Abn logo
Mar 20 2020 @ 00:13AM

నిర్భయకు న్యాయం జరిగింది

ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడే రోజు ఇది. ‘నిర్భయ’ను కిరాతకంగా హత్యాచారం చేసిన దోషులకు దారులన్నీ మూసుకుపోయాయి. ఇక ఉరే మిగిలింది. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ తలారి పవన్‌కుమార్‌ జల్లాద్‌పై పడింది. ఢిల్లీలోని తీహార్‌ జైలు అధికారుల అభ్యర్థన మేరకు నలుగురు నేరస్థులకు ఉరితాళ్లు బిగించేందుకు సిద్ధమైన ఆయన జీవన చిత్రం ఇది... 


పవన్‌ కుమార్‌ జల్లాద్‌... ఇప్పుడీ పేరు దేశమంతా మారుమోగుతోంది. ‘జల్లాద్‌’ అంటే ‘తలారి’. ఆయనకు ఇది వంశపారంపర్యంగా వచ్చిన వృత్తి. 1988లో పాటియాలా కేంద్ర కారాగారంలో ఇద్దరిని ఉరి తీసినప్పుడు... తాత కల్లూరామ్‌కు పవన్‌ సహాయకుడిగా వ్యవహరించారు. అలా 23 ఏళ్ల వయసులో ఆయన వృత్తి జీవితం ప్రారంభమైంది. పవన్‌ తండ్రి కూడా తలారీనే! ‘పాటియాలా జైల్లో తాతకు సహాయకుడిగా ఉండడంవల్ల చాలా విషయాలు తెలుసుకోగలిగాను. న్యాయసూత్రాలకు లోబడి ఉరిశిక్షను ఎలా అమలు చేయాలో అనుభవం గడించాను. అందుకే వృత్తిలో అడుగుపెట్టాక ఆ మొట్టమొదటి రోజు నాలో ఎలాంటి భావోద్వేగాలు లేవు’ అంటారు పవన్‌. నేరం చేసినవాడు శిక్ష అనుభవించాల్సిందేనన్నది ఆయన చెప్పే మాట. 


ఇదే మొదటిసారి... 

నిబంధనల ప్రకారం ‘నిర్భయ’ కేసులో నలుగురు దోషులు... ముకేష్‌ సింగ్‌, వినయ్‌ శర్మ, అక్షయ్‌ సింగ్‌, పవన్‌ గుప్తాలను ఒకేసారి ఉరి తీయాలి. నిజానికి ఇది అంత సామాన్యమైన విషయం కాదు. దీని కోసమే మీరట్‌లో ఉండే పవన్‌ను తీహార్‌ జైలు అధికారులు ప్రత్యేకంగా పిలిపించారు. జీవితంలో తాను ప్రొఫెషనల్‌ తలారిగా మారిన తరువాత ఎవరి సహాయం లేకుండా ఉరిశిక్ష అమలు చేయడం పవన్‌కు ఇదే తొలిసారి. అయినా ఆయన ఎంతో నిబ్బరంగా ఉన్నారు. ‘నలుగురినీ ఒకేసారి ఉరి తీయడానికి ప్రత్యేకమైన టెక్నిక్‌ ఏమీ అవసరం లేదు. సహాయకులూ అక్కర్లేదు. నేనొక్కడినే చాలు’ అంటారు పవన్‌. ‘ప్రతీకారం తీర్చుకోవడం తప్ప మరేదీ లేదు’ అనేది ఉరిశిక్ష గురించి పేరుపొందిన తలారీ అల్బర్ట్‌ పెర్రీపాయింట్‌ అభిప్రాయం. 1931 నుంచి 1956 మధ్య కాలంలో ఆయన 400 పై చిలుకు మందిని ఉరి తీశారు. కానీ అల్బర్ట్‌తో పవన్‌ ఏకీభవించరు. ‘నిర్భయను అతి దారుణంగా అత్యాచారం చేసి, హతమార్చిన నేరస్థులను ఉరి తీస్తే నాకూ, ఆమె తల్లితండ్రులకూ, అందరికీ రిలీఫ్‌గా ఉంటుంది’ అంటూ ఆ మధ్య ఆయన వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం. 


ఎప్పుడైతే ‘నిర్భయ’ దోషుల తలారిగా పవన్‌ పేరు బయటకి వచ్చిందో... అప్పటి నుంచి అయనకు కంటి మీద కునుకు ఉండడంలేదట! అందుకు కారణం ఎక్కడికి వెళ్లినా మీడియా చుట్టుముడుతోందట! ‘కనీసం రెండు గంటలు కూడా నిద్రపోనివ్వడం లేదు’ అంటూ ఓ సందర్భంలో ఆయన దీనంగా చెప్పారు. వంశంలో మూడో తరం తలారీ అయిన పవన్‌... తనకు ఇప్పుడు వచ్చే జీతం ఏ మూలకూ సరిపోవడంలేదంటున్నారు. ‘నాకు వచ్చే జీతం రూ.5వేలు. ఆ డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకురావడం చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం ఆలోచించి జీతాన్ని రూ.20 వేలకు పెంచాలి’ అని ఆయన కోరుతున్నారు. 


కుమార్తెదీ అదే మాట... 

కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా పవన్‌ ఎనిమిదో తరగతిలోనే చదువు మానేశారు. బట్టలు ఉతుకుతూ, టైర్లకు పంక్చర్లు వేస్తూ... ఆ వచ్చే చిల్లర డబ్బులతోనే సంసారం నెట్టుకొచ్చారు. పేదలకు ఇచ్చే సింగిల్‌ రూమ్‌ ఇంటిలోనే నివాసం. కానీ... పవన్‌ కుటుంబం పెద్దది. ఐదుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. అందరూ ఆ ఒక్క గదిలోనే తలదాచుకోవాలి. అయితే ఆయన పిల్లల్లో ఎవరూ ఇటువైపు రాలేదు. ఉన్నంతలో కష్టపడి చదువుకున్నారు. అందరి కన్నా చిన్న కూతురు వందన మాస్టర్స్‌ చేస్తున్నారు. పిల్లలంతా తమ తండ్రి వృత్తిని గొప్పగా చెప్పుకొంటారు. ‘మమ్మల్ని చుట్టుపక్కలవాళ్లు సెలబ్రిటీల్లా చూస్తారు. నిర్భయ కేసులో దోషులకు ఉరే సరైన శిక్ష’ అంటారు వందన కూడా! 

Advertisement
Advertisement
Advertisement