Abn logo
Sep 24 2020 @ 00:57AM

ఆన్‌లైన్‌ అవస్థలు

Kaakateeya

విద్యార్థులకు అర్థం కాని ఆన్‌లైన్‌ క్లాసులు

స్కూళ్లు, కాలేజీలకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రుల నిరాసక్తత

వెంటాడుతున్న కొవిడ్‌- 19 భయం

నెలకొన్న సిగ్నల్‌ సమస్య, ఆసక్తి చూపని విద్యార్థులు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కరోనా నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. కానీ.. ఆన్‌లైన్‌లో చెబుతున్న పాఠాలు అర్థం కావడం లేదని పిల్లల తల్లిదండ్రులు స్పష్టం చేస్తున్నారు. తరగతి గదిలో కూర్చొని పాఠాలు వింటేనే అర్థ కాని విద్యార్థులకు... ఇక ఆన్‌లైన్‌ క్లాసులు ఎలా అర్థం అవుతాయంటున్నారు. టీచర్‌ చెప్పింది వినడమే కానీ.. ఏమైనా సందేహాలుంటే అడిగే పరిస్థితి లేకపోవడం, టీచర్‌ చెప్పినంతసేపు ఏకాగ్రతతో వినకపోవడం, ఇంటర్నెట్‌ సమస్య ఏర్పడితే క్లాసు మధ్యలో ఆగిపోవడం లాంటి ఇబ్బందులు ఉత్పన్నమవుతున్నాయి.


స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడడమే కానీ.. పాఠాలు వినే ఓపిక లేకపోవడం, డబ్బులు పెట్టి కొనిచ్చాం.. కచ్చితంగా పాఠాలు వినండంటూ తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి చేయడం.. ఇలా అనేక సమస్యల మధ్య చదువులు కొనసాగిస్తున్నారు. కొద్దోగొప్పో చదివే విద్యార్థులు మాత్రమే తమకు అర్థంగాని అంశాలను ఉపాధ్యాయులకు ఫోన్‌చేసి నివృత్తి చేసుకుంటున్నారు. చాలావరకు విద్యార్థులు క్లాసులు వినడం వరకే పరిమితమవుతున్నారు. ముఖ్యంగా గణితం క్లాసులు పిల్లలకు తలనొప్పిగా మారాయి. సరిగ్గా అర్థం కావడం లేదంటున్నారు. లెక్కలు చేసే విషయంలో ఏదైనా డౌట్‌ ఉంటే.. వాట్సా్‌పలో టీచర్‌కు చేరవేస్తున్నారు.


అదిచూసి కరెక్ట్‌చేసి పంపుతున్నా... విద్యార్థులందరికీ సాధ్యపడటం లేదు. సిలబస్‌ కూడా తగ్గించి క్లాసులు చెబుతున్నందునా ఫలితాలు ఏ మాత్రం ఉంటాయనేది సందేహంగా ఉంది. విద్యార్థులకు క్లాసులు అర్థంకాని సమయంలో వర్క్‌ ఫ్రం హోమ్‌ అంటే ఉపాధ్యాయులు వారి ఇంటికి వెళ్లి క్లాసులు చెప్పాల్సి ఉన్నా.. ఇది అమలు కావడంలేదు. తల్లిదండ్రులు కూడా ఆన్‌లైన్‌ క్లాసులపట్ల పెదవి విరుస్తున్నారు. ఇంటర్‌ రెండో సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధన కొనసాగుతోంది. మొదటి సంవత్సరం అడ్మిషన్లు జరుగుతున్నందున వీరికి అక్టోబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు జరగనున్నాయి. 


ఆన్‌లైన్‌క్లాసులు అర్థం కావడం లేదు

తరగతి గదిలో ప్రత్యక్షంగా చెప్పే పాఠాలే ఒక్కోసారి అర్ధం కాకపోయేవి. ఇప్పుడు కరోనా కారణంగా ఆన్‌లైన్‌ క్లాస్‌లు చెబుతున్నా సరిగ్గా అర్థం కావడం లేదు. ముఖ్యంగా గణితం, సామాన్య శాస్త్రం, ఆంగ్లం అర్థంకాక ఇబ్బంది పతుతున్నాం.

 - పల్లవి, పదోతరగతి, నందివనపర్తి ఉన్నత పాఠశాల


రోజుకు 25మంది పిల్లలకు బోధిస్తే మంచిది

కరోనా కారణంగా ఆన్‌లైన్‌ క్లాసులకు బదులు.. కేవలం పదో తరగతి విద్యార్థులను రోజుకు 25 మందిని బడికి రప్పించి పాఠాలు చెబితే బాగుంటది. మా పాప పదో తరగతి.. ఎలా పాసవుతుందో అర్థం కావడం లేదు.

- జంగయ్య, నజ్దిక్‌సింగారం, విద్యార్థిని తండ్రి


సిగ్నల్‌ అందడం లేదు..

ఒక్కోసారి సిగ్నల్‌ అందక ఉపాధ్యాయులు చెప్పిన పాఠం అర్థం కాక ఇబ్బంది పడుతున్నాం. విధిలేక తోటి బాలికలను కలిసి నాకున్న అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నాను. 

- శివాణి, పదోతరగతి, మేడిపల్లి ఉన్నత పాఠశాల 

Advertisement
Advertisement
Advertisement