Abn logo
Jun 2 2020 @ 12:03PM

ఆన్‌లైన్ క్లాసుల కోసం ఫోన్ కొనిస్తే.. కొడుకు చేసిన పని తెలిసి.. కంగుతిన్న తండ్రి

పేకాట సైట్లు.. కొల్లగొడుతున్న కోట్లు

ఆన్‌లైన్‌ రమ్మీకి బానిసవుతున్న యువత

లాక్‌డౌన్‌ వేళ వెబ్‌సైట్లు ఆఫర్లతో వల

ఆంక్షలూలేవు అదుపూలేదు

కట్టడి చేయలేకపోతున్న తల్లిదండ్రులు


ఒంగోలు(ఆంధ్రజ్యోతి): కరోనా లాక్‌డౌన్‌ సమయం.. గడప దాటే వీల్లేదు. పొద్దస్తమానం ఇంట్లోనే గడపాలి. కానీ తప్పదు. మొదట్లో కాలక్షేపం కోసం మొదలుపెట్టిన ఆన్‌లైన్‌లో రమ్మీ(పేకాట).. నిదానంగా వ్యసనంగా మారింది. ముందు ఎరవేసిన ఆ తర్వాత కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. గతంలో నడివయస్కుల వారు, సాంకేతికంగా పరిజ్ఞానం కలిగిన కొద్దిమంది మాత్రమే ఆన్‌లైన్‌ పేకాటతో కాలం వెళ్లబుచ్చేవారు. ఈ రెండు నెలల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో పేకాడేవారి సంఖ్య రెట్టింపైంది. వీరిలో అధికులు యువతే ఉండటం కలవరపరిచే అంశం. బ్యాంక్‌ ఖాతాలో డబ్బులు, చేతిలో స్మార్ట్‌ఫోన్‌ పెట్టుకుని యథేశ్ఛగా పేకాడుతున్నారు.


సామాజిక మాధ్యమాలతో వల

ఇంటర్నెట్‌లో ఆన్‌లైన్‌ రమ్మీ సైట్లు ఇబ్బడిముబ్బడిగా దర్శనమిస్తుంటాయి. ఆకర్షించే రకరకాల ఆఫర్లతో వల వేస్తుంటాయి. ఫేస్‌బుక్‌, ఈ మెయిల్స్‌కు, మొబైళ్లకు పుంఖానుపుంఖాలుగా సందేశాలు పంపుతారు. రిజిష్టర్‌ చేసుకోవడానికి తగిన సూచనలిస్తుంటారు. ప్రారంభంలో కొంత తక్కువ పందేలకే ఆడనిస్తారు. మనమే గెలిచేలా ప్రోత్సహిస్తారు. వారికి అది క్రమంగా వ్యసనంగా మారిన తరువాత... ప్రత్యర్థులు తమ మాయాజాలానికి తెరలేపుతారు. క్రమంగా వేలు, లక్షలకు రమ్మీ పరిధిని విస్తరించి వారిని నిండా ముంచుతారు.


సరైన నియంత్రణ వ్యవస్థ లేదు

ఇంటర్నెట్‌ కేంద్రంగా జరుగుతున్న అనేక మోసాల తరహాలోనే దీనికీ చట్టబద్దతలేదు. పుట్టగొడుగుల్లా రోజుకో వెబ్‌సైట్‌ దర్శనమిస్తూ ఆకర్షితులను నిండా ముంచేస్తున్నాయి. సరైన నిఘా వ్యవస్థ లేకపోవడంతో అమాయకులు, ఆశాపరులే లక్ష్యంగా కోట్లు దండుకుంటున్నాయి. ఇవి ఎక్కడ్నుంచో నిర్వహిస్తున్నారో కనుక్కోవడం పోలీసు వ్యవస్థకు కూడా అంతుచిక్కడం లేదు. 


నిపుణుల సూచనలు

పిల్లలను ఇలాంటి వ్యసనాల నుంచి కాపాడుకునే బాధ్యత ఎక్కువశాతం తల్లిదండ్రులపైనే ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు.  ఆదిలోనే ఇలాంటి పోకడలకు అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితి చేయిదాటిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సైట్లు నిర్వహించే వారిపై నిఘా గట్టిగా పెట్టి, వారిని ఎక్కడో కనిపెట్టి పట్టుకుని శిక్షించగలిగితే కొంత తగ్గుముఖం పట్టే అవకాశముందని చెబుతున్నారు.  


ఓ తండ్రి ఆవేదన ఇది...

ఇంటర్‌ చదువుతున్న తమ కొడుకుకు పక్కదారి పడతాడని ఫోన్‌ కొనివ్వలేదు. కాని లాక్‌డౌన్‌ కాలంలో ఆన్‌లైన్‌లో తరగతులకు సంబంధించి పాఠ్యాంశాలు నేర్చుకుంటాడని ఫోన్‌ కొనిచ్చాం. అకౌంట్‌లో డబ్బులు ఖాళీ అవుతుండడాన్ని గమనించి తమ కొడుకుని నిలదీస్తే కన్నీళ్లుపెట్టుకున్నాడు. అసలు విషయం ఏంటని గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తే.. ఆన్‌లైన్‌ రమ్మీలో డబ్బులు పోయానని సమాధానం రావడంతో హతాశులమయ్యానని ఒంగోలు నగరానికి చెందిన ఓ తండ్రి ఆవేదన వెలిబుచ్చాడు. 


తల్లిదండ్రులు చేయాల్సిన పని

- పిల్లలకు డబ్బు అందుబాటులో ఉంచకపోవడం. 

- వారి అవసరాలకు నగదు చేతికివ్వకుండా దగ్గరుండి కొనివ్వాలి.

- కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ తదితర ఉపకరణాలను ప్రత్యేక గదుల్లో ఏర్పాటు చేయవద్దు.

- అందరూ తిరిగే హాలులో వాటిని ఉంచితే అప్పుడు వారేమిచేస్తున్నారనేది కనిపెటొచ్చు.

- మరీ శృతిమించితే కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి వారిని ఆ మత్తు నుంచి బయటపడేయడానికి ప్రయత్నించాలి.

Advertisement
Advertisement
Advertisement