Advertisement
Advertisement
Abn logo
Advertisement

మొక్కవోని దీక్షతో..

అమరావతి రైతులకు ఘన స్వాగతం

పొదలకూరులో పోటెత్తిన జనం

అడుగడునా పూల వర్షం

భారీగా తరలివచ్చి  సంఘీభావం


బుధవారం ఉదయం..

10 గంటలకు మహా పాదయాత్ర ప్రారంభమైంది. ఒక అడుగు కదిలీ కదలకముందే అదనపు ఎస్పీ, డీఎస్పీ తమ బలగాలతో అక్కడకు చేరి అడ్డుపడ్డారు. యాత్రలో అల్లా, జీసెస్‌ రథాలకు అనుమతులు లేవంటూ ఆపేశారు. 30 రోజులుగా తమ వెంట వస్తున్న రథాలకు ఉన్న అనుమతి 31వ రోజు లేకపోయిందా!? అంటూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, బీజేపీ నాయకులు పోలీసులను ప్రశ్నించారు. ప్రశాంతంగా సాగుతున్న యాత్రను భగ్నం చేయవద్దని కోరారు. చివరకు పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. రెండు గంటల సేపు అభ్యర్థించినా పోలీసులు అంగీకరించలేదు. రెండు గంటల తర్వాత ఆ రథాలను వదలి పాదయాత్ర మొదలు పెట్టారు. 

మధ్యాహ్నం పొదలకూరులోని వే బ్రిడ్జి వద్ద భోజనాలు వండేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో వే బ్రిడ్జి యజమాన్యం నిరాకరించింది. దీంతో మధ్యాహ్న భోజనాలను సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి సొంత పంచాయతీ తొండూరు పరిధిలో రోడ్డుపైనే భోజనం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళా రైతులు కంటతడి పెట్టుకున్నారు. 


సాయంత్రం..


ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలతో తీవ్ర నిరాశతో ఉన్న అమరావతి రైతులకు పొదలకూరువాసులు  అపూర్వ స్వాగతం పలికారు. పోరాట యోధులపై పూలవాన కురిపించారు. రాజధాని రైతులకు 31వ రోజు పాదయాత్ర ప్రత్యేకంగా గుర్తుండిపోయే అనుభూతులను పంచారు.  పొదలకూరుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రజలు, రైతులు పాదయాత్రకు అపూర్వ స్వాగతం పలికారు. స్థానిక మహిళలు మంగళహారతులు పట్టారు. గుమ్మడి కాయలతో దిష్టి తీశారు. మీ వెంట మేమున్నామంటూ హామీ ఇచ్చారు. జై అమరావతి అంటూ నినదించారు. పొదలకూరు చివరి వరకు రైతుల వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. పొదలకూరులో ఎదురైన ఈ అపూర్వ స్వాగతానికి అమరావతి రైతులు ఆనందంతో అప్పటివరకు పడిన అవమానాలు, బాధలను మరచిపోయారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, అమరావతి రాజధాని సాధన కోసం ఇంకెన్ని పోరాటాలైన చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. బుధవారం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, బీజేపీ, వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

- నెల్లూరు (ఆంధ్రజ్యోతి)

 

ఆ రథాలను అడ్డుకోవడం దారుణం 


పాదయాత్రలో వస్తున్న ముస్లిం,  క్రిస్టియన వాహనాలకు అనుమతుల పేరిట ఆపడం దారుణం. ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అడ్డంకులు సృష్టిస్తారా!? అఽధికార పార్టీ వారి దాష్టీకానికి అమరావతి ఆడపడుచులు నడిరోడ్డుపైనే అన్నం తినాల్సి వచ్చింది. రైతులు బస చేసేందుకు సైతం వీలు లేకుండా చేశారు. వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళుతున్న రైతులకు అడ్డంకులను సృష్టించిన వారిని ఆ దేవదేవుడే చూసుకుంటాడు. 


- సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, టీడీపీ నేత


పాదయాత్రలో పాల్గొన్న టీడీపీ, బీజేపీ నేతలు


పొదలకూరులో మహాపాదయాత్రలో పాల్గొన్న ప్రజలు, రైతులు


Advertisement
Advertisement