Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేడుకగా పంచమితీర్థం

శ్రీవారి నుంచి కానుకగా అందిన నగను చూపుతున్న అర్చకులు - వాహన మండపంలో నిర్మించిన చిన్న పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తున్న అర్చకులు

ధ్వజావరోహణంతో ముగిసిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు 


తిరుచానూరు, డిసెంబరు 8: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో బుధవారం ఉదయం పంచమితీర్థం.. రాత్రి ధ్వజావరోహణంతో కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఉదయం పల్లకి ఉత్సవం నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని వాహన మండపానికి వేంచేపు చేశారు. తిరుమల నుంచి శ్రీవారు పంపిన సారెతో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు వేదమంత్రాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించారు. అమ్మవారు అవతరించిన పంచమితిథిని పురస్కరించుకుని శాస్త్రోక్తంగా పంచమితీర్థం నిర్వహించారు. ఆలయం వద్దగల వాహన మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన చిన్న పుష్కరిణిలో ఉదయం 11.52 గంటలకు కుంభలగ్నంలో పంచమితీర్థం ఘట్టం నిర్వహించారు. దీనికోసం టీటీడీ గార్డెన్‌ విభాగం ఆధ్వర్యంలో తామరపువ్వులు, ఆపిల్‌, గ్రీన్‌ఆపిల్‌, ద్రాక్ష, పైనాపిల్‌, రోజా, సంపంగి, కట్‌ ఫ్లవర్స్‌తో వాహన మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. రాత్రి ధ్వజావరోహణం నిర్వహించారు. 

ఆయా కార్యక్రమాల్లో జియ్యర్‌స్వాములు, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి దంపతులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లం, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, టీటీడీ సభ్యుడు పోకల అశోక్‌కుమార్‌, అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు వీరబ్రహ్మం, సదాభార్గవి, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, డిప్యూటీఈవో రాజేంద్రుడు, రమే్‌షబాబు, కస్తూరిబాయి తదితరులు పాల్గొన్నారు. గురువారం సాయంత్రం 4-7 గంటల మధ్య ఆలయంలో పుష్పయాగం జరగనుంది. 


తిరుమల నుంచి సారె

పంచమితీర్థం సందర్భంగా శ్రీవారి తరపున పద్మావతీదేవికి సారె ఇవ్వడం ఆనవాయితీ. అందులో భాగంగా తిరుమల నుంచి టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి సారెను తీసుకొచ్చి అలిపిరి వద్ద జేఈవో వీరబ్రహ్మంకు అప్పగించారు. అక్కడ్నుంచి ఏనుగు అంబారీపై పెట్టుకుని తిరుచానూరు పసుపు మండపం వద్దకు సారె తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి ఆలయం వద్ద ఈవో జవహర్‌రెడ్డికి అందజేయగా ఆయన వాహనం మండపంలో అర్చకులకు అప్పగించారు. 


అమ్మవారికి కానుకగా ఆభరణాలు 

సారెతో పాటు 825గ్రాముల కెంపులు, పచ్చలు, నీలం, ముత్యాలు పొదిగిన బంగారు పతకం, రెండుబాజీ బందులును శ్రీవారి తరపున అమ్మవారికి కానుకగా అందించారు. ఈ ఆభరణాలను భక్తుల సమక్షంలో తిరుమంజనంలో అమ్మవారికి అలంకరించారు. 

Advertisement
Advertisement