Sep 26 2021 @ 21:20PM

TFI: పవన్‌కు పరిశ్రమ నుంచి మద్దతు ఏది?

టాలీవుడ్‌ : ఎవరికి వారే యమునాతీరే

‘విమర్శలు, వివాదాలు సినీరంగంలో శాశ్వతం కాదు. కళామతల్లి బిడ్డలంతా ఒకటే’ చిత్ర పరిశ్రమలో తరచూ వినిపించే మాట ఇది. అయితే ఓ సమస్య, చర్చ వచ్చినప్పుడు మాత్రం పరిశ్రమలో స్పందించే వారు కరువవుతారు. ‘ఎవరికి వారే యమునాతీరే’ అన్నట్లు వ్యవహరిస్తారు. అందుకు శనివారం రాత్రి పవన్‌కల్యాణ్‌ స్పీచ్‌, ఆ తర్వాత ఎదురైన పరిణామాలు ఓ ఉదాహరణ. ‘రిపబ్లిక్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక వేదికగా చిత్ర పరిశ్రమ పట్ల ఏపీ ప్రభుత్వం తీరును ఎండగడుతూ పవన్‌కల్యాణ్‌ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే హాట్‌ టాపిక్‌. ఆదివారం ఉదయం నుంచి ఏపీ మంత్రులు ఒక్కొక్కరుగా పవన్‌పై మాటల యుద్దం చేస్తున్నారు. కొందరైతే బాహాటంగానే ఖండించేందుకు సిద్ధమవుతున్నారు. 


‘హీరోలు కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు అన్న కామెంట్‌, ఇటీవల నానిపై జరిగిన మాటల దాడి, టికెట్‌ రేట్లు’ ఇతరత్రా విషయాలపై పవన్‌ ఘాటుగా స్పందించారు. ఎన్టీఆర్‌ కష్టపడి డాన్స్‌లు వేస్తేనే ఓ సినిమా ద్వారా ఆయనకు పారితోషికం వస్తుందనీ, ప్రభాస్‌ కష్టపడి కండలు పెంచితే ‘బాహుబలి’ లాంటి సినిమా వచ్చిందనీ, చరణ్‌ గుర్రపు స్వారీలు లాంటి ఫీట్లు చేయడం వల్ల వారికి పారితోషికం వస్తుందని, ఉచితంగా ఎవరూ రెమ్యునరేషన్‌ ఇవ్వరనీ ఆయన వ్యాఖ్యానించారు. అయితే పరిశ్రమ కోసం పవన్‌కల్యాణ్‌ గొంతెత్తితే ఆయన వెనుక ఉన్నది ఎంతమంది? మద్దతు తెలిపినవారు ఎందరు? ప్రస్తుతం ఈ చర్చ కూడా జరుగుతోంది. నాని, కార్తికేయలాంటి హీరోలు మినహా మరెవరూ పవన్‌కు మద్దతు తెలిపింది లేదు. ఒకస్టార్‌ హీరో సమస్యపై మాట్లాడితే.. మిగిలిన హీరోలు ఏమయ్యారు? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పవన్‌కల్యాణ్‌ వ్యక్తిగతంగా మాట్లాడినా, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా.. సినిమా పరిశ్రమను దృష్టిలో పెట్టుకునే, పరిశ్రమ బాగుకోసమే! సినిమా పరిశ్రమను తక్కువగా చూస్తున్నవారిపై ఓ వ్యక్తి పోరాటానికి దిగితే నలుగురు తోడై మద్దతు పలకాలి గానీ ‘ఎవరికి వారూ యమునా తీరే’ అన్నట్లు వ్యవహరించడం కరెక్ట్‌ కాదని సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ మొదలయ్యాయి. 


పరిశ్రమలో హీరోలు.. ఇతర నిపుణులను పక్కన పెడితే ఛాంబర్‌ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపి వచ్చిన వారానికి ఆ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌. గతంలో పరిశ్రమ కష్టాలను చెప్పుకోవడానికి ఆంధ్రా నాయకులను కలవడానికి వెళ్లొచ్చిన ఒక రోజులోనే ఛాంబర్‌ నుంచి ప్రకటన వచ్చేది. ఈసారి అలా జరగలేదు. ఏపీ మంత్రి పేర్ని నానిని కలిసొచ్చిన వారానికి ఛాంబర్‌ నుంచి ప్రకటన రావడం ఇప్పుడు చర్చగా మారింది. పైగా ఆ లేఖలో వ్యక్తిగతంగా పలు వేదికలపై ఎవరైనా సినిమా పరిశ్రమ గురించి మాట్లాడినా, విమర్శించినా ఛాంబర్‌కు ఏ సంబంధం లేదని ఆ లేఖలో పేర్కొవడంతో ఏపీ ప్రభుత్వం అంటే తెలుగు ఫిల్మ్‌చాంబర్‌కు ఎంత భయమో అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఆదివారం రాత్రి పవన్‌ ప్రసంగం వాడీవేడిగా సాగడంతో అక్కడి ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఈ లేఖ పంపినట్లు కామెంట్లు వస్తున్నాయి. చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారు కనీసం సోషల్‌ మీడియా వేదికగా అయినా పవన్‌కు మద్దతు తెలపకపోవడం బాధాకరమని సోషల్‌ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.