Abn logo
May 24 2020 @ 01:55AM

కరోనా వీరంగం

  • దేశవ్యాప్తంగా మళ్లీ 6 వేలపైగా నమోదు
  • 1.25 లక్షలు దాటిన కేసులు


న్యూఢిల్లీ, ముంబై, /చెన్నై, బెంగళూరు, మే 23 (ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. సరిగ్గా వారం క్రితం రోజుకు 3 వేలపైగా నమోదైన కేసులు.. తర్వాత రోజుకు 4 వేలు, 5 వేలు చొప్పున పెరుగుతూ పోయాయి. శుక్రవారం 6,088 కేసులు రాగా.. శనివారం అత్యధిక స్థాయిలో 6,654 కేసులు రికార్దయ్యాయి. శనివారం ఉదయం 8 గంటల నాటికి గడచిన 24 గంటల గణాంకాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసింది. వాటి ప్రకారం వరుసగా రెండో రోజూ దేశంలో కేసులు 6 వేలు దాటాయి. మొత్తం కేసులు 1,25,101కు చేరాయి. ఇందులో 69,597 మంది చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. 137 తాజా మరణాలతో మృతుల సంఖ్య 3,720 అయింది. మరోవైపు దేశంలో కొవిడ్‌ నుంచి కోలుకున్నవారి శాతం 41.39కి పెరిగింది.సోమవారం నుంచి శనివారం వరకు దేశంలో 30 వేల కేసులు రికార్డవడం గమనార్హం. కాగా, మొత్తం కేసుల్లో 80 శాతం ఐదు రాష్ట్రాల్లో, 60 శాతం ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్‌, థానె నగరాల్లోనే నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు కరోనా కేసులేని రాష్ట్రం సిక్కిం ఒక్కటే. తాజాగా ఢిల్లీనుంచి వెళ్లిన ఆ రాష్ట్రవాసికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. రాత్రి 10 గంటలకు అందిన సమాచారం మేరకు కేసులు 1,28,840కు మరణాలు 3,782కు పెరిగాయి. ఉదయం వెల్లడించిన గణాంకాలకు మరో 3,739 కేసులు, 62 మరణాలు కలిశాయి.


కేరళ, కర్ణాటకలకు వలస కేసుల బెడద

కేరళలో మరో 62 కేసులు నమోదయ్యాయి. వీరిలో 49 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారే. కర్ణాటకలో 216 కేసులు రికార్డయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఒక్క రోజు వ్యవధిలో ఇవే అత్యధికం. కర్ణాటక కేసుల్లో 189 మంది మహారాష్ట్ర నుంచి వచ్చినవారే. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లిన వ్యక్తికీ పాజిటివ్‌గా తేలింది. మహారాష్ట్రలో మళ్లీ 2 వేలపైనే కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్ర పోలీసులో 1,671 మంది కరోనా బారినపడ్డారు. 18 మంది చనిపోయారు. ఢిల్లీ లో ఐదో రోజూ కేసులు 500 దాటాయి. మనేసర్‌లో మారుతీ ప్లాంట్‌లో ఉద్యోగికి కరోనా సోకింది.


తమిళనాడులో 759..చెన్నైలోనే 625

తమిళనాడులో కొత్తగా 759 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అందులో చెన్నైలోనే 625 ఉన్నాయి.  చెన్నైలో కేసులు 9,989కి చేరుకున్నాయి.  ఇండోర్‌లో కేసులు 3 వేలకు సమీపించాయి. మొత్తం 111 మంది చనిపోయారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆస్పత్రిలో పొరపాటున కరోనా పాజిటివ్‌ వ్యక్తిని డిశ్చార్జి చేశారు. విషయం తెలిసి గంటల వ్యవధిలోనే అతడిని పట్టుకుని ఆస్పత్రిలో చేర్పించారు. ఽధోల్కాలో ఉన్న క్యాడిలా ఫార్మా సంస్థ ఉద్యోగులు ముగ్గురు కరోనాతో చనిపోయారు.  అహ్మదాబాద్‌లో కేసులు 10 వేలకు సమీపించాయి. 645 మంది చనిపోయారు.


ఎయిమ్స్‌ వైద్యుడి మృతి

వారాలుగా రోగులకు చికిత్స.. వైరస్‌కు బలి

ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)ను కరోనా వెంటాడుతోంది. ఈ ప్రఖ్యాత ఆస్పత్రికి చెందిన పలువురు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఇప్పటికే కరోనా బారినపడ్డారు. కొన్ని వారాల నుంచి కొవిడ్‌ రోగుల చికిత్సలో పాల్గొంటున్న సీనియర్‌ వైద్యుడు, పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్‌ జితేంద్రనాథ్‌ పాండే (78) శనివారం ప్రాణాలు కోల్పోయారు. పల్మనాలజి్‌స్టగా మంచి పేరున్న డాక్టర్‌ పాండే.. రాష్ట్రపతి వ్యక్తిగత వైద్యుడు కూడా. అంతకుముందు ఎయిమ్స్‌ క్యాంటీన్‌ కార్మికుడు ఒకరు కరోనాతో చనిపోయారు. రక్షణ చర్యల విషయంలో నెల క్రితమే తాము సూచనలు చేసినా క్యాంటీన్‌ విభాగం పట్టించుకోలేదని, దీంతో పరిస్థితి తీవ్రమైందని ఎయిమ్స్‌ రెసిడెంట్‌ వైద్యుల సంఘం వాపోతోంది. కొవిడ్‌ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే ఆరోగ్య కార్యకర్తల క్వారంటైన్‌ గడువును కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఖండించింది.


Advertisement
Advertisement
Advertisement