Jul 28 2021 @ 20:12PM

ఓటీటీ సంస్థలతో జాగ్రత్త: ఎన్.వి. ప్రసాద్

యంగ్ హీరో తేజ స‌జ్జా‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోహీరోయిన్లుగా య‌స్‌.య‌స్‌. రాజుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేస్తూ దక్షిణాదిలోని సుప్ర‌సిద్ద నిర్మాణ ‌సంస్థ‌ల్లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం ‘ఇష్క్‌’. ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 30న గ్రాండ్‌గా థియేట‌ర్స్‌లో విడుద‌ల‌కాబోతోంది. ఈ సంద‌ర్భంగా నిర్మాతలలో ఒకరైన ఎన్వీ ప్రసాద్ చిత్రజ్యోతితో ముచ్చటించారు. 


ఆయన మాట్లాడుతూ..

మా బ్యానర్‌ కంటూ ఓ ప్రివిలేజ్ ఉంది. మా బ్యానర్‌లో వస్తోన్న 93వ చిత్రం ‘ఇష్క్’. మాకున్న గుర్తింపులో ఎప్పుడూ కూడా మంచి చిత్రాలనే తీశాం. ఏ రోజూ కూడా వేరే రకమైన చిత్రాలు కానీ, ప్రేక్షకులకు నచ్చని చిత్రాలు కానీ తీయాలని అనుకోలేదు. సినిమాలు చేయకపోతే గమ్మునే ఉన్నాం. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ చేశాం. ఇక నుంచి వరుసగా మా బ్యానర్‌లో చిత్రాలు ఉంటాయి. హీరో తేజ ‘ఇష్క్’లో చక్కగా చేశాడు. ఈ వయసులోనే 100 శాతం అతనికి సినిమా అంటే తపన, తాపత్రయం కనిపించాయి. సినిమా ప్రొమోషన్ విషయంలో కూడా ఆ కుర్రాడు చాలా బాగా సపోర్టివ్‌గా ఉన్నాడు. ప్రియా ప్రకాశ్ వారియర్ గ్లామర్ ఈ చిత్రానికి ప్లస్ అవుతుంది. 


కాస్ట్ వైజ్ కొద్దిగా బడ్జెట్ పెరిగిన మాట వాస్తవమే. ఇప్పుడు అన్నింటికి ఖర్చులు పెరిగిపోయాయి. పెట్రోలు, డీజిల్ కాస్ట్ మీదే అంతా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడవన్నీ పెరిగిపోవడంతో సినిమా బడ్జెట్ విషయంలో కూడా కాస్త కాస్ట్ పెరిగింది. 


సినిమాల విడుదల విషయంలో ఆంధ్రలో కొద్దిగా సమస్యలున్నాయి. సీఎంగారి దృష్టికి తీసుకెళ్లాము. ఆయన కూడా సానుకూలంగానే స్పందించారు. ముందు ఎగ్జిబిషన్ సెక్టారును నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


థియేటర్లలో చూసే ఎక్స్‌పీరియన్స్ ఓటీటీలలో ఎప్పుడూ ఉండదు. ఓటీటీ విషయానికి వస్తే ఒక ఛాయిస్ ఉంటుంది. నెంబరాఫ్ ఫిలిమ్స్, నెంబరాఫ్ వెబ్ సిరీస్‌లు ఉంటాయి. గ్యారంటీగా మళ్లీ థియేటర్ నిలబడుతుంది. సినిమా అనేది ప్రపంచంలోకి ఎప్పటికీ ఉంటుంది. దీనిని ఎవరూ ఆపలేరు.


ఈ కొవిడ్‌లో మేజర్‌గా డ్యామేజ్ అయిన ఇండస్ట్రీలలో టూరిజం, హాస్పటాలిటి ఎలా దెబ్బతిన్నాయో.. అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా అలా స్టక్ అయిపోయింది. తొందరలోనే రికవరీ స్టేజ్ నుంచి నార్మల్ స్టేజ్‌కు పరిస్థితి వస్తుందని భావిస్తున్నాం. కొంతమంది తప్పక ఓటీటీ బాట పట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఓటీటీ వాళ్లు కూడా ఈ టైమ్‌లో థియేటర్స్‌ని కిల్ చేయాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ టైమ్‌లో అంతా అలెర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫారెన్ ఓటీటీ కంపెనీలు ఉన్నాయి. ఆల్ మోస్ట్ ఆల్ వాళ్లు కిల్ చేసేందుకే చూస్తుంటారు.

సినిమా మొదలైన మొదటి రోజు నుంచి థియేటర్లలోనే విడుదల చేయాలనే అనుకున్నాం. మొదటి నుంచి అలాగే ప్లాన్ చేసుకుంటూ వచ్చాం. ఓటీటీ అనే థాట్ మాకు రాలేదు. ఇప్పుడు ఓటీటీకి వచ్చేసరికి రూల్స్ అన్నీ మారిపోయాయి. చిన్ని సినిమాల విషయానికి వచ్చేసరికి ఓ 10 మందికి కంటెంట్ డెలివరీ చేయాలి. వాళ్లు చూడాలి. వాళ్లు చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. మన ప్రొడక్ట్ మనం తీసుకుని ఎవరికో 10 మందికి చూపించే బదులు, ఆ స్థానంలో 10 మంది డిస్ట్రిబ్యూటర్లకు చూపించినందుకు ఫుల్ శాటిస్‌ఫ్యాక్షన్ ఉంటుంది. వాళ్లతో మంచి రిలేషన్ ఉంటుంది. ఈ ఫీల్డ్‌లో అంత కాన్ఫిడెన్స్ లేకుండా సినిమా తీయలేమనేది నా అభిప్రాయం. 


‘నారప్ప’ సినిమా విషయానికి వస్తే అది థియేటర్‌లో ఆడాల్సిన చిత్రం. వెంకటేశ్‌గారి కెరీర్‌లోనే అదొక మాసీ ఫిల్మ్. కానీ కోవిడ్‌తో ఆ నిర్మాత ఆల్రెడీ బాధను అనుభవించాడు. అందులో బిగ్ ప్రైస్ ఆఫర్ చేయడంతో కాదనలేకపోయారు. ఓటీటీ వారు అలా టెంప్ట్ చేస్తారంతే. వాళ్ల మార్కెటింగ్ స్ట్రాటజీ అది. ఇంకా చెప్పాలంటే వెయ్యి రూపాయలకి 5 చీరలని ప్రకటిస్తే, లక్షలలో అక్కడ జనం చేరతారు. ఆ రకమైన స్ట్రాటజీ అన్నమాట. కస్టమర్‌ని వాళ్ల జోనర్‌కి తీసుకెళ్లిపోతున్నారు. అడిక్ట్ చేసేస్తున్నారు.