Jul 28 2021 @ 21:04PM

సినీ ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే: ఎన్.వి. ప్రసాద్

‘‘థియేటర్స్ అనేవి ఉంటేనే ఫ్యాన్స్ ఉంటారు. హంగామా ఉంటుంది. ఊరేగింపులుంటాయ్. హుషారుంటుంది. ఒక వెయ్యి మంది ఉన్న ఆడిటోరియంలో అందరూ కలిసి నవ్వితే వచ్చే ఎంటర్‌టైన్‌మెంటే వేరు. ఆ హోప్‌తోనే ‘ఇష్క్’ సినిమాతో వస్తున్నాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతామని అనుకుంటున్నాం. ప్రేక్షక దేవుళ్లు మా బ్యానర్‌కు రెస్పెక్ట్ ఇచ్చి సినిమా చూస్తారని, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం’’ అని అన్నారు నిర్మాత ఎన్.వి. ప్రసాద్. మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై తేజ స‌జ్జా‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌ హీరోహీరోయిన్లుగా ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌లతో కలిసి ఆయన నిర్మించిన చిత్రం ‘ఇష్క్’. ఈ చిత్రం జూలై 30న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన చిత్రజ్యోతితో ముచ్చటిస్తూ థియేటర్ల సమస్య గురించి మాట్లాడారు. 


ఆయన మాట్లాడుతూ..

‘‘కొన్ని చోట్ల మల్టీఫ్లెక్స్ థియేటర్లు కూడా ఓపెన్ కాలేదు. కొంత కాంప్లికేషన్ ఉంది. ఇదంతా ఓ సిస్టమ్ ప్రకారం ఉంటుంది. ప్రభుత్వం ఓ జీవోని తీసుకువచ్చింది. దానిపై ప్రభుత్వంతో చర్చలు జరిపే వరకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. ప్రభుత్వం పాజిటివ్‌గా ఉంది అని చెప్పడం లేదు కానీ మేము మాత్రం అదే హోప్‌తో ఉన్నాం. ఇది ఒక బిగ్ ఇండస్ట్రీ ఎగ్జిబిషన్. తెలుగు మార్కెట్‌ని ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్లే స్టేజ్‌కి వచ్చిన తర్వాత గవర్నమెంట్‌కి కూడా ఈ ఫీల్డ్‌ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కదా!. చిన్న సినిమాలైనా, ఈ టైమ్‌లో రిస్క్ చేస్తూ రిలీజ్ చేసుకోవాల్సిందే. సమస్యలుంటే ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలిగానీ, ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ని పాటించకుండా ఉండలేం కదా. ‘లా’కి ఎవరైనా బెండ్ అవ్వాల్సిందే. కానీ ప్రభుత్వం దృష్టికి మాత్రం సీరియస్‌గానే తీసుకెళుతున్నాం. దాదాపుగా ప్రభుత్వం తరుపు నుంచి కూడా సానుకూల నిర్ణయమే వస్తుందనే ఆశతోనే ఉన్నాం.


మా సినిమాకు సంబంధించి ఫిబ్రవరిలోనే కాపీ రెడీ అయింది. మాకు ఇది చిన్న సినిమానే. దీనిని పోటీగా విడుదల చేయలేం. ఈ నెల 30 నుంచి థియేటర్లు తెరుచుకుంటాయని ఎప్పుడైతే అన్నారో.. మాకు ఈ గ్యాప్ చాలని అనుకున్నాం. అందులో తెలంగాణలో 100 పర్సంట్ ఆక్యుపెన్సీ ఉంది. ఏపీకి వచ్చే సరికి కోవిడ్ కారణంగా 50 పర్సంట్, 3 ఆటలకే అనుమతి ఉంది. ఇక ఎక్కడో ఒక దగ్గర రిస్క్ తీసుకుని ఒక మూమెంట్ అయితే సినిమా ఇండస్ట్రీలో మనం మొదలు పెట్టకపోతే ఎలా అనుకున్నాం. ఎందుకంటే చాలా కంటెంట్ స్టక్ అయిపోయి ఉంది. అది రిలీజ్ చేయాల్సిన సమయం ఇంకా మించిపోతుంది. పరిస్థితులు బాగుండి, అంతా ఓకే అయితే ప్రతివారం మూడు, నాలుగు సినిమాలు రిలీజవుతాయి. అప్పుడు మొత్తంగా పబ్లిక్‌కు ఛాయిస్ పెరిగిపోతుంది. ఈ ప్రయత్నంలో మా సినిమా ‘ఇష్క్’తో పాటు విడుదలవుతున్న తిమ్మరుసు చిత్రాలు విజయం సాధిస్తే.. మొన్న జనవరిలో ఎలా అయితే ఇండస్ట్రీ కాస్త తేరుకుందో.., ఇప్పుడు కూడా అలాగే అవుతుందనే హోప్‌తోనే ఉన్నాం..’’ అని అన్నారు.