Abn logo
Mar 17 2020 @ 04:24AM

మా ప్రాణాలు పణంగా పెట్టాలా?

ఒలింపిక్స్‌ నిర్ణీత షెడ్యూల్‌ మేరకు జరుగుతాయని జపాన్‌ ప్రధాని షింజో అబె, అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఓఐసీ) చీఫ్‌ థామస్‌ పదేపదే నొక్కిచెబుతున్నా.. జపాన్‌లో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో ఒలింపిక్స్‌ నిర్వహణపై జపాన్‌లో వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. ఆ క్రీడలకోసం తమ ప్రాణాలు పణంగా పెట్టబోమని దేశ ప్రజలు అంటున్నారు.


ఒలింపిక్స్‌ వద్దే..వద్దు

జపాన్‌లో పెరుగుతున్న వ్యతిరేకత


టోక్యో: ప్రస్తుతం కరోనా వైరస్‌ గురించి ప్రపంచమంతా ఎంత చర్చ జరుగుతోందో అంతకుమించి ఒలింపిక్స్‌పై వాదోపవాదాలు జరుగుతున్నాయి. కరోనా దెబ్బకు ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ లీగ్‌లు, ఎన్‌బీఏ చాంపియన్‌షి్‌ప రద్దయ్యాయి. జపాన్‌లోనూ పలు క్రీడా పోటీలది అదే దుస్థితి. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌ను కనీసం ఏడాది వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే సూచించారు. ఇక.. జపాన్‌లో కరోనా ప్రభావం తక్కువగానే ఉంది. 814 పాజిటివ్‌ కేసులే నమోదుకాగా, 24 మంది మరణించారు. కానీ ఆ దేశ ప్రజలు ఒలింపిక్స్‌ నిర్వహించవద్దని ఖరాఖండిగా చెబుతున్నారు. 


టూరిస్టులు వచ్చిపడరూ..

ఒలింపిక్స్‌ నిర్వహిస్తే జపాన్‌కు పర్యాటకులు వెల్లువెత్తుతారని టోక్యోలోని ఓ ఇంటర్నెట్‌ సంస్ధ ఉద్యోగి, 27 ఏళ్ల కోకి మ్యురా అన్నాడు. ‘నిజాయతీగా చెప్పాలంటే.. కరోనా బారినుంచి జపాన్‌ బయటపడినా విశ్యవ్యాప్తంగా పర్యాటకులు రావడం మాకు ఇష్టంలేదు. ఒలింపిక్స్‌ను ఏకపక్షంగా రద్దు చేయలేకపోతే కనీసం వాయిదా వేయడం ఉత్తమం’ అని అభిప్రాయపడ్డాడు. ‘ఒలింపిక్స్‌కోసం మా జీవితాలను పణంగా పెట్టలేం’ అని మ్యూరా స్పష్టంజేశాడు.


వణికిపోతున్నారు

కరోనా మహమ్మారితో ప్రజలంతా వణికిపోతున్నారని 90 ఏళ్ల పెన్షనర్‌ మసావొ సుగవార అన్నాడు. ‘ఒలింపిక్స్‌ను వాయుదా వేయాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ట్రంప్‌ కూడా అదే చెప్పారు’ అని గుర్తు చేశాడు. జూన్‌-జూలై నాటికి కరోనాను కట్టడి చేయలేకపోతే క్రీడలను వాయిదా వేయడం సబబే అని జపాన్‌, జర్మనీ సంతతికి చెందిన 47 ఏళ్ల లాయర్‌ మాన్‌ఫ్రెడ్‌ ఒటో అన్నాడు. ఒలింపిక్స్‌ జరిగే అవకాశాలు లేవనే పందెంరాయుళ్లు కూడా ధీమాగా ఉన్నారు. జూలై 24న ప్రారంభోత్సవం జరగదని పాడీ పవర్‌ అనే బుక్‌మేకర్‌ 4-1తో పందెం కాశాడు. 


మాకొద్దు ఈ ఆటలు!

మెజార్టీ జపాన్‌ ప్రజలంతా ఒలింపిక్స్‌ అతిథ్యంపై వ్యతిరేకత కనబరుస్తున్నారు. జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరిగే ఒలింపిక్స్‌ నిర్వహణపై జపాన్‌కు చెందిన మీడియా సంస్థ ఎన్‌హెచ్‌కే ప్రజాభిప్రాయం సేకరించింది. అందులో 45 శాతం మంది నిర్ణీత సమయానికి ఒలింపిక్స్‌ నిర్వహించడాన్ని వ్యతిరేకించారు. 40 శాతంమంది సుముఖత ప్రకటించారు. ఇక.. క్యోడో అనే సంస్థ వేయిమందితో చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో 69.9 శాతం మంది ఒలింపిక్స్‌ నిర్వహించవద్దని సూచించారు. ‘ఒలింపిక్స్‌ను రద్దు చేయడాన్ని ఊహించలేం’ అని టోక్యో గవర్నర్‌ యురికొ కోయ్‌కె వ్యాఖ్యానించారు. అయితే తుది నిర్ణయం అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)దేనని ఆయన అన్నారు. 


ఐఓసీ కీలక భేటీ నేడు

ఒలింపిక్స్‌పై అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలతో ఐఓసీ మంగళవారం నాడు అత్యవసరంగా సమావేశమవుతోంది. ఒలింపిక్స్‌ను వాయిదా వేసే విషయంలో అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటామని ఐఓసీ అధ్యక్షుడు బాచ్‌ చెప్పారు. అయితే ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలు వాయిదా పడడం తీవ్ర సమస్యలను సృష్టిస్తున్నదని అన్నారు. క్వాలిఫయింగ్‌ పోటీలకు సంబంధించి పట్టువిడుపులు ప్రదర్శిస్తామని ఈనెలారంభంలో బాచ్‌ ప్రకటించడం అథ్లెట్లకు ఉత్సాహాన్నిచ్చింది. దాంతో ఆ టోర్నీలకోసం వారు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యారు. జపాన్‌లో బేస్‌బాల్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతాకాదు. ఒలింపిక్స్‌లో ఆ మ్యాచ్‌ టిక్కెట్లను తాను ఎప్పుడో కొనుగోలు చేశానని 47 ఏళ్ల హిసాయ సుజుకి చెప్పాడు. ‘ఒలింపిక్స్‌ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడడం జీవితంలో ఒకేసారి వచ్చే విశేషం. దాంతో ఆ మ్యాచ్‌కు నా కుమారుడిని తప్పకుండా తీసుకుపోవాలని అనుకుంటున్నా’ అని అతడు తెలిపాడు. ‘కరోనా వల్ల పరిస్థితులు దారుణంగా మారితే క్రీడలను వాయిదా వేయడమే తెలివైన నిర్ణయం’ అని సుగవార అన్నాడు. ‘నాకు 90 ఏళ్లు. ప్రపంచ యుద్ధ సమయంలో తప్ప నేను ఎప్పుడూ ఆందోళన చెందలేదు’ అని అతడు చెప్పడం కరోనా తీవ్రతను తెలియజేస్తోంది. 

Advertisement

క్రీడాజ్యోతిమరిన్ని...

Advertisement
Advertisement