Abn logo
Oct 13 2020 @ 01:37AM

విత్తన వేదన!

Kaakateeya

రైతులకు అందని వేరుశనగ విత్తనాలు

ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్న వైనం..


ధారూరు: మండలంలో యాసంగి వేరుశనగ విత్తనం విత్తే పనులు ముమ్మరంగా సాగుతున్నా  సబ్సిడీ వేరుశనగ విత్తనాల జాడలేదు. దీంతో రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లి వేరుశనగ విత్తనాన్ని ఖరీదు చేసి తీసుకువచ్చి విత్తుకుంటున్నారు. వేరుశనగపై సబ్సిడీ ఎత్తివేయటంతో విత్తన సరఫరాలో జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈసారి వర్షాలు ఎక్కువగా కురియటంతో బోర్లలో నీటి మట్టాలు పెరగటమే కాక, చెరువులు, వాగుల్లో నీరు పుష్కలంగా ఉంది. దీంతో చాలా గ్రామాల్లో  రైతులు వేరుశనగ పంట సాగు చేస్తున్నారు. ధారూరు మండలపరిధిలోని రాంపూర్‌తండా, గట్టేపల్లి, రుద్రారం, ధారూరు, దోర్నాల, గురుదోట్ల, అంపల్లి, నాగారం తదితర గ్రామాల్లో వేరుశనగ విత్తే పనులు జోరుగా సాగుతున్నాయి. రాంపూర్‌ తండాలోని పొలాల్లో వేరుశనగ మొలకెత్తి ఇప్పటికే కలుపుతీస్తున్నారు. యాసంగిలో సుమారు 400 నుంచి 500 ఎకరాల విస్తీర్ణంలో వేరుశనగ సాగు ఉండవచ్చని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.


వేరుశనగ విత్తనానికి డిమాండు ఉన్నా విత్తనం సరఫరా లేదు. దీంతో రైతులు గద్వాల, తాండూర్‌, పరిగి తదితర ప్రాంతాల నుంచి విత్తనాన్ని కొని తెచ్చి విత్తుకుంటున్నారు. వేరుశనగ(గింజలు) విత్తనం క్వింటాల్‌కు రూ.9500, వేరుశనగ కాయలు (గింజలు తీయనివి) క్వింటాల్‌కు రూ. 5,500లకు ధరకు ఖరీదు చేసి రైతులు కొనుగోలు చేస్తున్నారు. సబ్సిడీపై వేరుశనగ విత్తనం సరఫరా కాకపోవటంతో రైతులు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేరుశనగ విత్తనం ఇంకా రాలేదని, విత్తనం వచ్చినా సబ్సిడీ ఉండదని వ్యవసాయ అధికారులు రైతులకు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ సీడ్స్‌ వారు మొదటగా వేరుశనగ విత్తన ధర క్వింటాల్‌కు రూ.8,400లుగా నిర్ణయించారు. ఆ తర్వాత ప్రస్తుతం క్వింటాల్‌కు రూ. 6,000లకు తగ్గించినట్లు తెలంగాణ సీడ్స్‌ కార్యాలయం నుంచి పీఎసీఎస్‌ అధికారులకు సమాచారం అందింది. విత్తన సమయం దాటిన తర్వాత విత్తనం వచ్చినా ఫలితం లేదని రైతులు పెదవి విరుస్తున్నారు. 

Advertisement
Advertisement