Abn logo
May 21 2020 @ 08:14AM

చైనాలో తీరు మారుస్తున్న‌ కరోనా!

బీజింగ్‌, మే 20: కరోనా వైరస్‌ పుట్టినిల్లు చైనాలో కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పుంజుకుంటున్నాయి. అయితే కొత్తగా నమోదవుతున్న కేసులను చూస్తే వైరస్‌ మార్పు చెందుతుందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. వూహాన్‌లో పుట్టిన వైర్‌సకు తాజాగా ఈశాన్య చైనాలో వెలుగుచూస్తున్న వైరస్‌ చాలా భిన్నంగా ఉన్నట్టు చైనా వైద్యులు గుర్తించారు. చైనా ఉత్తర ప్రావిన్స్‌లోని జిలిన్‌, హీలాంగ్‌జియాంగ్‌లో కొత్తగా నమోదైన కరోనా రోగుల్లో వైరస్‌ చాలాకాలం బతికి ఉందని, వారు కోలుకోవడానికి చాలాకాలం పట్టిందని ప్రతికూల న్యూక్లియర్‌ యాసిడ్‌ పరీక్షల్లో గుర్తించినట్టు ప్రముఖ వైద్యనిపుణుడు క్వి హైబో తెలిపారు. అలాగే వైరస్‌ సోకిన చాలాకాలం వరకు లక్షణాలు బయటపడడం లేదని, బాధితుడిని గుర్తించేలోపే వైరస్‌ విపరీతంగా పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 


ఇది రష్యా నుంచి వచ్చిందా?

ఈ తరహా వైరస్‌ సోకిన వారిలో ఎక్కువ మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని గుర్తించినట్టు హైబో చెప్పారు. వూహాన్‌లో బయటపడిన వైరస్‌ కారణంగా ఎక్కువ మందికి గుండె, కిడ్నీ, పేగు సంబంధిత వ్యాధులతో బాధపడ్డారన్నారు. రష్యా నుంచి వచ్చిన వారిలోని వైర్‌సలో ఈ తరహా లక్షణాలు కనిపిస్తున్నట్టు చెప్పారు. కాగా చైనాలో మళ్లీ పాజిటివ్‌ కేసుల కలకలం మొదలైంది. తాజాగా 16 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. సింగపూర్‌లో తాజాగా 570 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఈ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 29,364కి చేరింది. పాకిస్థాన్‌లో బుధవారం ఒక్కరోజే 1932 మందికి వైరస్‌ సోకింది. 48 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 45,898కి చేరుకోగా మొత్తం 985 మరణాలు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ కారణంగా 2020-21 విద్యా సంవత్సరంలో ముఖాముఖి తరగతులను రద్దు చేస్తున్నట్టు కేంబ్రిడ్జి యూనివర్సిటీ బుధవారం ప్రకటించింది. దక్షిణ కొరియాలో పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకినట్టు గుర్తించారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా దక్షిణాఫ్రికాలో పనిచేస్తున్న 26 మంది భారత శాస్త్రవేత్తలు తిరిగి స్వదేశానికి పయనమయ్యారు. లాక్‌డౌన్‌ కారణంగా భారత సంతతికి చెందిన 150 మంది ఇక్కడే ఉండిపోయారు. 


Advertisement
Advertisement
Advertisement