Abn logo
Jun 4 2020 @ 03:49AM

సుధాకర్‌పై కొత్తగా కేసు పెట్టలేదు

  • పోలీసుల నుంచి టేకోవర్‌ చేశామంతే
  • దాని ఆధారంగానే ఎఫ్‌ఐఆర్‌ నమోదు
  • సీబీఐ ఎస్పీ విమలాదిత్య స్పష్టీకరణ


విశాఖపట్నం, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ సుధాకర్‌పై తాము కొత్తగా కేసు నమోదు చేయలేదని, ఆయనపై పోలీసులు నమోదుచేసిన కేసును టేకోవర్‌ చేసుకుని దానిపైనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు సీబీఐ విశాఖ బ్రాంచి ఎస్పీ విమలాదిత్య తెలిపారు. సుధాకర్‌పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆయన తెర దించారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులను ఆటంకపెట్టడం, బహిరంగ ప్రదేశంలో ప్రజలకు అసౌకర్యం కలిగించడం, పోలీసులపై దాడికి యత్నించడం, వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ లాక్కొని ధ్వంసం చేయడం, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి అభియోగాలపై పోలీసులు కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఆ సెక్షన్లనే సీబీఐ అధికారులు తమ ఎఫ్‌ఐఆర్‌లోనూ నమోదుచేశారు. హైకోర్టు ఆదేశం మేరకు సీబీఐ అధికారులు గత నెల 29న విశాఖ పోలీసులపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు కూడా శరవేగంగా జరుగుతోంది. డాక్టర్‌ సుధాకర్‌పై పోలీసులు నమోదుచేసిన అభియోగాలపై కూడా సమగ్ర దర్యాప్తు చేయాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొనడంతో సీబీఐ అధికారులు నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై నమోదైన కేసును టేకోవర్‌ చేసుకుని ఆ మేరకు మంగళవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీనిపై కొంతమంది డాక్టర్‌ సుధాకర్‌ కేసు మలుపు తిరిగిందని, సుధాకర్‌నే నిందితుడిగా సీబీఐ నిర్ధారించిందంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇది ప్రజల్లో గందరగోళానికి దారితీసింది. ఈ నేపథ్యంలో సీబీఐ ఎస్పీ విమలాదిత్య ఇచ్చిన స్పష్టతతో ఈ గందరగోళానికి తెరపడింది. కాగా, హైకోర్టు ఆదేశం మేరకు సీబీఐ అధికారులు ఘటనా స్థలి నుంచి ఆస్పత్రికి తరలింపు వరకూ జరిగిన పరిణామాలపై సాక్షులను తిరిగి విచారించనున్నారు. ఈ క్రమంలో పోలీసు, వైద్య శాఖ అధికారులు వ్యవహరించిన తీరు పట్ల కూడా దర్యాప్తు చేయనున్నారు.

Advertisement
Advertisement
Advertisement