Abn logo
Sep 27 2020 @ 03:32AM

డాక్యుమెంట్‌ రైటర్లూ బాధ్యులే!

Kaakateeya

రిజిస్ట్రేషన్ల పొరపాట్లలో భాగస్వాములే

అలాగైతేనే అక్రమ రిజిస్ట్రేషన్లకు కళ్లెం

అందుకే లైసెన్సులివ్వాలని సీఎం నిర్ణయం

19 ఏళ్ల తర్వాత లైసెన్సుల పునరుద్ధరణ

రాష్ట్రంలో 1500 మంది దస్తావేజు లేఖరులు


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్లలో చోటు చేసుకునే అక్రమాల్లో ఇక మీదట డాక్యుమెంట్‌ రైటర్లనూ బాధ్యులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దస్తావేజుల తయారీలో వీరే కీలకం కావడంతో బాధ్యులను చేస్తే కొంతలో కొంతైనా అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వీరికి లైసెన్సులు ఇవ్వడం ద్వారా బాధ్యులను చేయాలని నిర్ణయించింది. దసరా నుంచి ధరణి పోర్టల్‌ను ప్రారంభించి, బంద్‌ అయిన రిజిస్ట్రేషన్లను పునఃప్రారంభిస్తామని, సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఉండే డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్సులు, శిక్షణ ఇస్తామని శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. వాస్తవానికి ఉమ్మడి ఏపీలో 1985లో ప్రభుత్వమే వీరికి లైసెన్సులను జారీ చేసింది. ఇంటర్‌  పూర్తయి, టైప్‌ రైటింగ్‌లో శిక్షణ కలిగిన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వమే 200 మందికి శిక్షణ ఇచ్చి, లైసెన్సులు మంజూరు చేసింది.


అప్పటి నుంచి సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద వీరు డాక్యుమెంట్లను తయారు చేస్తూ వచ్చారు. దస్తావేజుల రూపకల్పనలో వీరు కీలక భూమిక పోషిస్తారు. రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో ఆయా దస్తావేజుల ప్రొఫార్మాలు ఉన్నప్పటికీ, వాటిని భర్తీ చేసి, రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే క్రయ విక్రయదారులు తీవ్ర గందరగోళం, అయోమయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఎంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అయినా డాక్యుమెంట్‌ రైటర్లను ఆశ్రయించి, దస్తావేజులను తయారు చేయించుకుంటారు. గతంలో డాక్యుమెంట్‌ రైటర్లపై తీవ్ర విమర్శలొచ్చాయి. ప్రభుత్వ భూములని తెలిసినా డాక్యుమెంట్లు తయారు చేస్తున్నారని, సబ్‌-రిజిస్ట్రార్లను మచ్చిక చేసుకుని కస్టమర్ల వద్ద ఎక్కువ డబ్బును లాగుతున్నారన్న ఆరోపణలు రావడంతో 2001లో వీరి లైసెన్సులను పూర్తిగా రద్దు చేశారు. అయినా... ఈ వ్యవస్థ కనుమరుగు కాలేదు. ఇప్పటికీ వీరు ఉనికిలోనే ఉన్నారు. లైసెన్సులు లేకపోయినా... డాకుమెంట్లను తయారు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఒక్కోదాని వద్ద సగటున 10 మంది చొప్పున 1400 వరకు ఉన్నారు.


ఇందులో 150 మంది పాత లైసెన్సు హోల్డర్లు ఉండగా, మిగతా వారంతా కొత్త వారే. 19 ఏళ్ల తర్వాత వీరికి మళ్లీ లైసెన్సులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏ కార్యాలయం వద్ద ఎంతమంది డాక్యుమెంట్‌ రైటర్లు ఉన్నారన్న విషయమై ఈ నెల 17న స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఐజీ కార్యాలయం వివరాలు సేకరించింది.  లైసెన్సులు ఇవ్వడానికే వీరి వివరాలు సేకరించినట్లు 18న ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది. అన్నట్లుగానే లైసెన్సులు జారీ కాబోతున్నాయి. సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో ఏ భూమి ప్రభుత్వానిది, ఏది ప్రైవేటుదన్న సమాచారం డాక్యుమెంట్‌ రైటర్లకు పక్కాగా ఉంటుంది. డబుల్‌, ట్రిపుల్‌ రిజిస్ట్రేషన్లు జరిగే డాక్యుమెంట్లను వారు పసిగట్టగలరు. రిజిస్ట్రేషన్లకు వీరిని కూడా బాధ్యులను చేస్తే ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లు జరగకుండా కళ్లెం వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement