Oct 1 2020 @ 22:12PM

ఓల్డ్ ఈజ్‌ గోల్డ్: అక్టోబర్‌ 1 విడుదలైన చిత్రాలివే

ఓల్డ్ ఈజ్‌ గోల్డ్ అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి గోల్డెన్ చిత్రాలు అక్టోబర్‌ 1వ తేదీన ఏవేవీ విడుదల అయ్యాయో.. నేటితో అవి ఎన్ని ఏళ్ళు పూర్తి చేసుకున్నాయో తెలుసుకుందామా..

ఏఎన్నార్ ‘లైలామజ్ను’చిత్రానికి 71 ఏళ్ళు

నట సామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు మజ్నుగా, భానుమతి లైలాగా నటించిన చిత్రం ‘లైలామజ్ను’. ఈ చిత్రం 1949, అక్టోబర్‌ 1వ తేదీన విడుదలైంది. నేటితో ఈ చిత్రం 71 ఏళ్ళు పూర్తి చేసుకుంది. భరణి పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి దర్శకుడు రామకృష్ణ. సుబ్బరామన్‌ సంగీతం అందించారు. 

ఏఎన్నార్‌ ‘దొంగరాముడు’కి 65 ఏళ్ళు

నట సామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు, మహానటీమణులు సావిత్రి, జమున నటించిన ఎవర్‌గ్రీన్‌ చిత్రం 'దొంగరాముడు'. ఈ చిత్రం 1955, అక్టోబర్‌ 1 తేదీన విడుదలైంది. నేటితో ఈ చిత్రం 65 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అన్నపూర్ణ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి కె.వి. రెడ్డి దర్శకుడు. పెండ్యాల సంగీతం అందించారు.

నటరత్న యన్టీఆర్‌ ‘తీర్పు’కి 45 ఏళ్ళు

నటరత్న యన్టీఆర్‌ ప్రత్యేక పాత్రలో నూతన నటీనటులతో నిర్మించిన ప్రయోగాత్మక చిత్రం 'తీర్పు'. ఆంధ్రప్రదేశ్‌లో వినోదపు పను మినహాయించిన మొట్టమొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రం 1975, అక్టోబర్‌ 1 తేదీన విడుదలైంది. నేటితో ఈ చిత్రం 45 వసంతాలు పూర్తి చేసుకుంది.

మెగాస్టార్‌ చిరంజీవి 'టింగురంగడు'కు 38 ఏళ్ళు

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా అనిల్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత తాతినేని ప్రకాశరావు నిర్మించిన చిత్రం 'టింగురంగడు'. తాతినేని ప్రసాద్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ 1982 అక్టోబర్‌ 1 తేదిన విడుదలైంది. నేటితో ఈ చిత్రం 38 ఏళ్ళు పూర్తి చేసుకుంది.  

మల్టీస్టారర్‌ చిత్రం 'పట్నం వచ్చిన పతివ్రతలు' చిత్రానికి 38 ఏళ్ళు

మెగాస్టార్‌ చిరంజీవి, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు హీరోలుగా.. రాధిక, గీత హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'పట్నం వచ్చిన పతివ్రతలు'. శ్రీనివాసా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అట్లూరి రాధాకృష్ణ మూర్తి, కొమ్మిన నారాయణరావు నిర్మించారు. ఈ చిత్రం 1982 అక్టోబర్‌ 1వ తేదీన విడుదలైంది. నేటితో ఈ చిత్రం 38 ఏళ్ళు పూర్తి చేసుకుంది. విజయబాపినీడు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సత్యం సంగీతాన్ని అందించారు.