Abn logo
Jun 3 2020 @ 23:48PM

అక్కడే కాదు... ఇక్కడా ఉంది!

‘‘మన సమాజం(భారతదేశం)లోనూ జాత్యహంకార విద్వేషం, వర్ణవివక్ష ఉన్నాయి. నల్లగా ఉన్నవాళ్లను ‘కాలా’ అంటూ పిలవడం నిత్యకృత్యమైంది. దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన భారతీయులకు వ్యతిరేకంగా వివక్ష చూపించే ప్రజలూ ఉన్నారు’’ అని మాళవికా మోహనన్‌ అన్నారు. రజనీకాంత్‌ ‘పేట’లో నటుడు శశికుమార్‌ భార్యగా, తమిళ స్టార్‌ విజయ్‌ తాజా సినిమా ‘మాస్టర్‌’లో కథానాయికగా నటించారీమె. అగ్రరాజ్యం అమెరికాలో ఆఫ్రో అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో మాళవికా మోహనన్‌ వ్యాఖ్యలు దేశంలో జాత్యహంకార విద్వేషాలు, వర్ణ వివక్షపై ఆలోచన కలిగించేలా ఉన్నాయి. 


నల్లగా ఉన్నవాళ్లను ఎగతాళి చేస్తారు!

మాళవికా మోహనన్‌ మాట్లాడుతూ ‘‘దక్షిణ భారతీయులంతా నల్లగా ఉంటారని భ్రమలో బతికే, ఏమాత్రం అవగాహన లేని ప్రజలు... నల్లగా, ముదురు రంగులో భారతీయులందరినీ ‘మద్రాసీలు’ అని ఎగతాళిగా సంభోదిస్తారు. నల్లగా ఉన్నవాళ్లను ‘నీగ్రోలు’గా అభివర్ణిస్తారు. ఉత్తరాది ప్రజలను ప్రత్యేకంగా ‘చింకీ’ అంటారు. తెల్లగా ఉన్నవాళ్లను అందానికి చిరునామాగా, నల్లగా ఉన్నవాళ్లను వికృత రూపానికి ప్రతీక అన్నట్టు సూచిస్తారు. ప్రపంచంలోని జాత్యహంకారం గురించి మాట్లాడేటప్పుడు... మన ఇళ్లల్లో, స్నేహితుల మధ్యలో, సమాజంలో చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవడమూ ముఖ్యమే’’ అన్నారు. 


‘టీ’ తాగితే నల్లగా అవుతారట!

ఈ సందర్భంగా 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు స్నేహితుడి ఇంట్లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించీ మాళవికా మోహనన్‌ వివరించారు. ‘‘ఒకసారి స్నేహితుడి ఇంటికి వెళ్లా. వాళ్ల అమ్మను టీ ఇవ్వమన్నాడు. ‘నువ్వు టీ తాగితే, ఆమెలా నల్లగా అవుతావ్‌’ అని ఆంటీ నన్ను ఉద్దేశిస్తూ చెప్పారు. నేను చామనఛాయలో ఉండే మలయాళీ అమ్మాయి. ఆ అబ్బాయి తెల్లగా ఉండే మహారాష్ట్రియన్‌. అప్పటివరకూ మామధ్య వర్ణవివక్ష అనేది రాలేదు. తొలిసారి నా రంగు గురించి తక్కువ చేసి మాట్లాడడంతో నా మనసు చివుక్కుమంది’’ అని మాళవికా మోహనన్‌ అన్నారు. ‘‘మంచితనం, మానవత్వమే అందంగా నిలబెడుతుంది తప్ప శరీర ఛాయ, రంగు కాదు’’ అన్నారామె.

Advertisement
Advertisement
Advertisement