Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 23 2021 @ 02:29AM

ఒకే బిల్లుతో 3 చట్టాల రద్దు!

ఎమ్మెస్పీపైనా మార్గదర్శకాలు?.. కేంద్ర ప్రభుత్వం కసరత్తు

పరిష్కరించాల్సినవి చాలా ఉన్నాయ్‌!

కేంద్రం మాతో చర్చలు జరపాలి

అప్పుడే ఊళ్లకు తిరిగి వెళతాం

‘కిసాన్‌ మహాపంచాయత్‌’లో 

రాకేశ్‌ టికాయత్‌ కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాని 

ఉగ్రవాదితో పోల్చిన రైతు సంఘం నేత

ఆయన్ని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌

28న అఖిలపక్ష భేటీ.. కనీస మద్దతు ధరపై చర్చ!


న్యూఢిల్లీ, నవంబరు 22: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఒకే బిల్లుతో రద్దు చేయనుందా? సంబంధిత కసరత్తు చేస్తోందా? అంటే ప్రభుత్వ వర్గాలు అవుననే అంటున్నాయి. వివాదాస్పదమైన మూడు సాగు చట్టాలను ఒకే బిల్లుతో రద్దు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకు ప్రధాని కార్యాలయ ఆమోదం కోసం అధికార వర్గాలు ఎదురుచూస్తున్నాయి. మూడు వేర్వేరు చట్టాలను ఒక్క సమగ్ర బిల్లుతో రద్దు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మూడు సాగు చట్టాలకు సంబంధించి ఏర్పాటు చేసిన బోర్డులన్నింటినీప్రతిపాదిత బిల్లుతో మూసివేయనున్నట్లు తెలిసింది.


ఆయా బోర్డులు తీసుకున్న నిర్ణయాలు కూడా రద్దు కానున్నాయి. అలాగే ఏమైనా కార్యాలయాలు ఏర్పాటు చేసి ఉంటే, వాటి కార్యకలాపాలనూ నిలిపివేయనున్నట్లు సమాచారం. ఇక రైతులు డిమాండ్‌ చేస్తున్న కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయడం లేదా చట్టబద్ధత కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త సాగు చట్టాలను రద్దు చేసినంత మాత్రాన కేంద్రం పని పూర్తయినట్లు కాదని రైతు సంఘాలు చెబుతున్నాయి. పరిష్కరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని అంటున్నాయి. తమ డిమాండ్లు నెరవేర్చేదాకా వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నాయి. సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రైతు సంఘాలు సోమవారం లఖ్‌నవూలో కిసాన్‌ మహా పంచాయత్‌ నిర్వహించాయి. ఈ సందర్భంగా బీకేయూ నేత రాకేశ్‌ టికాయత్‌ మాట్లాడుతూ.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినందున రైతులతో మాట్లాడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు.


కొత్త చట్టాలను పూర్తిస్థాయిలో రద్దు చేసి, తమతో చర్చలు జరిపిన తర్వాతే ఊళ్లకు తిరిగి వెళ్తామని స్పష్టం చేశారు. పలు డిమాండ్లతో రైతు సంఘాల నేతలు ఆదివారం ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రధాని క్షమాపణలు చెప్పారని, ఆయన అలా చెప్పాల్సిన అవసరం లేదని.. తమ డిమాండ్లపై సీరియ్‌సగా దృష్టి సారించాలని టికాయత్‌ పేర్కొన్నారు. లఖీంపూర్‌ ఖీరీలో నలుగురు రైతుల మృతికి కారణమైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాను ఉగ్రవాదితో పోల్చారు. ఆయన్ను తక్షణమే అరెస్టు చేయాలన్నారు. తాము చేసిన ప్రధాన డిమాండ్లలో ఇది కూడా ఒకటని టికాయత్‌ చెప్పారు. కశ్మీరు నుంచి వచ్చిన ఉగ్రవాదులను ఆగ్రా జైల్లో పెడతారని.. అలాగే రైతులను హత్య చేయించిన అజయ్‌ మిశ్రా కూడా ఉగ్రవాదేనని, ఆయన్ని కూడా అదే జైల్లో పెట్టాలని అన్నారు. అలాగే లఖీంపూర్‌ ఖీరీలో చక్కెర కర్మాగారాన్ని మిశ్రా ప్రారంభించడానికి వీల్లేదన్నారు. ఒకవేళ ఆయన ప్రారంభిస్తే రైతులు ఆ మిల్లుకు చెరకును తీసుకెళ్లరని స్పష్టం చేశారు. 


అఖిలపక్ష భేటీ.. ఎమ్మెస్పీపై చర్చ!

ఈ నెల 28న ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు. కొత్త సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, కేంద్ర దర్యాప్తు సంస్థల అధిపతుల పదవీకాలం పెంపు వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇక అదే రోజు సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ కార్యనిర్వాహక సమావేశం కూడా నిర్వహించనుంది. మరోవైపు త్రిపురలో చెలరేగిన హింసపై తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. 


చట్టపరమైన అంశాల పరిశీలన తర్వాతే

సాగు చట్టాలపై రూపొందించిన నివేదికను బహిర్గతపరిచే అంశంపై చట్టపరమైన అంశాలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కమిటీ సభ్యుడు అనిల్‌ ఘన్వత్‌ చెప్పారు. కొత్త చట్టాలపై అధ్యయనానికి సుప్రీంకోర్టు అశోక్‌ గులాటి, ప్రమోద్‌కుమార్‌ జోషి, అనిల్‌ ఘన్వత్‌లతో కమిటీని నియమించింది. ఈ కమిటీ మార్చి 19న సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించింది. ఆ నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచాలని అనిల్‌ సెప్టెంబరులో సీజేఐకి లేఖ రాశారు. తాజాగా కొత్త చట్టాలను రద్దు చేయడంతో కమిటీ సభ్యులు సోమవారం సమావేశమయ్యారు. నివేదికను బహిర్గతపర్చడంపై తుది నిర్ణయాన్ని కమిటీ తనకే వదిలేసిందని అనిల్‌ తెలిపారు.


ఎంఎ్‌సపీతో ఆర్థిక వ్యవస్థకు కష్టం!

సాగుచట్టాలపై ‘సుప్రీం’ సభ్యుడు అనిల్‌ ఘన్వత్‌

రైతు సంఘాల నేతలు కనీస మద్దతు ధర(ఎంఎ్‌సపీ)కు పట్టుబట్టడం దేశ ఆర్థిక వ్యవస్థ పాలిట ఆందోళనకర విషయమని.. సాగుచట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ సభ్యుడు అనిల్‌ ఘన్వత్‌ స్పష్టం చేశారు. ఎంఎ్‌సపీకి చట్టం తీసుకువస్తే.. ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఓ జాతీయ వార్తాసంస్థతో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘‘కేంద్రం కేవలం వరి, గోధుమలనే ఏటా పెద్ద ఎత్తున సేకరిస్తోంది. వాటి విషయంలో ఎంఎ్‌సపీ ప్రకటిస్తే పెద్దగా నష్టం ఉండదు. కానీ, రైతు సంఘాలు 23 రకాల పంట ఉత్పత్తులపై ఎంఎ్‌సపీకి డిమాండ్‌ చేస్తున్నాయి. బియ్యం, గోధుమలు మినహా.. మిగతా ఉత్పత్తులను కేంద్రం అంత పెద్ద ఎత్తున సేకరించలేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఇలాంటి పరిస్థితుల్లో.. ఎంఎ్‌సపీకే కొనాలని రైతులు డిమాండ్‌ చేసే అవకాశం ఉంది. అప్పుడు స్టాక్‌ అమ్ముడుపోదు. ఒకవేళ వ్యాపారులు తక్కువ ధరకు రైతుల వద్ద స్టాక్‌ను తీసుకుంటే.. చట్టం ఉన్నట్లైతే వారంతా శిక్షార్హులవుతారు. ఇది చాలా సున్నితమైన అంశం’’ అని వివరించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల నాయకులు ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలని సూచించారు. సాగుచట్టాలను రద్దు చేయడం దురదృష్టకరమని అనిల్‌ ఘన్వత్‌ అన్నారు. ఆ చట్టాల్లో మార్పులు చేసైనా అమలు చేయాలని.. వాటి వల్ల రైతులకే ప్రయోజనమని చెప్పారు.

Advertisement
Advertisement