Abn logo
Jul 9 2020 @ 05:28AM

తర్జన భర్జన

ఇప్పటికే 28 శాతం పనులు జరిగిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోతిరెడ్డిపాడుకు అనుబంధంగా సంగమేశ్వరం వద్ద మరో లిఫ్టు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ సిద్ధం కావడం, పీఆర్‌ఎల్‌ఐ ప్రతిపాదిత డిజైన్‌లో మార్పులు జరగడంతో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అధికార పక్షం నాయకులు మాత్రం అదేంలేదని కొట్టిపారేస్తూ కేసీఆర్‌ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు మిగతా జిల్లాలకు న్యాయం చేస్తారంటున్నారు.   


పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్ల విషయంలో రాజుకుంటున్న రగడ

సామర్థ్యాన్ని కుదిస్తున్నారంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్న విపక్షాలు

డిజైన్‌ వ్యవహారంపై స్పష్టతనివ్వని పాలకపక్షం

డోలాయమానంలో ప్రాజెక్టు భవితవ్యం


నాగర్‌కర్నూల్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : దాదాపు 64 వేల కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐ) విషయంలో పాలక, ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజానీకాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రీడిజైన్ల పేరిట రోజుకో కొత్త అంశాన్ని తెరమీదకు తెచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ పార్టీతో సహా పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు విమర్శిస్తుండగా ఈ అంశాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు కొట్టిపారేస్తున్నారు. 


రీడిజైనింగ్‌ సాధ్యమేనా....?

   నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వికారాబాద్‌తో సహా రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించగా మొదటి నుంచి అన్నీ ఆటంకాలే ఎదురవుతున్నాయి. మొదటి లిఫ్టు నిర్మించాల్సిన ఎల్లూరు వద్ద అటవీ ప్రాంతం ఉన్నదని ఈ నిర్మాణం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందంటూ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ వరకు కేసులు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో మొదటి లిఫ్టు నిర్మాణాన్ని భూమి అంతర్భాగంలో చేపట్టాలని నిర్ణయించి అందుకనుగుణంగా టెండర్లు కూడా పిలిచారు. అయితే అసలు కథ ఇక్కడి నుంచే ప్రారంభమైంది. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో 800 అడుగుల నుంచి నీటిని తీసుకునే విధంగా డిజైన్‌ చేయగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా ఇదే స్థాయి నుంచి నీటిని డ్రా చేసేలా డిజైన్లు రూపొందించారు.


ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించడం సంగమేశ్వరం, ముచ్చమర్రి నుంచి 800 అడుగుల వద్ద నీటిని తీసుకునే విధంగా కొత్త పథకాలను రూపొందించడంతో జల వివాదం జఠిలమైంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 145 మెగావాట్ల సామర్థ్యం గల 8 మోటార్లను సాన్‌బోయిని కలుపుకొని 9 మోటార్లు బిగించాల్సి ఉండగా ప్రభుత్వం 4 మోటార్లను మాత్రమే బిగించే విధంగా పనులు చేపడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 12.3 లక్షల ఎకరాల ఆయకట్టును స్థీరికరించేందుకు రోజుకు 2 టీఎంసీల నీటిని పంపింగ్‌ చేయాల్సి ఉంటుందని అయితే నాలుగు మోటార్ల ద్వారా కేవలం ఒక టీఎంసీ నీటిని మాత్రమే పంపింగ్‌ చేస్తే డిండి ఎత్తిపోతల పథకానికి అవసరమైన 0.5 టీఎంసీ నీటిని అక్కడికి తరలిస్తే కేవలం అర టీఎంసీ నీటితో 12.3 లక్షల ఎకరాలకు సాగునీటిని ఎలా అందిస్తారని కాంగ్రెస్‌ నాయకులు, తెలంగాణ ఇంజనీర్ల ఫోరం నాయకులు కూడా తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.


కాగా,  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్టులో ప్రస్తుతం నాలుగు మోటార్ల బిగింపునకు ప్రణాళిక రూపొందించినప్పటికీ మున్ముందు అవసరాల దృష్ట్యా 8 పంపులకు అనుకూలమైన స్ట్రక్చర్‌ను రూపొందిస్తున్నామని చెబుతున్నప్పటికీ నీటిని పంపింగ్‌ చేసే పాయింట్‌ శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లోని 800 అడుగుల నుంచి 820 అడుగులకు ఎందుకు మారిందని వివిధ పక్షాలకు చెందిన నేతలు సంధిస్తున్న ప్రశ్నలకు పాలకపక్షం నుంచి సరైన సమాధానం కోసం ఈ ప్రాంత రైతాంగం ఎదురు చూస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా నది జలాల వినియోగం విషయంలో 30 రోజుల వరదనీటిని ఆధారంగా చేసుకొని వాటిని రూపకల్పన చేస్తే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ముందు చూపుతో వ్యవహరించలేకపోతుందని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. 


 ముందే అష్టకష్టాల్లో ఉన్న పాలమూరు రంగారెడ్డి నుంచి డిండికి నీరు తీసుకుపోవాలనే ప్రతిపాధనలపై అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం రెండు కొత్త ప్రతిపాదనలను తెరమీదకు తెచ్చి పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎదుల రిజర్వాయర్‌ స్లూయిస్‌ ద్వారా డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని మళ్లించడం లేదా వట్టెం వద్ద 17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంగల కలిగిన రిజర్వాయర్‌ నుంచి నీటిని తరలించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిసింది. దీని ద్వారా కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాలలోని కొన్ని ప్రాంతాలలో ఆయకట్టుకు సాగునీటిని అందించే అవకాశాలపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 


శ్వేతపత్రం ప్రకటించాలి : నాగం జనార్దన్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

              ఆంధ్రప్రదేశ్‌ జల దోపిడీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వత్తాసు పలుకుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా నది జలాల వినియోగం విషయంలో కేసీఆర్‌ శ్వేత పత్రాన్ని వెంటనే విడుదల చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. నది పరివాహక చట్టం ప్రకారం సహజ న్యాయ సూత్రాలకనుగుణంగా ఎంత మేరకు న్యాయం చేశారో బహిర్గతం చేయాలి. 


దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ : చల్లా వంశీచంద్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే

           

   ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్‌ దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నారు. మూడేళ్లలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పఽథకం ద్వారా సాగునీరందిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం గడిచిన నాలుగేళ్లలో పది శాతం పనులు పూర్తి చేయలేకపోయింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన జరిగిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికావడం కేసీఆర్‌ స్వయంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి డిజైన్‌ రూపొందించామని చెప్పి పదేపదే వాటిని మార్చడం వెనుక పరమార్థమేమిటో ప్రజలకు తెలియాలి. 


స్టేజ్‌-1, 2లుగా విభజించాలి : రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు

           

   పాలకపక్షాల అనాలోచిత ధోరణి కారణంగా పాలమూరు జిల్లా రైతాంగానికి విషాదకరమైన పరిస్థితులను సృష్టించింది. కృష్ణా నది జలాల వినియోగం విషయంలో అనాలోచిత ధోరణి కారణంగా సత్ఫలితాలు రావడంలేదు. బీమా, కృష్ణానది సంగమ క్షేత్రం తంగిడి వద్ద నుంచి 5 టీఎంసీల కృష్ణా నది వరద జలాలను వినియోగించుకునే విధంగా ప్రాజెక్టు రూపకల్పన జరగాలి. దీని వల్ల ఎగువ ప్రాంతాలతో పాటు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాలకు కూడా న్యాయం జరుగుతుంది. 


కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారు : గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్‌

            

తెలంగాణ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్తశుద్ధిని ప్రశ్నించే అర్హత రాష్ట్రంలో విపక్షాలకు లేదు. తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధికి కృష్ణ, గోదావరి నదీ జలాల వినియోగం అంశంలో కేసీఆర్‌ దార్శనికంగా వ్యవహరిస్తున్నారో ప్రజానీకానికి అంతటికి తెలుసు. ప్రాజెక్టుల ద్వారా బీడు బారిన పొలాలకు నీరందుతుంటే కాంగ్రెస్‌ నేతల కళ్లు మండుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు ఇతర జిల్లాల ప్రయోజనాలకు భంగం వాటిల్లే పని కలలో కూడా జరగదు.

Advertisement
Advertisement