Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆటంకాలు అధిగమిస్తూ ముందుకు సాగిపోతూ..

రెండు రోజుల విరామం తర్వాత మహా పాదయాత్ర ప్రారంభం

మద్దతుగా రైతులతో కలిసి నడిచిన ప్రజలు

అల్లా, క్రీస్తు వాహనాలను అడ్డుకున్న పోలీసులు

ప్రభుత్వంపై  జేఏసీ నేతల ఆగ్రహం


విపత్కర పరిస్థితులు ఎదురైనా.. అడ్డంకులు సృష్టించినా... అమరావతి రైతులు ముందుకు సాగిపోతున్నారు. వర్షాల కారణంగా రెండు రోజుల విరామం అనంతరం రైతుల మహాపాదయాత్ర మంగళవారం తిరిగి ప్రారంభమైంది. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో జరుగుతున్న ఈ పాదయాత్ర నెల్లూరు నగరంలోని అంబాపురం నుంచి పొదలకూరు మండలం మరుపూరు గ్రామానికి ముందు ఎస్‌ఎల్వీ లేఅవుట్‌ వరకు వరకు పది కిలోమీటర్లు సాగింది. ఈ మార్గమధ్యంలో శ్రీలంక కాలనీ, దొంతాలి క్రాస్‌రోడ్డు, మన్నవరప్పాడు క్రాస్‌రోడ్డు, ఆమంచర్ల, సౌతమోపూరు క్రాస్‌ రోడ్డు, మట్టెంపాడు క్రాస్‌ రోడ్డుల వద్ద అమరావతి రైతులకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. టెంకాయలు కొట్టి, పూలు చల్లుతూ తమ మద్దతు తెలియజేశారు. సంఘీభావంగా స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో రైతులతో కలిసి నడిచారు. అమరావతి ప్రాశస్థ్యాన్ని, ప్రాముఖ్యతను తెలియజేసేలా ఆటపాటలతో యాత్ర సాగింది. అమరావతి రైతుల త్యాగాలను కరపత్రాల్లో ముద్రించి దారిపొడవునా పంపిణీ చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, పార్టీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌, సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లు పాదయాత్ర ప్రారంభానికి ముందుగానే అంబాపురానికి చేరుకొని రైతులకు సంఘీభావం తెలిపారు. అనంతరం రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. యాత్ర ప్రారంభం కాగానే రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రలో అల్లా, ఏసుప్రభు శిలువను ఉంచిన వాహనాలు ఉండకూడదని ఆంక్షలు విధించారు. హైకోర్టు ఉత్తర్వులు ప్రకారం ఒక్క వెంకటేశ్వరస్వామి వాహనానికే అనుమతి ఉందని, అల్లా, ఏసుప్రభు వాహనాలకు అనుమతించాలంటే హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవాలని పోలీసులు సూచించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు టీడీపీ నేత అబ్దుల్‌ అజీజ్‌, పోలీసులకు మధ్య వాదనలు జరిగాయి. ఒక సందర్భంలో రైతులు పోలీసుల కాళ్లు పట్టుకొని.. తమ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించవద్దని కోరారు. ఇన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఎక్కడా దేవుడి వాహనాలను అడ్డుకోలేదని రైతులు వాపోయారు. అయినా పోలీసులు కనికరించకపోవడంతో అల్లా, ఏసుప్రభు వాహనాలను ముందు పంపేసి రైతులు పాదయాత్రను కొనసాగించారు. మధ్యాహ్నం ఆమంచర్ల గ్రామంలో భోజనం చేశారు. ఇక్కడ స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున అమరావతి రైతులకు తమ స్థాయిని బట్టి విరాళాలు అందజేశారు. జనచైతన్య హౌసింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ప్రతినిధులు రూ.50 వేలను రైతులకు అందించారు. రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన నేతలు రైతులను కలిసి తమ సంఘీభావం ప్రకటించారు. పాదయాత్ర సర్వేపల్లి నియోజవకర్గంలోకి ప్రవేశించగానే సౌతమోపూరు క్రాస్‌ రోడ్డు వద్ద సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు రైతులకు ఘనస్వాగతం పలికారు. కాగా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం మరుపూరు వరకు పాదయాత్ర చేసి అక్కడ బస చేయాల్సి ఉంది. కానీ ఆ గ్రామంలో బస చేసేందుకు ఆటంకాలు ఎదురవడంతో రైతులంతా తిరిగి నెల్లూరుకు వచ్చి బస చేశారు. 

- నెల్లూరు (ఆంధ్రజ్యోతి)

మహా పాదయాత్రలో పాల్గొన్న మహిళలు


టీడీపీ నేతలు సోమిరెడ్డి, అబ్దుల్‌ అజీజ్‌ తదితరులు


Advertisement
Advertisement