Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఓడ్ టు లవ్

ప్రేమించే మనుషులున్నంత కాలం

ఈ ప్రపంచం ఇలాగే పచ్చపచ్చగా 

       ఆనందంగా హాయిగా వుంటుంది

ప్రేమించే మనుషులే యుద్ధాలు చేస్తారు

వ్యవసాయం చేస్తారు

వేయికళ్లతో ప్రపంచాన్ని కనిపెట్టుకుని వుంటారు

ప్రేమే ప్రాణభూతం ప్రాణవాయువు

రాత్రుళ్లను పవలుగా మార్చేది ప్రేమే

పవలుకింత వెలుతురునిచ్చేది ప్రేమే

ప్రేమతో నమ్మకంతో బతకటం ఒక కళ

విత్తులు చల్లి నారుమళ్లను పెంచటం ప్రేమ

నారు పీకి చేలో నాటి 

      రేపటి వరిపైరును కలగనటం ప్రేమ

సర్వహింసల వెనకాల అప్రేమే అపనమ్మకమే

ఈ భూగోళం మొత్తం ప్రేమ అనే ఇరుసు మీద తిరుగుతుంది

ఈడెన్‌ గార్డెన్‌ నుంచి బృందావనం దాకా ప్రేమే

ఉన్మత్తంకాని పండిన సపోటకాయ ప్రేమ

నువ్వేమిటి నేనేమిటి సర్వజనులకింత ఆహారం ప్రేమ

ప్రేమకానిదేముంది సృష్టిలో

గూటిలో ఆహారం కోసం నోరు తెరిచిన పక్షిపిల్ల గొంతులో

ఏమిటది

      తల్లి పెట్టేది ప్రేమే

ప్రేమ లేకుండా ఎవడయితే మాత్రం ఎట్టా బతుకుతాడు

      ప్రతిజీవికి ఇంత చిటికెడంత ప్రేమ

ఇన్నాళ్ల యాత్ర ఇంత ప్రేమ కోసమేనా

ఇంకేం మిగులుతుంది ప్రేమ తప్ప

మనం బతికినప్పుడు ప్రేమ కావాలి

మనం పోయిన తర్వాత కూడా ఇంత ప్రేమ మిగలాలి

       పిల్లలకి వాళ్ల పిల్లలకి

దీర్ఘంగా నా కళ్లల్లోకి చూడు

       ఏం కనపడుతుంది

సుడులు తిరుగుతున్న ప్రేమే

అలా చెంపలు మీదకి జారే ప్రేమే

మనుషులందరినీ ప్రేమలో ముంచి 

      బయటకు తీయడానికి యుద్ధం చేయి

అవసరమైతే దేన్నైనా అడ్డంగా నరుకు

తుమ్మచెట్టు నుంచి తుంబంక ఉబికినట్టు

మనిషనే ఈ మాను నుంచి ప్రేమ ఉబకాలి

                          ప్రేమ ఉబకాలి

కె శివారెడ్డి

95021 67764


Advertisement
Advertisement