Abn logo
Sep 28 2020 @ 04:27AM

దళితుల పదోన్నతుల్లో పంచాయితీ!

ఖాళీల భర్తీలో రిజర్వేషన్ల అమలుపై వివాదం 

నాలుగేళ్ల నుంచి నలుగుతున్న ఫైలు 

ప్రస్తుతం సీఎం జగన్‌ వద్దకు.. 

నిర్ణయం కోసం ఉద్యోగుల ఎదురుచూపు


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

దళిత ఉద్యోగులకు పదోన్నతులపై వివాదం నెలకొంది. ఆర్థిక శాఖలో ఎస్సీ కోటాకు చెందిన రెండు పోస్టుల భర్తీలో రిజర్వేషన్ల అమలు చర్చనీయాంశంగా మారింది. ఈ అంశానికి సంబంధించిన ఓ ఫైలు నాలుగేళ్ల నుంచి సచివాలయంలోనే చక్కర్లు కొడుతోంది. తాజాగా అది సీఎం జగన్‌ వద్దకు చేరింది. ఖాళీల భర్తీలో ఆయా కేటగిరీల ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలా... రోస్టర్‌ పాయింట్‌ ప్రకారం ప్రమోషన్‌ ఇవ్వాలా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై ఎస్సీ/ఎస్టీ ఉద్యోగులు, జనరల్‌ ఉద్యోగులు చీలిపోయి ఎవరి డిమాండ్లు వారు వినిపిస్తున్నారు. సమస్య ఆర్థిక శాఖలో మొదలైనప్పటికీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు సంబంధించిన అంశం కావడంతో వారంతా సీఎం నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తం ఉద్యోగుల సంఖ్యలో తగినంత ప్రాతినిధ్యం లేకపోతే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించవచ్చన్న రాజ్యాంగ నిబంధన ప్రకారం ఆయా వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారు. దాని ప్రకారం ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో తగినంత ప్రాధాన్యం లేనప్పుడు మాత్రమే రిజర్వేషన్ల కింద ప్రమోషన్లు కల్పించడానికి అవకాశం ఉంటుంది.


ప్రాతినిధ్యం సరిపడా ఉన్నప్పుడు సీనియారిటీ, మెరిట్‌ విధానం ప్రకారం పదోన్నతులు ఇస్తారు. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కోటా పోస్టులు భర్తీ చేసేటప్పుడు ఆ వర్గాలకు చెందిన ఉద్యోగుల ప్రాతినిధ్యం సరిపడా ఉంటే ఎస్సీ, ఎస్టీ రోస్టర్‌ పాయింట్లు వచ్చినప్పుడు వాటిని జనరల్‌ పేరిట మార్పుచేసి జనరల్‌ కేటగిరీ ఉద్యోగులతో భర్తీ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కోటాలో తగినంత ప్రాతినిధ్యం లేనప్పుడు, ఎస్సీ, ఎస్టీ రోస్టర్‌ పాయింట్లు లేకపోతే వారికి రిజర్వ్‌ చేసిన ఆ పోస్టులను జనరల్‌ కేటగిరీ ఉద్యోగులతో భర్తీ చేస్తున్నారు. రిజర్వుడు పోస్టులను అన్‌ రిజర్వుడుతో భర్తీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, చట్ట విరుద్ధమని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు గత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ (ఆర్‌వోఆర్‌) విషయంలో నోడల్‌ విభాగం అయిన సాంఘిక సంక్షేమశాఖ కూడా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్‌ చేసిన పోస్టులను వారితోనే భర్తీ చేయాలని స్పష్టం చేసింది. అయితే, ఈ అంశంపై గత ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలోపే ఎన్నికలు వచ్చి రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. 


ఇదీ వివాదం...

ఆర్థికశాఖలో మొత్తం 12 సహాయ కార్యదర్శి పోస్టులున్నాయి. ఆర్‌ఓఆర్‌ ప్రకారం వీటిలో 15శాతం ఎస్సీలకు అంటే 2 పోస్టులు, 6శాతం ఎస్టీలకు అంటే ఒక పోస్టు, మిగిలిన 9 జనరల్‌ ఉద్యోగులతో భర్తీ చేయాల్సి ఉంది. 2016 సెప్టెంబరు 1 నాటికి వీటిలో 2 ఖాళీలు వచ్చాయి. మిగిలిన 10 పోస్టుల్లో ఒకరు ఎస్టీ ఉద్యోగి కాగా, 9మంది జనరల్‌ ఉద్యోగులు ఉన్నారు. ఖాళీ అయిన రెండు పోస్టులు ఎస్సీ ఉద్యోగులకు రిజర్వ్‌ అయినట్లు స్పష్టమవుతోంది. కానీ, ఆ 2 ఖాళీలు జనరల్‌ కేటగిరీకి చెందిన 81, 82 రోస్టర్‌ పాయింట్లలో ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా జనరల్‌ ఉద్యోగులతోనే భర్తీ చేయాలని ఆ విభాగానికి చెందిన ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే రిజర్వేషన్ల ప్రకారం అవి ఎస్సీలకు కేటాయించినవి కాబట్టి వారితోనే భర్తీ చేయాలని ఎస్సీ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. 


గతంలో ఉల్లంఘన 

అంతకుముందు 77వ రోస్టర్‌ పాయింట్‌ భర్తీ విషయంలో కొంత ఉల్లంఘన జరిగింది. అది ఎస్సీ ఉద్యోగులకు ఉద్దేశించినది. ఈ రోస్టర్‌ పాయింట్‌ భర్తీచేసే సమయానికి ఎస్సీ, ఎస్టీ విభాగం నుంచి తగినంత ప్రాతినిధ్యం ఉండటంతో జనరల్‌ కేటగిరీకి మార్పుచేసి జనరల్‌ ఉద్యోగితో భర్తీ చేశారు. అదే తరహాలో ప్రస్తుతం తగినంత ప్రాతినిధ్యం లేదు కాబట్టి జనరల్‌ రోస్టర్‌ పాయింట్లను ఎస్సీ కేటగిరీకి మార్చి ఆర్‌వోఆర్‌ ప్రకారం భర్తీ చేయాలని ఎస్సీ ఉద్యోగులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఫైలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నుంచి సీఎం వద్దకు వెళ్లింది. ఈ అంశంపై సీఎం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

Advertisement
Advertisement
Advertisement