Abn logo
May 19 2020 @ 00:45AM

‘బిల్డ్‌ ఏపీ’ పేరిట రాష్ట్రాన్ని అమ్మేస్తారా!

విశాఖ నగరంలోని 13.83 ఎకరాల భూమిని ‘లులు మాల్‌’కు తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేటాయింపును రద్దు చేసింది. ఆ భూమిని ప్రజావసరాలకు వినియోగిస్తారని ప్రజలు భావించారు. ఇప్పుడు ఆ భూమినీ ‘బిల్డ్‌ ఏపీ’లో భాగంగా అమ్మకానికి పెట్టారు. మరి పాత కేటాయింపును ఎందుకు రద్దు చేశారు? కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్నంతా ఆ కృషిలో నిమగ్నం చేయవల్సిందిపోయి ఇలా ఆస్తుల అమ్మకాలలో ముంచి తేల్చడం సబబేనా?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘బిల్డ్ ఏపీ మిషన్’ పేరుతో ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దీనికనుగుణంగా గుంటూరు, విశాఖ జిల్లాలలోని కొన్ని భూములను ‘ఇ-–వేలం’ వేయడానికి ఈ నెల 13న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మిషన్ లక్ష్యమేమిటి? రాష్ట్రంలో నిరుపయోగంగావున్న భూములను అమ్మి, తద్వారావచ్చే సొమ్ముతో ప్రభుత్వ సంక్షేమ పథకాల (నవరత్నాలు, నాడు-నేడు మొదలైనవి) అమలుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం.


సంక్షేమ పథకాలు అమలు చేయడం మంచిదే కానీ, ఆ పేరుతో ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం వివేకమైన ఆలోచనేనా? అలా అమ్ముకుంటూ పోతే కొన్నాళ్ళకు ప్రభుత్వ ఆస్తులు ఏవీ మిగలవు. అప్పుడు ఏం చేస్తారనే సందేహాలు సహజంగానే తలెత్తుతాయి. వీటిని నివృత్తి చేసుకోవాలంటే ఆస్తుల వేలంపై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు, బిల్డ్ ఏపీ మిషన్ అమలుకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించాలి.


బిల్డ్ ఏపీ మిషన్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక స్టేట్ లెవెల్ మోనిటరింగ్ కమిటీ (ఎస్‌ఎల్‌ఎంసి)ని ఏర్పాటు చేసింది. దీనికి సంభంధించి గత నవంబర్ 5న జిఓ 447ను విడుదల చేశారు. అందులో మూడు అంశాలను ప్రధానంగా పేర్కొన్నారు. ఒకటి- నవరత్నాలు, నాడు-నేడు వంటి పథకాల అమలుకు నిధులు సమకూర్చుకోవడం; రెండు-  రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న స్థలాలను అమ్మడం ద్వారా ఆ నిధులు రాబట్టడం; మూడు- ఈ పనిని సమర్థంగా చేయడానికి ‘నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్’ (ఎన్‌బిసిసి) అనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో ఒప్పందం చేసుకోవడం. బిల్డ్ ఏపీ అమలుకై ఎస్‌ఎల్‌ఎంసి సమావేశం ముఖ్యమంత్రి అద్యక్షతన గత మార్చి 2న జరిగింది. దీని మినిట్స్ కాపీని ఎస్‌ఎంఎల్‌సికో కన్వీనర్ ఏప్రిల్ 4న సంబంధిత శాఖాధిపతులకు 27 పేజీల లేఖ ద్వారా తెలియజేశారు.


ముఖ్యమంత్రితో పాటు 20 మంది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఎన్‌బిసిసి ప్రతినిధి, ఈ అమ్మకాలకు బ్రోకర్లుగా వ్యవహరించే రెండు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా దీనికి హాజరయ్యారు. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు పది వేల కోట్ల రూపాయల విలువచేసే 1400 ఎకరాల భూమి 250 ప్రాంతాలలో ఉందని గుర్తించారు. ఈ భూమిని వివిధ దశలలో అమ్మాలని ప్రతిపాదించారు. మొదటి దశలో విశాఖపట్నం జిల్లాలో 28, కృష్ణ జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 7 మొత్తం 40స్థలాలను అమ్మవచ్చని ఎన్‌బిసిసి ఎంపిక చేసింది. ఈ స్థలాల నుండి అత్యధిక రాబడి సాధించేందుకు అవసరమైన సహకారానికి కెనడా రాజధాని టొరోంటో ప్రధాన కేంద్రంగా ఉన్న కొలియర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, అమెరికా దేశంలోని చికాగో ప్రధాన కేంద్రంగా ఉన్న జెఎల్‌ఎల్ ప్రోపర్టీ కన్సల్టెంట్స్ అనే సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ఈ రెండూ రియలెఎస్టేట్ రంగంలో ప్రపంచంచంలోనే అతి పెద్ద కంపెనీలు.


ఇలా అమ్మకానికి పెడుతున్న స్థలాలు ఎపిఐఐసి, ఇరిగేషన్, మునిసిపల్, రెవిన్యూ, ఆరోగ్య, జైళ్ల శాఖలకు చెందినవి ఉండడంతో, ఎలాంటి వివాదాలకు తావులేకుండా అమ్మకానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడానికి జిల్లా కలక్టర్ అధ్యక్షులుగా, జిల్లా జాయింట్ కలెక్టర్ కన్వీనరుగా డిస్ట్రిక్ట్ ప్లానింగ్ & ఇంప్లిమెంటేషన్ కమిటీ (డిపిఐసి)ని అన్ని జిల్లాలలో ఏర్పాటు చేశారు. డిపిఐసి, ఎన్‌బిసిసిల సంయుక్త సమావేశాలు గత ఫిబ్రవరిలో విశాఖ, గుంటూరు, విజయవాడలో జరిగాయి. భూమి విలువ పెరిగేలా అవసరమైన చోట్ల భూ వినియోగాన్ని కూడా మార్చాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలోనే మూడు జిల్లాలలో మొత్తం 19 స్థలాలను గుర్తించి, వాటి అమ్మకం ద్వారా ఎంత ఆదాయం రావచ్చనే అంచనాకు కూడా వచ్చారు. గుంటూరులోని ఆరు స్థలాల (27.96 ఎకరాలు) ద్వారా రూ.500.55 కోట్లు రావచ్చని, విశాఖలోని పది స్థలాల (34.40 ఎకరాలు) అమ్మకం ద్వారా రూ.1054.43 కోట్లు, కృష్ణా జిల్లాలో మూడు స్థలాల (82.44 ఎకరాలు) ద్వారా రూ.209.44 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా వేశారు. అయితే కరోనా విలయంతో వ్యక్తుల, వ్యాపార సంస్థల ఆర్థిక స్థితిగతులు తలకిందులైపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఆశిస్తున్న ఆదాయం నిజంగా వస్తుందా?


అసలు ప్రభుత్వ భూములు ఇలా అమ్మడం వివేకమేనా అనే ప్రశ్న అలా ఉండగా ఇంకా విచిత్రమైన రెండు విశేషాలు ఈ భూముల వేలం వ్యవహారంలో ఉన్నాయి. ఒకటి- స్థలాల విలువ కట్టడం; రెండు- ఆ స్థలాలలో ప్రస్తుతం ఏమున్నాయి? అనేవే ఆ విశేషాలు. మార్కెట్ విలువ కంటే అన్ని స్థలాలలోనూ తక్కువే వస్తుందనే భావన అధికారులలో ఉన్నది. అదే సందర్భంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రేట్ల కంటే కూడా వీరు తక్కువ మార్కెట్ రేటును పొందుపరిచారు. ఉదాహరణకు విజయవాడ కార్పొరేషన్‌లోని అజిత్ సింగ్ నగర్‌లో ఒక చోట 57.69 ఎకరాల భూమికి వీరు నిర్ణయించిన మార్కెట్ విలువ రూ.106.23 కోట్లు కాగా, అక్కడ రిజిస్ట్రార్ విలువ రూ.253.76 కోట్లు ఉన్నది. అమ్మాలనుకున్న కొన్ని స్థలాలలో ప్రధానమైన ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లు పనిచేస్తున్నాయి. ఉదాహరణకు గుంటూరు నగరంలోని అరండల్ పేటలో తాహసీల్దార్ ఆఫీసు, జైలు ఉన్న స్థలాన్ని ఖాళీ చేయించి అమ్మేయాలని నిర్ణయించారు.


అలాగే విశాఖ నగరంలోని సీతమ్మధారలో ఉన్న తాహసీల్దార్ ఆఫీసు, రెవిన్యూ ఉద్యోగుల క్వార్టర్లను ఖాళీచేయించి అమ్మకానికి పెడుతున్నారు. ఇంకా విచిత్రంగా, అక్కడే ఉన్న ప్రభుత్వ కంటి ఆసుపత్రిని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డైరక్టర్ కార్యాలయాన్ని కూడా తరలించి, 11 ఎకరాల ఆ స్థలాన్ని కూడా వేలానికి పెట్టాలని నిర్ణయించారు. ఇంకో విశేషమేమిటంటే గత ప్రభుత్వం విశాఖ నగరంలోని 13.83 ఎకరాల భూమిని ‘లులు మాల్‌’కు కేటాయించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేటాయింపును రద్దు చేసింది. ప్రభుత్వం దీనిని ప్రజావసరాలకు వినియోగిస్తుందని భావించి ప్రజలు ఈ రద్దును హర్షించారు. కానీ వారికి దిమ్మదిరిగేలా ప్రభుత్వం నేడు ఆ భూమిని కూడా అమ్మకానికి పెట్టింది. ఆ కాడికి పాత కేటాయింపును రద్దు చేయడమెందుకు, ‘లులు మాల్’కే వదిలేస్తే పోయేది కదా అనే భావనతో ఇప్పుడు ఆ ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారు. విజయవాడలో ఉన్న సెంట్రల్ జైలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న జైళ్ల స్థలాలను అమ్మకానికి పెట్టాలని కూడా ఈ సమావేశం లోనే నిర్ణయించారు. దీనితో సరిపెట్టకుండా గత ప్రభుత్వం రాష్ట్ర రాజధానికై అమరావతిలో రైతుల నుండి సేకరించిన భూమిలో సింగపూర్ సిటీ పేరుతో అభివృద్ధికి కేటాయించిన 1600 ఎకరాల స్థలం కూడా మొదటి దశలోనే అమ్మాలని ప్రభుత్వ ప్రతిపాదన.


రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 1400 ఎకరాలలో మొదటి దశలో మూడు జిల్లాలలో 144.8 ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెడుతున్నారు. ఇందులో వెంటనే గుంటూరులో 13.23 ఎకరాలకు, విశాఖలో 5.57 ఎకరాలకు ‘ఇ- వేలం’ అమ్మకానికి టెండర్లు పిలిచారు. వేలం ఈ నెల 28-–30 తేదీల మధ్య జరుగుతుందని అందులో పేర్కొన్నారు. ఇదంతా చూస్తుంటే ‘బిల్డ్‌ ఏపీ’ అంటే ఏపీను నిర్మించు పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడం కాకుండా అమ్మకానికి పెట్టడంలా ఉంది. ఒక పక్క అమ్మేస్తూ, ఇదెలా నిర్మించడమవుతుందో ఆ పేరు పెట్టిన వారే తెలపాలి.


ఈ మొత్తం వ్యవహారం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ వివేచనా వివేకాలను ప్రశ్నించేలా చేస్తోంది. ఇలా అమ్ముకుంటూ పోతే ఆస్తులు తరుగుతాయే కానీ పెరగడానికి ఇదేమీ ఊరే జల కాదు కదా! ఈ అమ్మకాలలో విదేశీ బడా రియల్ ఎస్టేట్ సంస్థలను భాగస్వామ్యం చేయడం వెనుక ఏమైనా మతలబుందా అనే సందేహం కూడా సామాన్యులకు కలగకమానదు. ఎందుకంటే గతంలో మన రాష్ట్రంలోనే కొన్ని లావాదేవీలలో ఇరుక్కుని కొంతమంది మంత్రులు, సీనియర్ అధికారులు జైలుకెళ్ళిన ఉదంతం మన కళ్లెదుటే ఇంకా కదలాడుతోంది. ప్రభుత్వ ఆఫీసులను, అందులోనూ ఆసుపత్రులను, వైద్య ఆరోగ్య శాఖల డైరక్టర్ కార్యాలయం, రెవిన్యూ అధికారులైన తాహసీల్దార్ ఆఫీసులను కూడా ఖాళీ చేయించి మరీ అమ్మకానికి పెట్టడంలో ఆంతర్యమేమిటనే సందేహం కూడా కలుగుతుంది.


వీటన్నిటికి మించి నేడు దేశమంతా ప్రాణాంతకమైన మహమ్మారిని ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్నంతా ఆ పనిలో దింపవలసిందిపోయి ఇలా ఆస్తుల అమ్మకాలలో ముంచి తేల్చడం సబబేనా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఇటువంటి సందేహాలను కొట్టిపారేయకుండా నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇంటి రోజువారీ ఖర్చులకు ఆదాయ మార్గాలను వెతుక్కోకుండా ఇంట్లో సామాన్లన్నీ అమ్ముకుంటూ పోతే, ఆ ఇల్లు ఎలా దివాళా తీస్తుందో మన రాష్ట్ర పరిస్థితి కూడా అక్కడికే చేరుకుంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞతతో పునరాలోచించి స్థిరంగా వచ్చే ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి సారించాలి. కేంద్రం నుండి రావలసిన మన వాటా నిధులకై అవసరమైతే అందరిని కలుపుకుని ఒత్తిడి తేవాలి. అంతేకాని ఇలా ఆస్తులను అమ్ముకోవడం రాష్ట్రానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. విజ్ఞత అంతకంటే కాదు.

ఎ. అజ శర్మ,

ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

Advertisement
Advertisement
Advertisement