Abn logo
Apr 22 2021 @ 04:43AM

ఆసుపత్రులకే ఆక్సిజన్‌!

  • పరిశ్రమల వినియోగానికి కట్‌.. ఉద్యోగులను ఆదుకునేలా చర్యలు
  • ప్రాణవాయువు కొరత తగ్గించడమే లక్ష్యం
  • అధికారులతో నేడు మంత్రి గౌతమ్‌రెడ్డి భేటీ


అమరావతి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్‌ అవసరం రోజురోజుకు పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ కొరత కారణంగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిణామాలను నిశితంగా గమనించిన రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర మార్గదర్శకాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆక్సిజన్‌ వినియోగాన్ని కేవలం ఆసుపత్రులకే పరిమితం చేయనుంది. అంటే.. ఇప్పటి వరకు ఆక్సిజన్‌ ఆధారంగా నడుస్తున్న పలు పరిశ్రమలకు తాత్కాలికంగా సరఫరాను నిలిపివేయనున్నారు.


ఈ క్రమంలో ఆయా పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేయనుంది. ఈ క్రమంలో ఆయా పరిస్థితులు, ఆక్సిజన్‌ వినియోగం తదితర అంశాలపై.. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి.. వైద్య, హోం, కుటుంబ సంక్షేమ శాఖల సమన్వయంతో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పరిశ్రమలకు ఇతర ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ దిగుమతి చేసుకునే వెసులుబాటు కల్పించే అవకాశాలపై చర్చిస్తారు. ఆక్సిజన్‌ ఆధారిత పరిశ్రలకు సరఫరా చేసే ప్రాణ వాయువును సైతం ఆసుపత్రులకు సరఫరా చేసేలా దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ నెల 18న కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై.. 22వ తేదీ నుంచి ఫార్మా పరిశ్రమలు, పెట్రోలియం రిఫైనరీలు, ఉక్కు కర్మాగారాలు, ఆక్సిజన్‌ సిలిండర్ల తయారీ, న్యూక్లియర్‌ ఎనర్జీ ఫెసిలిటీస్‌, ఆహార, నీటి శుద్ధి, వ్యర్థపు నీటిని మంచినీరుగా మార్చే ప్లాంట్లు, ఇంజక్షన్‌, సీసాల వంటి తయారీ పరిశ్రమలకు ఆక్సిజన్‌ సరఫరా నిలిపేయాలని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయా పరిశ్రమలకు ప్రత్యామ్నాయ మార్గాలు సహా కీలక విషయాలపై మంత్రి సమగ్రంగా చర్చించనున్నారు.  

Advertisement
Advertisement
Advertisement