Abn logo
Sep 23 2021 @ 18:06PM

వయా Dubai.. America కు వెళ్లేందుకు రూటు మార్చుతున్న NRI లు.. అసలు కారణమేంటంటే..

ఎన్నారై డెస్క్: మహమ్మారి కరోనా నేపథ్యంలో చాలా దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్తా మెరుగు పడుతుండడంతో కొన్ని దేశాలు ఒక్కొక్కటిగా ఆంక్షలను సడలిస్తున్నాయి. కానీ, ఇప్పటికీ చాలా దేశాలు భారత ప్రయాణికులను తమ దేశంలోకి ప్రవేశించడాన్ని అనుమతించడం లేదు. ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా కూడా ఉంది. గతేడాది ఏప్రిల్ 30న అధ్యక్షుడు జో బైడెన్.. ఇలా భారత్‌తో పాటు పలు దేశాల ప్రయాణికుల రాకపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో దాదాపు 18 నెలలుగా చాలా మంది ఎన్నారైలు స్వదేశంలోనే చిక్కుకున్నారు. దీంతో ఎన్నారైలు అమెరికా వెళ్లేందుకు వయా దుబాయ్ రూటును ఎంచుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవల దుబాయ్.. భారత ప్రయాణికులను 14 రోజుల క్వారంటైన్ నిబంధనతో అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.  


దీంతో చాలా మంది ఎన్నారైలు ఈ రూటులోనే అగ్రరాజ్యానికి చేరుకుంటున్నారు. ఇలాగే ఇటీవల హైదరాబాద్ నుంచి యూఎస్ వెళ్లిన హెచ్-1బీ వీసాదారుడు ఎన్ కుమార్ తన జర్నీ అనుభవాన్ని  మీడియాతో పంచుకున్నాడు. ఆయన మాటల్లోనే.. "భారత ప్రయాణికులను అమెరికా వెళ్లేందుకు దుబాయ్ అనుమతిస్తూ ప్రకటన వెల్లడించిన వెంటనే ఇదే రూటులో అగ్రరాజ్యానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఎందుకుంటే కరోనాకు ముందు కూడా ఇదే రూటులో యూఎస్ వెళ్లాను. దీంతో నాకు ఈ రూటు సుపరిచితమే. ఇక నా కంటే ముందు ఇదే రూటులో అమెరికా వెళ్లిన కొంతమంది తెలిసిన వాళ్లు చెప్పిన దాని ప్రకారం ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు దగ్గర కొంచెం ఆలస్యం అవుతున్నట్లు తెలిసింది. దాంతో నా విమాన సమయానికి 6-7 గంటల ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాను.


అక్కడికి వెళ్లి చూస్తే నిజంగానే కరోనా టెస్టు కోసం పెద్ద క్యూలైన్ ఉంది. జనాలు బాగా ఉన్నా అక్కడ ప్రాసెస్ అంతా చాలా వేగంగా జరుగుతుంది. నా వంతు రాగానే ప్రాథమిక సమాచారంతో ఒక ఫారం ఫీల్ చేసి ఇవ్వడంతో స్వాబ్ తీసుకున్నారు. ఈ టెస్టులో నెగెటివ్ వస్తే గానీ బోర్డింగ్ పాస్ ఇవ్వలేదు. రెండు గంటల్లోనే నా పరీక్ష ఫలితం వచ్చేసింది. దాంతో ఎయిర్‌లైన్ కౌంటర్‌కు వెళ్లి బోర్డింగ్ పాస్ తీసుకుని దుబాయ్ విమానం ఎక్కాను. దుబాయ్‌లో దిగగానే నా దగ్గర దుబాయ్ విజిటర్ వీసా ఉండడంతో మిగతా ప్రాసెస్ అంతా సులువుగా జరిగిపోయింది.  

ఇక భారత విమానాశ్రయంలో ఆర్‌టీ-పీసీఆర్ టెస్టుకు రూ.4500/- చెల్లించడంతో దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఉచితంగానే కరోనా పరీక్ష నిర్వహించారు. ఒకవేళ దుబాయ్ లోకల్ ఫోన్ నెంబర్ ఉంటే ప్రాసెస్ ఇంకా చాలా వేగంగా అయిపోతుంది. ఎందుకంటే కాంటాక్ట్ కోసం సంబంధిత అధికారులు ఆ నెంబర్‌నే తీసుకుంటారు. దాంతో దుబాయ్‌లో ఉంటున్న నాకు తెలిసిన వారి ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఇక స్వాబ్ తీసుకున్న తర్వాత లగేజీ తీసుకోవడానికి అనుమతించారు. భారత్‌లో టెస్టు చేయించుకున్న ఆర్‌టీ-పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ చేతిలో ఉండడంతో విమానాశ్రయం నుంచి చాలా ఈజీగానే బయటపడ్డాను. బయటకు వచ్చిన తర్వాత పరీక్ష ఫలితం వచ్చే వరకు ఎదైనా హోటల్‌లో స్టే చేయాల్సి ఉంటుంది. అలాగే దుబాయ్ నుంచి అమెరికా వెళ్లాలంటే 14 రోజుల క్వారంటైన్ కూడా తప్పనిసరి. 


ఇక హోటల్‌కు వెళ్లిన రెండు మూడు గంటలకే నా టెస్టు ఫలితం ఎస్‌ఎంఎస్ ద్వారా వచ్చింది. 14 రోజులు దుబాయ్‌లో ఉన్న తర్వాత అమెరికాకు పయనమయ్యాను. యూఎస్ చేరుకున్న తర్వాత అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు నన్ను ఎక్కువ ప్రశ్నలేమి అడగలేదు. 14 రోజుల ముందు ఎక్కడ ఉన్నాననే విషయాన్ని మాత్రమే చూసి వదిలిపెట్టారు. ఇలా వయా దుబాయ్ అమెరికా చేరుకున్నాను." అని కుమార్ తన ప్రయాణ అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. ఇదిలాఉంటే.. బైడెన్ సర్కార్ ఇటీవల విదేశీయుల రాకపై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. నవంబర్ నుంచి రెండు డోసుల టీకా తీసుకున్న భారత్ సహా 33 దేశాల ప్రయాణికులు తమ దేశానికి రావొచ్చని ప్రకటించింది.    

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...