Abn logo
Jun 2 2020 @ 04:08AM

మార్పు దిశగా పాలమూరు

ఆరేళ్లలో మెరుగైన సాగునీటి వసతి

నత్తనడకన పాలమూరు ఎత్తిపోతల పనులు

కోర్టు కేసులు, వివాదాలతో జాప్యం

నిమ్స్‌కు ధీటుగా జనరల్‌ ఆస్పత్రిలో సౌకర్యాలు

కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలనా సౌలభ్యం

మొదటి ఇరిగేషన్‌ ప్రాజెక్టు, మొదటి మెడికల్‌ కళాశాల జిల్లాకే..


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్ల కాలంలో పాలమూరు మార్పు దిశగా అడుగులేస్తోంది. సమైక్య రాష్ట్రంలో వెనుకబాటుకు ప్రతీకలా నిలిచిన జిల్లాలో ప్రస్తుతం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని నాలుగు పెండింగ్‌ ప్రాజెక్టులను దాదాపు పూర్తి చేయడం 1.50 లక్షల ఎకరాలకు పరిమితమైన సాగునీటి సదుపాయం కాస్తా ఇప్పుడు 8 లక్షల ఎకరాలకు చేరింది. పాలనా సౌలభ్యం కోసం పాలమూరును ఐదు జిల్లాలుగా విభజించారు. తెలంగాణ మొదటి ప్రభుత్వంలో ఆశించిన రీతిలో ప్రయోజనాలు దక్కలేదని భావిస్తున్న తరుణంలో ఇకపై పాలమూరు కేంద్రంగా అభివృద్ధి మలుపులు తిరుగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.


 మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి: పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఏడు లక్షలు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో మరో 2 లక్షల ఎకరాలకు నీరిచ్చే ఉద్దేశంతో రూపొందించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం స్వ రాష్ట్రంలోనే మొదటి ఇరిగేషన్‌ ప్రాజెక్టు. పథకం శంకుస్థాపన రోజు సీఎం కేసీఆర్‌ చెప్పిన ప్రకారం పనులు సాగినట్లయితే ఈ పథకం ఇప్పటికే పూర్తవ్వాల్సి ఉంది. కారణాలేవైనప్పటికీ  కాళేశ్వరం పథకానికి ఇచ్చిన ప్రాధాన్యం దీనికి దక్కలేదు. కోర్టు కేసులు, వివాదాల నడుమ పథకం పనుల్లో జాప్యం కొనసాగింది. రూ.48 వేల కోట్లతో చేపట్టిన ఈ పథకం కింద ఇప్పటివరకు ఏదుల రిజర్వాయర్‌ పనులు పూర్తికాగా, వట్టెం, కరివెన, నార్లాపూర్‌  పనులు కొనసాగుతున్నాయి. భూసేకరణ గండం గట్టెక్కితే పనులు వేగం పుంజుకోనున్నాయి. ఇటీవల పనులను సందర్శించిన సీఎం కేసీఆర్‌ చెప్పిన ప్రకారం ఇకపై ఈ పథకం వేగవంతం కానుంది. 


పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తితో 8 లక్షల ఎకరాలకు చేరిన సాగు

ఉమ్మడి జిల్లాలో స్వరాష్ట్రంలో జూరాల ఆయకట్టు 1.02 లక్షల ఎకరాలతో పాటు, కల్వకుర్తి కింద 20 వేల ఎకరాలు, కోయిలసాగర్‌ పాత ఆయకట్టు 18 వేల ఎకరాలకు మాత్రమే కాల్వల ద్వారా నీరందేది. తెలంగాణ ఏర్పడే సమయానికి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద కాల్వలకు నీరివ్వడం ద్వారా మరో 50 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఉమ్మడి జిల్లాలోని ఎంజీఎల్‌ఐ, నెట్టెంపాడు, రాజీవ్‌ భీమా రెండు దశలు, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకం పెండింగ్‌ పనులను దాదాపు పూర్తి చేయించారు.


ఈ నాలుగు పథకాలతో పాటు జూరాల ఆయకట్టు కలుపుకొని గత ఖరీఫ్‌ నాటికి 8 లక్షల ఎకరాలకు సాగునీరందింది. ఈ పథకాల కింద డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాల్వల నిర్మాణాలు లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలో దాదాపు 1,850 పైచిలుకు చెరువులను నింపడం, కాల్వల నుంచి మోటర్లు ద్వారా నీటిని పంపింగ్‌ చేసుకోవడం ద్వారా రైతులు సాగునీటి సదుపాయం పొందారు. ఎంజీఎల్‌ఐ పొడిగింపు పథకాలు, కోయిల్‌సాగర్‌ అదనపు ఆయకట్టు పనులు, అదేవిధంగా భీమా ఎత్తిపోతల పథకంలో పెండింగ్‌ పనులు, నెట్టెంపాడు పనులు పూర్తి చేస్తే ఈ పథకాల కింద 10 లక్షల ఎకరాలకు నీరందుతుంది. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కింద మొదటి దశను పూర్తి చేయడం ద్వారా ఆర్డీఎస్‌ ఆయకట్టు టేలాండ్‌ భూముల్లో 50 వేల ఎకరాలకు నీరందించారు. ఈ పథకాల కింద డీసీలు, పెండింగ్‌ పనులు పూర్తి చేస్తే సంపూర్ణ ఆయకట్టు సాగులోకి రానుంది.


మొదటి మెడికల్‌ కళాశాల

రాష్ట్రం ఏర్పాటయ్యాక మొట్ట మొదటి ప్రభుత్వ మెడికల్‌ కళాశాల పాలమూరుకు మంజూరైంది. 2015-16లో మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి స్థాయిని పెంచి 400 పడకల ఆస్పత్రిగా మార్చారు. దానిని మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా చేశారు. అందులో నిమ్స్‌కు ధీటుగా అన్నిరకాల వైద్య పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. గుండె పరీక్షలు, డయాలసీస్‌ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. పీహెచ్‌సీల స్థాయిని పెంచారు. 24 గంటల వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చారు. 


ఐదు జిల్లాలుగా ఉమ్మడి పాలమూరు

రాష్ట్రం ఏర్పాటయిన కొత్తలో పాలమూరు జిల్లాను పాలనా సౌలభ్యం కోసం విభజించారు. ఉమ్మడి జిల్లాలో 64 మండలాలుగా ఉన్న జిల్లాను తొలుత మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాలుగా విభజించాలని భావించారు. ఆ తర్వాత జోగులాంబ గద్వాల జిల్లాను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న షాద్‌నగర్‌ నియోజకవర్గాన్ని పూర్తిగా, కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు, తలకొండపల్లి, మాడుగుల మండలాలను, మరో మండలాన్ని అదనంగా ఏర్పాటు చేసి రంగారెడ్డి జిల్లాలో కలిపింది. కొడంగల్‌ నియోజకవర్గంలోని కొడంగల్‌, బొంరా్‌సపేట, దౌల్తాబాద్‌ మండలాలను వికారాబాద్‌ జిల్లాలో కలిపింది. ఈ విభజన సమయంలో వికారాబాద్‌లో కలిపిన కొడంగల్‌ ప్రాంతంలో కొంత అసంతృప్తి ఇప్పటికీ నెలకొంది. రాజకీయ కారణాలతో ఒకే నియోజకవర్గంలో ఉండాల్సిన మండలాలను వేర్వేరు జిల్లాల్లో కలిపారనే చర్చ కొనసాగింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండోసారి ప్రభుత్వం కొలువుదీరాక నారాయణపేట జిల్లా ఆవిర్భవించింది. 


డబుల్‌ బెడ్‌ రూం పథకంపై ప్రజల్లో ఆశలు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌బెడ్‌రూమ్‌ పథకం కింద ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు మహబూబ్‌నగర్‌, నిజాలాపూర్‌, అన్నాసాగర్‌ ప్రాంతాల్లో 410 మంది లబ్ధిదారులకు ఇళ్లు అందించారు. మరో 1,900 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో 1,008 ఇళ్లు నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు అందే దశలో ఉన్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రభుత్వం చెప్పిన ప్రకారం సొంత స్థలాలు ఉన్న వారు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టుకుంటే రూ.6 లక్షలు ప్రభుత్వం అందిస్తుందని చెప్పింది. ఆ హామీ అమలైతే ఉమ్మడి జిల్లాలో సుమారు లక్ష మంది వరకు ప్రయోజనం పొందేందుకు అవకాశముంది.


పాలమూరు నుంచే తొలి సంక్షేమ పథకం

స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక మొదటగా ప్రారంభించిన ఆసరా పింఛన్ల పథకాన్ని సీఎం కేసీఆర్‌ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొత్తూరు నుంచి ప్రారంభించారు. సమైక్య రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లు నెలకు రూ.200 ఇస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరాక దాన్ని రూ.1000కి పెంచింది. ప్రభుత్వం రెండోసారి కొలువుదీరాక పింఛన్లు వృద్ధులకు రూ.2016, వికలాంగులకు రూ.3016లకు పెంచడంతో పాటు వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, నేత, గీత కార్మికులకు సైతం రూ.2016 చొప్పున పింఛన్లు అందిస్తున్నారు. ఉచిత గొర్రెల పథకం కూడా ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా అమలైంది.


రైతుబంధు, రైతు బీమాతో కర్షకుల్లో ఆనందం

2018లో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన రైతుబంధు పెట్టుబడి సాయం పథకం దేశంలో సంచలనం కలిగించింది. ఈ పథకం కింద వానాకాలం, రబీలలో ఎకరాకు రూ.4వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేసింది. ప్రభుత్వం రెండోసారి కొలువుదీరాక ఎకరాకు రూ.5 వేలకు పెంచింది. రైతు బీమా పథకం కింద రైతు కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోతే రూ.5 లక్షల పరిహారం ఇస్తోంది. రుణ మాఫీ కింద మొదటి ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాలో 5.20 లక్షల మంది రైతులకు గాను రూ.1,300 కోట్ల రుణమాఫీ వర్తించింది. ఈ సారి కూడా దాదాపు ఇదే మొత్తంతో పథకం అమల్లోకి వచ్చింది. 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా ఉండటంతో పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.


Advertisement
Advertisement