ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్’ చిత్రం విడుదల తేదీ ఖరారైందని చిత్రబృందం ఆదివారం తెలియజేసింది. ‘‘సలార్ విడుదల తేదీని అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న సినిమా హాళ్లలో కలుద్దాం’’ అని ప్రభాస్ తెలిపారు. ‘‘మోస్ట్ వయలెంట్ సలార్’’ అని హోంబలే ఫిలింస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విజయ్ కిరగందూర్ ట్వీట్ చేశారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14, 2022న ‘సలార్’ తిరుగుబాటు మొదలు కానుంది. ప్రభాస్ అభిమానుల అంచనాలను మించేలా సినిమా తెరకెక్కుతోంది. ప్రేక్షకులు అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి మేం ఎదురు చూస్తున్నాం’’ అని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పారు. ‘కె.జి.యఫ్ 2’ తర్వాత ఆ చిత్రదర్శక-నిర్మాతలు ప్రభాస్తో చేస్తున్న చిత్రమిది. ఇందులో శ్రుతీ హాసన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీత దర్శకుడు.