Abn logo
Oct 23 2021 @ 00:28AM

సంచుల సంక్షోభం

ప్రభుత్వం వద్ద ఉన్నవి 25 లక్షలే

ఖరీఫ్‌కు అవసరమైనవి మూడు కోట్లు

మిల్లర్లు ఇవ్వాలంటూ ప్రభుత్వం సూచన

బిల్లులు చెల్లించాలంటూ మిల్లర్లు పట్టు

ఇచ్చేది లేదంటూ స్పష్టీకరణ

పరిష్కరించకుంటే రైతు రోడ్డెక్కే ప్రమాదం 


(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి):

ధాన్యం కొనుగోలుకు సంచుల సంక్షోభం తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మెట్టలో ధాన్యం మాసూళ్లు  ప్రారంభమయ్యాయి. బోరు బావుల కింద పంట చేతికొస్తోంది. డెల్టా పరిధిలో నవంబరు 15 నుంచి పంట చేతికి రానుంది. ఇప్పుడు సంచుల  కొరతే ప్రధాన సమస్య కానుంది. ఈ ఖరీఫ్‌కు మూడు కోట్ల సంచులు అవసరం ఉండగా పౌరసరఫరాల శాఖ వద్ద 25 లక్షలు మాత్రమే ఉన్నాయి.

 మరో నెల రోజుల వ్యవధిలోనే ఖరీఫ్‌ ఉత్పత్తులు ముమ్మరం కానున్నాయి. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలి. సొమ్ములు చెల్లించాలి. లేదంటే గడచిన రబీ పరిస్థితులే ఉత్పన్నం అవుతాయి. సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేయకపోతే రైతులు రోడ్డెక్కే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతం సంచులు సమకూర్చడం ఎలా అన్నదే ప్రధాన సమస్యగా ఉంది. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్ల కోసం మిల్లర్లే సంచుల సమకూర్చేవారు. ప్రభుత్వం వినియోగచార్జీలు చెల్లిస్తూ వచ్చేది. దీనిపై మిల్లర్లకు, ప్రభుత్వానికి మధ్య అగాథం ఉంది. ధాన్యం సంచులకు పూర్తిస్థాయిలో సొమ్ములు చెల్లించాలని మిల్లర్లు పట్టుబడుతున్నారు. బియ్యానికి సంచులు ఇస్తున్నాం కాబట్టి మిగిలిన వాటికి మాత్రమే వినియోగచార్జీలు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. మిల్లర్ల నుంచి టన్ను బియ్యం సేకరించాలంటే 50 కిలోలకు ఒకటి వంతున 20 సంచులు ఇస్తున్నారు. టన్ను బియ్యం ఉత్పత్తి కావాలంటే మిల్లర్లు 1400 కిలోల ధాన్యం సమకూర్చుకోవాలి. దీనికి మరో 35 సంచులు అవసరం. ప్రభుత్వం ఇచ్చే సంచులు పూర్తిగా బియ్యానికే వినియోగిస్తున్నామని, ధాన్యానికి తామే సంచులను సమకూర్చుకుంటున్నామని కాబట్టి ధాన్యం సంచుల మొత్తానికి వినియోగ చార్జీలు ఇవ్వాలని మిల్లర్లు పట్టుబడుతున్నారు. అలా కాకుండా తామిచ్చే 20 సంచులను మినహాయించి మిగిలిన 15 సంచులకే వినియోగ చార్జీలు ఇస్తామంటూ ప్రభుత్వం చెప్పుకొస్తోంది. ఈ సమస్య ఇలా ఉండగానే ప్రస్తుత ఖరీఫ్‌కు మరో సంక్షోభం ముంచుకొస్తోంది. ఇప్పటి వరకు మిల్లర్ల నుంచి సంచుల సరఫరా చేసేవారు. ఇకపై ఆర్‌బీకేల ద్వారా రైతులకు సంచులు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల దళారుల ప్రమేయం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ధాన్యం కొనుగోలు చేసే పౌరసరఫరాల కార్పొరేషన్‌ వద్ద కేవలం 25 లక్షల సంచులు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఖరీఫ్‌లో 12 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే మూడు కోట్ల సంచులు అవసరం. ఆ మొత్తం ఇప్పట్లో సరఫరా చేయాలంటే పౌరసరఫరాల కార్పొరేషన్‌కు సాధ్యమయ్యే పనికాదు. మిల్లర్ల నుంచి సంచులు తీసుకుని ఆర్‌బీకేలకు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. సంచులు తాము ఇచ్చేది లేదంటూ మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు. గతం నుంచి పూర్తి స్థాయిలో గన్నీ సంచుల వినియోగచార్జీలు చెల్లించకపోవడంతో మిల్లర్లు పట్టు బిగిస్తున్నారు. సమస్యను పరిష్కరించేందుకు పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. 

ప్రతి గింజ.. కొనుగోలు చేస్తాం

ఖరీఫ్‌లో రైతుల నుంచి ప్రతి గింజ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నాణ్యత ప్రమాణాలకు లోబడి కొనుగోళ్లు నిర్వహిస్తాం. రైతులు భయపడాల్సిన పనిలేదు. ఆర్‌బీకేల ద్వారా సంచులను సమకూరుస్తాం. ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేశాం. మిల్లర్లతోనూ సంప్రదింపులు జరిపేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.   

– రాజు, పౌర సరఫరాల కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌


 ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి

జిల్లావ్యాప్తంగా 338 కేంద్రాలు

కొనుగోలు లక్ష్యం 13.50 లక్షల టన్నులు

ఏలూరు సిటీ, అక్టోబరు 22 : సార్వా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 338 కేంద్రాల ఏర్పాటుకు పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. 74 ప్రాంతాల్లో వెలుగు(ఐకేపీ), 248 చోట్ల సహకార సంఘాలు, 15చోట్ల డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలోను, భీమడోలులో రైతులకు సంబంధించిన ఎఫ్‌ఎఫ్‌సీలో ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆయా కేంద్రాల్లో సంబంధిత పరికరాలైన తేమ కొలిచే యంత్రాలు, తూకాలకు కావాల్సిన కాటాలు, ఆన్‌లైన్‌ విధానంలో కొనుగోలు చేయనున్నారు. వరి మాసూళ్లు ప్రారంభమవుతున్నాయి. తాడేపల్లిగూడెం ఏరియాలో ముందుగా మాసూళ్లు జరుగుతున్నాయని, రెండు, మూడు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది సార్వా దిగుబడులు ఆశాజనకంగానే ఉంటాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దీనిలో భాగంగా 15 లక్షల టన్నుల వరకు ధాన్యం దిగుబడులు లభిస్తాయని అంచనా వేశారు. అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 13.50 లక్షల టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ కేంద్రాలు జిల్లాలో వరి సాగు చేసే ప్రాంతాల్లో వున్న 853 రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా ఉంటాయి. వాటికి అనుసంధానంగా కొనుగోళ్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఇచ్చే చెల్లింపులు విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.