Advertisement
Advertisement
Abn logo
Advertisement

Kuwait లో కష్టపడి సంపాదించిందంతా.. ఇక్కడ వరద మింగేసింది.. కడప వాసుల ఆక్రందన!

కడప జిల్లా నుంచి చాలామంది కువైత్‌కు

ఆ డబ్బుతో పొలాలు, ఇళ్లు కొనుగోలు

వరదలకు ఆ సంపదంతా ధ్వంసం

(కడప-ఆంధ్రజ్యోతి): బతుకుదెరువు కోసం కువైత్‌కు వలస వెళ్లారు. ఎడారి దేశంలో స్వేదం చిందించారు. రూపాయి రూపాయి పొదుపు చేశారు. పరాయి దేశంలో ఎన్నో ఏళ్లు కష్టపడ్డారు. స్వదేశానికి తిరిగి వచ్చి.. ఆ డబ్బుతో కొందరు ఇళ్లు కట్టుకుంటే.. మరికొందరు పొలాలు కొనుగోలు చేశారు. వ్యవసాయం.. పాడి పోషణతో జీవితాలను ఆనందంగా తీర్చిదిద్దుకున్నారు. చెయ్యేరు వరద వారి ఆనందంపై నీళ్లు చల్లింది. అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగడంతో  వారి ఇళ్లు, పొలాలు సర్వం వరద పాలయ్యాయి. కడప జిల్లా రాజంపేట మండలంలోని తోగూరుపేట, రామచంద్రాపురం, సాలిపేట, పులపుత్తూరు, మందపల్లి, గండ్లూరు గ్రామాల ప్రజల దీనస్థితి ఇది. వీటిలో ఏ పల్లెకు వెళ్లినా కన్నీటి వ్యథలే. దేశం కాని దేశానికి వెళ్లి సంపాదించుకొస్తే.. ఉన్నదంతా వరద ఊడ్చుకెళ్లిందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. వీరే కాదు, అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో ఛిద్రమైన పల్లెసీమల్లో ఎవరిని కదిపినా కన్నీటి వరదే. తోగూరుపేట, రామచంద్రాపురం గ్రామా ల్లో శనివారం ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులను కలిసింది. వారంతా వరద బాధలపై ఏకరువు పెట్టారు. జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలు 1.60 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్నాయి. 1.26 లక్షల మంది రైతులు ఆర్థికంగా చితికిపోయారు. 2,560 ఇళ్లు దెబ్బతినగా, 475 ఇళ్లు పూర్తిగా కుప్పకూలాయి. రూ.1370.45 కోట్ల నష్టం జరిగిందని జిల్లా అధికారులు అంచనా వేశారు.

కోటికిపైగా నష్టపోయా..

కువైత్‌ వెళ్లి కష్టపడ్డాం. ఆ డబ్బుతో పాతికేళ్ల క్రితం చెయ్యేరు ఒడ్డున ఐదెకరాల పొలం కొన్నాం. 300 మామిడి చెట్లు పెంచుతున్నాం. నాలుగేళ్ల క్రితం రూ.50 లక్షలతో ఇల్లు కట్టుకున్నాం. అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగి మామిడి తోట కొట్టుకుపోయి ఇసుక దిబ్బగా మారింది. పదేళ్లకైనా ఆ పొలం సాగులోకి వచ్చేలా లేదు. ఇల్లు బయటకు బాగానే కనిపిస్తున్నా.. పునాదులు కుంగిపోయాయి. ఇంట్లో పెద్ద గొయ్యి ఏర్పడింది. రూ.కోటికి పైగా నష్టం జరిగింది. కువైత్‌ వెళ్లి సంపాదిస్తే.. వరద మొత్తం సర్వనాశనం చేసింది. -నాగ హర్షవర్ధన్‌రెడ్డి, రామచంద్రాపురం, రాజంపేట మండలం

భార్య కూడా కొట్టుకుపోయింది..

శుక్రవారం వరద వచ్చింది. నేను నది దగ్గరకు వెళ్తున్నాను. నాకోసం నా భార్య ఈశ్వరమ్మ వచ్చింది. అంతలో వరద చుట్టేసింది. నన్ను కూడా ముంచేసింది. అర కిలోమీటరు వెళ్లాక ఓ చెట్టుకు తగులుకొని నిలబడ్డాను. ఐదారు అడుగులు వెళ్లి ఉంటే గుంతలో పడి కొట్టుకుపోయేవాడినే. నా భార్య శవం వారం తరువాత దొరికింది. ఇంట్లో 200బస్తాల ధాన్యం, సామగ్రి సర్వం వరద పాలయ్యాయి. -గాడి నారాయణరెడ్డి, రామచంద్రాపురం

సర్వం వరద మింగేసింది..

నాకు 81 ఏళ్లు. ఆ రోజు ఇంట్లో పడుకున్నాను. వరద వస్తోందని ఊర్లో జనం అంతా దాసాలమ్మ గుడిపైకి ఎక్కారు. నన్ను కూడా పిలిచినారంట, వినిపించలేదు. గుడి దగ్గర నేనొక్కడినే కనిపించకపోవడంతో శివరామయ్య వేగంగా వచ్చి.. నన్ను తీసుకొని పరుగుపెట్టాడు. గుడి దగ్గరకు చేరుకున్నాం. ఇంతలో వరద ముంచేసింది. శివరామయ్య రాక ఓ క్షణం ఆలస్యమైతే ఆ వరదలోనే నేను కొట్టుకుపోయేవాడిని. ఇల్లంతా నేలమట్టమైంది. సర్వం వరద మింగేసింది. -పెనుమాడు పెంచలయ్య, తోగూరుపేట


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement