Abn logo
Sep 24 2020 @ 01:44AM

ఆహ్లాదం అంచున..అపాయం

Kaakateeya

భారీ వర్షాలకు పొంగుతున్న చెక్‌డ్యాంలు, చెరువులు

రక్షణా చర్యలు చేపట్టని అధికారులు

అలుగుల వద్ద వెంటాడుతున్న మృత్యువు


చిన్నచింతకుంట, సెప్టెంబరు 23 : వర్షాలు ఆగమాగం చేశాయి. ఆగస్టు మొదటి వారం నుంచి ఈ నెల రెండో వారం వరకు కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. రోడ్లు కోతకు గురవడంతో పాటు చెరువులు, కుంటలు పొంగడంతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ముఖ్యంగా గత వారం కురిసిన వర్షాలకు మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలాన్ని కుదిపేశాయి. ఏళ్లుగా నిండని చెరువులు అలుగు పారగా, కుంటలు పొంగి, చెక్‌డ్యాంలు ఉధృతంగా పారాయి. ఊకచెట్టు వాగు, మన్నెవాగు, నక్కలవంపు వాగులు ఉగ్రరూపం దాల్చడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.


ఎగువ నుంచి వస్తున్న వరదతో కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండగా, ఈ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఊకచెట్టు వాగు పూర్తిగా నిండిపోయింది. బండర్‌పల్లి, అల్లీపురం చెక్‌డ్యాంలు అలుగు పారాయి. పర్దీపూర్‌ రిజార్వాయర్‌ అలుగు పారగా, సీతారాంపేట, చిన్నవడ్డెమాన్‌ గుండా వాగులోకి నీరు చేరుతోంది. తిర్మాలాపూర్‌ చెరువు అలుగు పారగా, ఆత్మాకూర్‌-మహబూబ్‌నగర్‌ వెళ్లే ప్రధాన రహదారిపై వరద ఉధృతి కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.


మృత్యు ఘంటికలు

వాగులు, చెరువులు, చెక్‌డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. అయితే ఈ అందాలను చూసేందుకు వెళ్తున్న పర్యాటకులు కొందరు ప్రమాదవశాత్తు మృత్యువాత పడుతున్నారు. అల్లీపురం చెక్‌డ్యాంలో ఇటీవల అల్లీపురం గ్రామానికి చెందిన సాయిరాంగౌడ్‌ అనే బీటెక్‌ విద్యార్థి గల్లంతయ్యాడు. తల్లిదండ్రులతో కలిసి చెక్‌డ్యాంలో సెల్ఫీ దిగుతుండగా అలుగు ఉధృతికి అందులో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డాడు.


అలాగే రెండు రోజుల కిందట పర్ధీపూర్‌ రిజర్వాయర్‌ అలుగు వంతెన వద్ద సింద్యానాయక్‌తండాకు చెందిన ఈశ్వర్‌నాయక్‌ (8) అనే బాలుగు ప్రమాదవశాత్తు జారి పడి గల్లంతయ్యాడు. ఇలా నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు నీటిలో గల్లంతై ప్రాణాలు వదిలారు. అయితే, రిజార్వయర్లు, చెక్‌డ్యాంల వద్ద అధికారులు రక్షణ చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్యాటకులు ఎవరూ నీటి ప్రవాహం వద్ద వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

Advertisement
Advertisement
Advertisement