Abn logo
Apr 22 2021 @ 00:46AM

న్యాయకోవిదుడి తేటతెనుగు మనసు

జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా ఏప్రిల్‌ 24న బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంలో, ఒక తెలుగుబిడ్డ న్యాయశిఖరాన్ని అధిరోహించినందుకు యావత్తు తెలుగుజాతి గర్విస్తోంది. తనను తాను తెలుగువాడినని సగర్వంగా చెప్పుకోవటమే కాకుండా, తెలుగు భాషపై అపారమైన ప్రేమాభిమానాలను పలు సందర్భాల్లో ప్రకటించుకున్నవారాయన.


2012 డిసెంబరులో, తిరుపతి 4వ ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో జస్టిస్ రమణ ఒక దినపత్రికలో రాసిన వ్యాసం నన్నెంతగానో ఆశ్చర్యపరచింది. ఆనాడు అధికారభాషా సంఘం అధ్యక్షునిగా ‘పరిపాలనలో తెలుగు’ గురించి ఎక్కువ దృష్టిపెట్టి పనిచేస్తున్న నాలో ఆ వ్యాసం ‘న్యాయపాలనలో తెలుగు’ గురించి కొత్త ఆలోచనలు రేకెత్తించింది. తీర్పులు, సాక్ష్యాలు, వాద ప్రతివాదాలు మాతృభాషలో జరిగితే కక్షిదారుడు నిస్సంకోచంగా న్యాయవిచారణలో పాల్గొనగలుగుతాడు. తన వాదనలోని లోటు పాట్లను అర్థం చేసుకుని అవసరమైన పక్షంలో వివాద పరిష్కారానికి చర్య తీసుకోవచ్చు. ఇలా ప్రజలకు చేరువ కాలేకపోతే న్యాయ ప్రక్రియ పేలవమయ్యే ప్రమాదం ఉందనీ, దీన్నుంచి న్యాయప్రక్రియను కాపాడుకోవలసిన గురుతర బాధ్యత మనపై ఉందని జస్టిస్ రమణ ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, జ్యుడిషియల్ అకాడెమీ అధ్యక్షునిగా ఉన్నారాయన. 


ఈ వ్యాసం చదివిన తరువాత వారిని వెళ్లి కలిశాను. వారు కృష్ణాజిల్లా వారే అయినా అంతకు మునుపు నాకు పెద్దగా పరిచయం లేదు. మాట్లాడిన తరువాత ఆయన చేతల మనిషి అని అర్థం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడెమీ, ఆంధ్రప్రదేశ్ అధికారభాషా సంఘం సంయుక్తంగా ‘తెలుగులో న్యాయపాలన’ అంశం మీద ఒక సదస్సు నిర్వహించే నిర్ణయం తీసుకున్నాం. 2013 ఫిబ్రవరి 10న హైదరాబాద్ జుబ్లీ హాలులో సదస్సు విజయవంతంగా జరిగింది. నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్, ఇంకా హైకోర్టు, జిల్లా కోర్టుల న్యాయమూర్తులు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. యావత్ కార్యక్రమం జస్టిస్ రమణ కనుసన్నల్లో జరిగింది. బ్రిటిష్ కాలంలోనూ, నిజాం కాలంలోనూ తెలుగులో వెలువడిన తీర్పులు సేకరించి ఒక ప్రదర్శన ఏర్పాటు చేయించారు. జస్టిస్ రమణ స్ఫూర్తితో ఆ యేడాది పలువురు న్యాయమూర్తులు యాభైకి పైగా తీర్పులను తెలుగులో ప్రకటించారు. 


ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన మీదట, హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షులుగానూ, అధికార భాషాసంఘం అధ్యక్షులు, జ్యుడిషియల్ అకాడెమీ సంచాలకులు, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి (రాజకీయ), న్యాయశాఖ కార్యదర్శి, రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షులు సభ్యులుగా ఒక ప్రాధికార కమిటీని నియమించాలని ప్రతిపాదించారు. కానీ అది పలు కారణాలవల్ల ఆచరణలోకి రాలేదు. తెలుగులో న్యాయ సాంకేతిక పరిజ్ఞానం, న్యాయభాష పదకోశాలు ప్రతీ న్యాయస్థానానికి అందుబాటులోకి రావాలని, ప్రభుత్వం వెలువరించే చట్టాలు, ఉత్తర్వులు మొదట తెలుగులోనే సమాజానికి వెల్లడి కావాలని, ప్రతీ న్యాయస్థానంలో తెలుగు క్లుప్త లిపి లేఖకుల ఏర్పాటు ఉండాలని రాష్ట్ర జ్యుడిషియల్ అకాడెమీ తనవంతు పాత్ర నిర్మాణాత్మకంగా పోషిస్తుందనీ జస్టిస్ రమణ చెప్పారు. వారి సూచనల మేరకు న్యాయపాలనా రంగంలో తెలుగు అమలు కోసం కంప్యూటర్లలో వినియోగానికి తెలుగు ఫాంట్లను, అంతర్జాల పదకోశాలను ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక శాఖ ద్వారా తయారు చేయించటం జరిగింది. భారత రాజ్యాంగంలోని 348వ అధికరణం రాష్ట్రాలలోని హైకోర్టులలో న్యాయప్రక్రియ విధిగా ఇంగ్లీషులోనే జరగాలని పేర్కొంటూనే, క్రింది కోర్టులైన సెషన్స్, మేజిస్ట్రేట్ కోర్టులలో భాషని నిర్దేశించే అధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1974లో జి.వో.ఎం.ఎస్ నెం. 485 ద్వారా క్రిమినల్ కోర్టులలో కార్యకలాపాలు తెలుగులోను, ఇంకా ఇతర స్థానిక భాషలలోనూ జరపవచ్చనే వెసులుబాటు కల్పించింది కూడా. ఇంతలో రాష్ట్రవిభజనతో, నేను అధికారభాషాసంఘం అధ్యక్ష బాధ్యతల నుండి వైదొలిగాను. జస్టిస్ రమణ పదోన్నతిపై ఢిల్లీ హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా వెళ్లారు. అనుకూల పరిస్థితులు కొరవడటంతో ఆనాటి మా కృషి ఏదీ వెలుగులోకి రాకుండాపోయింది. 


కానీ, జస్టిస్ రమణ భాషాభిమానమే కాకుండా భాషాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేయాలన్న వారి సంకల్పం నన్నెంతో ప్రభావితుణ్ణి చేశాయి. అప్పటినుండీ భాషకు సంబంధించిన సభలు జరిగినప్పుడు తప్పనిసరిగా వారిని ఆహ్వానించే వాళ్లం. ఆయన పాల్గొని భాషాభిమానులను ఉత్తేజితులను చేసేవారు. ‘కన్నతల్లి, పుట్టిన ఊరు, తల్లి భాష ప్రతీ వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైనవి. విద్యార్థి దశలో మాతృభాషలో విద్యార్జన అనివార్యం, అది భావి జీవితానికి గట్టి పునాది వేస్తుంది’ అంటారాయన. ఎన్ని భాషలు నేర్చినవ్యక్తి అయినా మాతృభాషకే ప్రాముఖ్యం ఉంటుంది. మాతృభాష విలువను తెలుసుకుని గౌరవించటం మన ప్రాథమిక బాధ్యత అని రమణ తన ప్రసంగాలలో చెప్పేవారు. 


సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన తరువాత జస్టిస్‌ రమణ ఢిల్లీలో తన నివాస గృహం ముందు నామఫలకంపై తెలుగులో తన పేరు రాయించటం వారి మాతృభాషాభిమానానికి అద్దం పడుతుంది. ఢిల్లీలో ఆ తెలుగు అక్షరాలను చూసి మురిసిపోయినవారెందరో! తెలుగు సాహిత్యం అంటే ఆయనకు పరమప్రీతి. ప్రత్యేకించి రావిశాస్త్రి ఆరుసారా కథలు కంఠోపాఠం. చాలా సభలలో వాటిని ప్రస్తావించేవారు. ఇటీవల సుప్రీంకోర్టు తన తీర్పులను వివిధ ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేసి, అధికారిక వెబ్‌సైట్లలో పదిలపరచాలన్న నిర్ణయం వెనుక జస్టిస్ రమణ ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 


2019 డిసెంబరులో విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు పంపించిన సందేశంలో జస్టిస్‌ రమణ మాతృభాష ఉన్నతి గురించి చెప్పిన విషయాలు గొప్పవి. ‘మాతృభాష జాతి ఔన్నత్యానికి ప్రతీక. తెలుగువాడు భాషాభిమానేగానీ దురభిమాని కాడు. భాషను కాపాడుకుంటూ, అభివృద్ధి సరిచేసుకోవడం జరగాలి. మన భాష గొప్పదనాన్ని ప్రజలకు వెల్లడించి, తర్వాతి తరాలకు వారసత్వంగా అందజేసి, భాషా సౌందర్యాన్ని సుసంపన్నం చేయాలి’ అని ఆయన అభిలషించారు. భాషనూ, సంస్కృతీ సంప్రదాయాలను మమేకం చేయగలగటం తెలుగునుడి ప్రత్యేకత అంటారాయన. ‘గత కొన్నాళ్లుగా మన భాష ఉనికి మీద పరోక్షదాడులు జరుగుతున్నాయి. ఒక సజీవ వాఙ్మయ సౌందర్యానికి సమాధులు కట్టే దుశ్శకునాలు కనిపించటం దురదృష్టకరం. నిరంతర గంగా ప్రవాహానికి అడ్డుకట్ట వేయగలమా? అఖండ సూర్యకాంతి పుంజాన్ని అరచేతితో ఆపగలమా?’ అని ఎంతో ఆవేదనగా ప్రశ్నించారాయన. ‘తెలుగుభాష పరిఢవిల్లడానికి నిరంతరం శ్రమించాల్సిందే! ముఖ్యంగా న్యాయస్థానాలలో తెలుగును పటిష్టంగా అమలు చేయాలి. బ్రిటిష్ హయాంలోనే న్యాయమూర్తులు తెలుగులో తీర్పులు చెప్పిన చరిత్ర ఉంది. దీనిద్వారా ప్రజలందరికీ న్యాయవ్యవస్థ అందుబాటులోకి రాగలదు’ అని ప్రకటించారాయన 


భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణగారు తెలుగు జాతి గౌరవాన్ని పెంపొందిస్తారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. కన్నతల్లిపై, కన్నభాషపై, కన్నదేశంపై మమకారం ఉన్నవారు ఏ పని చేసినా, ఏ పదవి చేపట్టినా తమ ప్రత్యేకతను చాటుకుంటారు. వారి ఆలోచనా సరళి విశిష్టం. ఆయనది తేటతెనుగు మనసు. అలాంటి వ్యక్తి ఈ అత్యున్నత పదవిలోకి వచ్చినందుకు ప్రతీ తెలుగు బిడ్డా పులకరిస్తాడు, గర్విస్తాడు.

డా. మండలి బుద్ధప్రసాద్

(అధికారభాషా సంఘం పూర్వాధ్యక్షులు)

Advertisement
Advertisement
Advertisement