ఓ నకిలీ ఏజెన్సీ నిర్వాకం
కర్నూలు(హాస్పిటల్), డిసెంబరు 1: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఔట్ సోర్సింగ్ నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్య ఆరోగ్య, వైద్య విధాన పరిషత్, వైద్య విద్యశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ నకిలీ ఏజెన్సీ లక్షలు దండుకుంది. గత అక్టోబరులో ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ పేరిట ఓ నకిలీ ఏజెన్సీ పీహెచ్సీ, సీహెచ్సీ, నం ద్యాల జిల్లా ఆసుపత్రి, కర్నూలు జీజీహెచ్ ఆసుపత్రులకు పోస్టులు ప్రకటించింది. దాదాపు 25 నుంచి 30 డేటా ఎంట్రీ పోస్టులు ఇచ్చినట్లు సమాచారం. ఒక్కొక్క పోస్టుకు 2 నుంచి 3 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. నకిలీ ఏజెన్సీ నుంచి పోస్టింగ్ ఉత్తర్వులు తీసుకుని వారికి కేటాయించి పీహెచ్సీలకు వెళితే ఈ విషయాన్ని అక్కడి మెడికల్ ఆఫీసర్లు డీఎంహెచ్వో దృష్టికి తీసుకెళ్లారు. డీఎంహెచ్వో ఈ విషయంపై ఆరా తీయగా నకిలీ ఏజెన్సీ నిర్వాకం బైటపడింది. అయితే మోసపోయిన నిరుద్యోగులు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.