Abn logo
May 23 2020 @ 23:59PM

దేశవ్యాప్తంగా ఒకేసారి థియేటర్ల ఓపెనింగ్‌!

త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి 

సినిమా షూటింగులు జరుపుకోవడానికి త్వరలోనే అనుమతి లభిస్తుందనీ, దేశవ్యాప్తంగా ఒకేసారి థియేటర్లు ఓపెన్‌ చేయడానికి నిర్ణయం తీసుకుంటామనీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. శనివారం ఉదయం ఆయన తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషించారు. ‘కొవిడ్‌ -19’ వల్ల చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆయన చర్చించారు. షూటింగులకు అనుమతి, థియేటర్ల ఓపెనింగ్‌, క్యాప్టివ్‌ పవర్‌, పైరసీ, ఓటీటీలో సినిమా విడుదల, ప్రాంతీయ భాషా చిత్రాలపై జీఎస్టీ, టీడీఎస్‌, సినిమా కార్మికుల ప్రత్యేక ప్యాకేజి వంటి పలు అంశాలను కిషన్‌రెడ్డితో చర్చించారు చిత్రప్రముఖులు.ప్రాంతీయ భాషా చిత్రాల నిర్మాణం మరింత పెరిగేలా రీజినల్‌ జీఎస్టీ  గురించి ఆలోచన చేస్తామనీ, సినిమా పరిశ్రమ వరకూ క్యాప్టివ్‌ పవర్‌ కోసం సంబంధిత మంత్రితో చర్చిస్తాననీ ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. కశ్మీరు సహా దేశంలో ఎక్కడైనా షూటింగులు, స్టూడియోల నిర్మాణం కోసం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడతానని ఆయన చెప్పారు. త్వరలోనే తెలుగు, తమిళ, హిందీ చిత్రపరిశ్రమ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను చర్చిద్దామంటూ మంత్రి ఆహ్వానించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డి.సురేశ్‌బాబు, దర్శకుడు తేజ, జెమినీ కిరణ్‌,  దామోదర ప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల, త్రిపురనేని వరప్రసాద్‌, అనిల్‌ శుక్లా అభిషేక్‌ అగర్వాల్‌, శరత్‌ మరార్‌,  ప్రశాంత్‌, యర్నేని రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement