇన్నింగ్స్‌లోనూ ఐదేసి వికెట్లు పడగొట్టగా.. అశ్విన్‌ టెస్టుల్లో 400 వికెట్లు  పూర్తిచేశాడు. అంతకుముందు రూట్‌ విజృంభణకు తొలి సెషన్‌లోనే భారత్‌ ఆలౌటైంది. ఆ తర్వాత పర్యాటక జట్టు మరింత దారుణంగా కుప్పకూలడంతో.. 49 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ అవలీలగా ఛేదించింది!!

అహ్మదాబాద్‌: ఎవరి అంచనాలకూ అందని రీతిలో ఆరంభమైన మూడో టెస్టులో తొలిరోజు 13 వికెట్లు.. రెండోరోజు ఏకంగా 17 వికెట్లు.. అంతా స్పిన్నర్ల రాజ్యమే. ముఖ్యంగా అక్షర్‌ (5/32), అశ్విన్‌ (4/48) మాయాజాలం రెండోరోజూ పునరావృతమవడంతో 10వికెట్ల తేడాతో భారత్‌ ఘనవిజయం సాధించింది. మొత్తం ఐదున్నర సెషన్లలోనే మ్యాచ్‌ ముగియడం విశేషం. దీంతో 4 టెస్టుల సిరీస్‌లో భారత్‌ 2-1తో ముందంజ వేసింది.  తొలి సెషన్‌లో భారత్‌ 53.2 ఓవర్లలో 145 పరుగులకే మొదటి ఇన్నింగ్స్‌ను ముగించింది. కెరీర్‌లో తొలిసారిగా రూట్‌ 5 వికెట్లు తీశాడు. లీచ్‌ 4 వికెట్లు పడగొట్టాడు. ఇక 33 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ జట్టు అక్షర్‌, అశ్విన్‌ ధాటికి 30.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత 49 పరుగుల ఛేదనలో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 7.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా అన్నే పరుగులు చేసి గెలిచింది. రోహిత్‌ (25 నాటౌట్‌), గిల్‌ (15 నాటౌట్‌) రాణించారు. మొత్తం 11 వికెట్లు తీసిన అక్షర్‌ పటేల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది.  


రూట్‌ కూల్చాడు:

మొదటి రోజు రోహిత్‌ శర్మ ఆటతీరు చూసి భారత్‌ పటిష్ఠ స్కోరు సాధిస్తుందనుకున్నా.. సీన్‌ రివర్స్‌ అయ్యింది. కెప్టెన్‌ జో రూట్‌ చివర్లో గట్టి పంచ్‌ ఇచ్చాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 99/3తో తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ మరో 20.2 ఓవర్లలోనే చతికిలపడింది. ఒక్క స్పిన్నర్‌తోనే బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను అనూహ్యంగా రూట్‌ ఆదుకున్నాడు. అతడి ధాటికి మరో 46 పరుగులు మాత్రమే చేసి మిగిలిన ఏడు వికెట్లనూ భారత్‌ కోల్పోయింది. ముందుగా రహానె (7), రోహిత్‌ను లీచ్‌ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చాడు. ఇక్కడి నుంచి రూట్‌ మాయాజాలం మొదలైంది. అతడు వేసిన 38 బంతుల్లోనే భారత్‌ మిగిలిన ఐదు వికెట్లను కోల్పోయింది. పంత్‌ (1), సుందర్‌ (0), అక్షర్‌ (0), అశ్విన్‌ (17), బుమ్రా (1) ఇలా అంతా పెవిలియన్‌ చేరారు. రూట్‌ 8 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం. అయితే నాటౌట్‌గా నిలిచిన ఇషాంత్‌ (10) తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సిక్సర్‌ను సాధించగలిగాడు.


 రెండో సెషన్‌లోనే ఆలౌట్‌:

రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్‌ ఈ సెషన్‌లో మామూలు కష్టాలు పడలేదు. ఒక్క ఎక్స్‌ట్రా కూడా ఇవ్వకుండా అక్షర్‌, అశ్విన్‌ బంతులకు జట్టంతా 81 రన్స్‌కే కుప్పకూలింది. స్టోక్స్‌ (25) కాస్త పోరాడాడు. అక్షర్‌ తానేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్‌ తీసి హ్యాట్రిక్‌కు ప్రయత్నించాడు (అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌ చివరి బంతికి కూడా వికెట్‌ తీశాడు). రెండో బంతికి బెయిర్‌స్టోను అంపైర్‌ అవుట్‌గా ప్రకటించడంతో ఆటగాళ్లు కూడా సంబరాలు చేసుకున్నారు. కానీ బెయిర్‌స్టో రివ్యూకు వెళ్లి బతికిపోయాడు. ఆ తర్వాతి బంతికే అతను అవుటవడంతో సున్నా పరుగులకే జట్టు 2 వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో అక్షర్‌ మరోసారి 5 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తొలి 30 ఓవర్లను అక్షర్‌, అశ్విన్‌ వేసి 9 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో తొలిసారి బంతి అందుకున్న మరో స్పిన్నర్‌ సుందర్‌ తన నాలుగో బంతికే అండర్సన్‌ను అవుట్‌ చేసి ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు తెరదిం చాడు. దీంతో భారత్‌కు 49 పరుగుల లక్ష్యమేర్పడింది. ఆ తర్వాత రెండు ఓవర్లు ఆడిన కోహ్లీ సేన 11 రన్స్‌తో డిన్నర్‌కు వెళ్లింది.

సిక్సర్‌తో ముగించాడు:

చివరి సెషన్‌ తొలిబంతినే ఫోర్‌గా మలిచిన గిల్‌ తర్వాత వరుసగా 4,6 బాదడంతో భారత్‌ వేగంగా లక్ష్యం వైపు సాగింది. రోహిత్‌ 8వ ఓవర్‌లో 4,4,6తో మ్యాచ్‌కు సూపర్‌ ఫినిషింగ్‌ ఇవ్వడంతో కోహ్లీసేన సంబరాల్లో మునిగింది.


స్వదేశీ టెస్టుల్లో భారత్‌కు అత్యధిక విజయాలు (22) అందించిన కెప్టెన్‌గా ధోనీ (21)ని దాటేసిన కోహ్లీ టెస్టు ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్‌ తీసిన నాలుగో స్పిన్నర్‌ అక్షర్‌. ఇదే సిరీస్‌లో అశ్విన్‌ కూడా ఈ ఫీట్‌ సాధించాడు.

 డే/నైట్‌ టెస్టుల్లో స్పిన్నర్లు ఎక్కువ వికెట్లు (27) తీయడం ఇదే తొలిసారి  టెస్టుల్లో భారత్‌పై అత్యల్ప స్కోరు (81) నమోదు చేసిన ఇంగ్లండ్ ‌టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఓ మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగియడం ఇది 22వ సారి. భారత్‌కిది రెండోసారి. 2018లో అఫ్ఘానిస్థాన్‌పై భారత్‌ రెండ్రోజుల్లోనే గెలిచింది. 


స్కోరు బోర్డు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 112 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 145  


ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌:

క్రాలే (బి) అక్షర్‌ 0; సిబ్లే (సి) పంత్‌ (బి) అక్షర్‌ 7; బెయిర్‌స్టో (బి) అక్షర్‌ 0; రూట్‌ (ఎల్బీ) అక్షర్‌ 19; స్టోక్స్‌ (ఎల్బీ) అశ్విన్‌ 25; పోప్‌ (బి) అశ్విన్‌ 12; ఫోక్స్‌ (ఎల్బీ) అక్షర్‌ 8; ఆర్చర్‌ (ఎల్బీ) అశ్విన్‌ 0; లీచ్‌ (సి) రహానె (బి) అశ్విన్‌ 9; బ్రాడ్‌ (నాటౌట్‌) 1; అండర్సన్‌ (సి) పంత్‌ (బి) సుందర్‌ 0; మొత్తం: 30.4 ఓవర్లలో 81 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-0, 2-0, 3-19, 4-50, 5-56, 6-66, 7-68, 8-80, 9-80, 10-81. బౌలింగ్‌: అక్షర్‌ 15-0-32-5; అశ్విన్‌ 15-3-48-4; సుందర్‌ 0.4-0-1-1.


భారత్‌ రెండో ఇన్నింగ్స్‌:

రోహిత్‌ (నాటౌట్‌) 25; గిల్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 7.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 49. బౌలింగ్‌: లీచ్‌ 4-1-15-0; రూట్‌ 3.4-0-25-0.

Advertisement
Advertisement
Advertisement