Abn logo
Oct 13 2021 @ 00:12AM

కాస్టింగ్‌ డైరక్టర్‌కి గౌరవం లేదిక్కడ!

సినిమా చేయాలంటే కథ, బడ్జెట్‌..  ఉంటే సరిపోదు.  పాత్రలకు తగినట్లు  నటులను ఎంపిక  చేయటం ఓ సవాల్‌. అయితే ఆ పని చేసే ఒకే ఒక వ్యక్తి కాస్టింగ్‌ డైరక్టర్‌.  కథానాయకుడు, నూటొక్క జిల్లాల అందగాడు, తలైవి.. ఇలా నలభై చిత్రాలకు పైగా కాస్టింగ్‌ డైరక్టర్‌గా పని చేసిన ఒకే ఒక మహిళా కాస్టింగ్‌ డైరక్టర్‌  పుష్ప భాస్కర్‌. ఎనిమిదేళ్ల నుంచి పరిశ్రమలో ఉన్నా ఎలాంటి గౌరవం, భరోసా లేదంటోన్న ఆమెను ‘నవ్య’ పలకరించింది. 


దర్శకుడి దగ్గర తొలుత కథ వినటమే నా పని. బడ్జెట్‌ మేరకు ఆ పాత్రలకు ఎవరు సరిపోతారో చేసి ఆడిషన్‌ చేయాలి. సినిమా జ్ఞానం ఉంటేనే ఈ పని చేయగలం. 


బాధ్యతగా ఉంటా... 

 తొమ్మిది నెలల పాపాయి నుంచి ఎనభై ఏళ్ల వ్యక్తి వరకూ వేల ప్రొఫైల్స్‌ ఉన్నాయి. ‘చిన్న సినిమా.  కథానాయికకి యాభై వేలే ఇవ్వగల’మంటారు కొందరు. ఆ డబ్బు అవసరమున్న అమ్మాయి ఎక్కడో చోట ఉంటుంది కదా! కొందరు నిర్మాతలే మా ప్రొఫెషన్‌కు బడ్జెట్‌ ఇస్తారు. చాలా మంది పనిచేసినా.. టైటిల్స్‌లో పేరు వేయరు. 


విభిన్నత్వమే నా దారి.. 

1987లో హైదరాబాద్‌లో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా చేరా.    తర్వాత న్యూస్‌ రీడర్‌ శిక్షణ తీసుకున్నా. ఆల్‌ ఇండియా రేడియో ఎఫ్‌ఎమ్‌లో ఆర్జేగా. ‘హజ్బెండ్‌ స్పెషల్‌’ ప్రోగ్రామ్‌ను ఆరువందల ఎపిసోడ్స్‌ చేశా. ఆ ఉద్యోగం మానేశాక.. ‘లక్ష్మి టాక్‌ షో’, ‘ప్రేమతో లక్ష్మి’ కార్యక్రమాలకు రచయితగా పని చేశా. అన్నపూర్ణ స్టూడియో యాక్టింగ్‌ స్కూల్‌ ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్‌గా చేశా. ఆడిషన్‌ టెక్నిక్స్‌, డబ్బింగ్‌ పాఠాలను చెప్పాను. బంగారం తాకట్టుపెట్టి కోర్సులో చేరినవారినీ చూశా. ఆ బాధతోనే కాస్టింగ్‌ డైరక్టరవుదామనుకున్నా. 


 అలా.. మొదలైంది!

ఫిల్మ్‌ కోర్సు చదివిన విద్యార్థులకు ఏడాదిన్నర పాటు ఉచితంగా అవకాశాలిప్పించా. బాలీవుడ్‌ మాదిరే  ప్రొఫెషనల్‌గా ‘కాస్టింగ్‌ డైరక్టర్‌’ కావాలనుకున్నా.  ఎనిమిదేళ్ల క్రితం ఎలాంటి వ్యవస్థ లేదిక్కడ. మొండిగా పనిచేశా. మా ఆయన బ్యాంకులో పనిచేయడం, పిల్లలు స్థిరపడటంతో ధైర్యంగా ముందడుగేశా. ‘పోస్‌ పోరీస్‌’  వెబ్‌సిరీస్‌తో కాస్ట్‌ డైరక్టర్‌గా పేరొచ్చింది. ఇప్పటి వరకూ 15 వెబ్‌సిరీస్‌లకు కాస్టింగ్‌ డైరక్టర్‌గా పనిచేశా. ‘కథానాయకుడు’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’, ‘నారప్ప’, ‘తలైవి’ లతో పాటు ‘బంగార్రాజు’, ‘రంగమార్తాండ’.. ఇలా నలభై సినిమాలకు పైగా కాస్టింగ్‌ డైరక్టర్‌ని. 


అందుకే కొందరే ఆ పాత్రల్లో.. 

పరిశ్రమలో ‘కాస్టింగ్‌ డైరెక్టర్‌’ అంటే గౌరవం లేదు. సహాయ దర్శకులు, ఎడిటర్లు, మేకప్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు.. ఇలా ఎవరైనా పాత్రలు సజెస్ట్‌ చేస్తారు కదా! దీని వల్లనే ఒకే వ్యక్తి తండ్రిగా, ఒకే వ్యక్తి హీరోకి ఫ్రెండుగా, ఒకే వ్యక్తి అన్ని సినిమాల్లో అమ్మగా నటిస్తుంది ఇక కొత్తవారికి అవకాశమెక్కడిది? ఎన్టీయార్‌ బయోపిక్‌లో ఆయన తమ్ముడు పాత్ర కోసం దగ్గుపాటి రాజాను సెలక్ట్‌ చేశా. ఆయన ఒకప్పుడు తమిళ్‌లో మంచి హీరో. ఇరవై ఏళ్ల తర్వాత తెరపైకి తీసుకొచ్చా. అంతెందుకూ ఓ యువ తెలుగు హీరోను  విలన్‌గా చేయడానికి ఒప్పించా. కనీసం కాస్టింగ్‌ డైరక్టర్‌గా  పేరు కూడా వేయలేదు.


అలా అనటం బాధాకరం.. 

 కొందరైతే ‘ఉచితంగా నటించమనండి. లైఫ్‌ ఇస్తున్నాం’  అంటారు. వాళ్లిచ్చే అవకాశాల వల్ల తిండి, అద్దె రాదు. జాతర సీన్‌లో చివరి వరుసలోని నటులూ అత్యవసరమే. కేవలం కథానాయకుడు, నాయిక ఉంటే.. ఆ  సన్నివేశం పండదు కదా! ‘గోల్కొండ హైస్కూల్‌’ చిత్రంలో ఓ పాత్రలో మా అబ్బాయి నటించాడు. ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలో రష్మిక అమ్మమ్మగా నటించింది మా అమ్మనే. అప్పటికి ఆమెకు ఎనభై రెండు సంవత్సరాలు. ఆమె లేరిప్పుడు. ఇప్పటికీ అమ్మకోసం ఫోన్లు వస్తాయి.


అదే నా సలహా.. 

సినీ పరిశ్రమలోకి వచ్చేవారికి నాదో సలహా. ఏదో ఒక ఉద్యోగం ఉండాలి. ఆన్‌లైన్‌ ఉద్యోగాలు లేదా అరటిపండ్ల బండైనా ఉండాలి. నటించకపోతే జీవితమే లేదనటం, ఆర్థిక సమస్యలుంటే.. ప్రలోభాలకు లొంగిపోయే దుస్థితి ఉంటుంది. ఇక 24 క్రాఫ్టుల్లో ‘కాస్టింగ్‌ డైరక్టర్‌’ పదమే లేదు. దర్శకత్వంలో భాగమనుకుంటారు. చాలా మందికి కాస్టింగ్‌ మేనేజర్‌, కాస్టింగ్‌ డైరక్టర్‌కి తేడా కూడా తెలీదు.  కాస్టింగ్‌ డైరక్టర్‌గా మహిళలు రావాల్సిన అవసరముంది. అప్పుడే ఇక్కడ మహిళల బాధలూ తెలుస్తాయి. ఇన్నాళ్లూ ఇల్లే నా ఆఫీసు. ఇక మీదట ఉత్తపుణ్యానికి పని చేసే ప్రసక్తే లేదు. ఇది కంచి గనుల సేవ. నా దగ్గరి ప్రొఫైల్స్‌  ఎవరైనా తీసుకుంటే.. పరిశ్రమనుంచి దూరమవుతా. 

రాళ్లపల్లి రాజావలిఫొటోలు: లవ కుమార్‌


కళ్లజోడుతో స్టిల్‌ దిగితే ఆడిషన్‌కి పనికిరాదు. సెల్ఫీలు, టిక్‌టాక్స్‌, రీల్స్‌ పనికి రావు. ముఖ్యంగా టిక్‌టాక్స్‌, రీల్స్‌ చేసేవాళ్లంతా నటులు కాలేరు. కెమెరా ఆన్‌ చేయగానే డీలా పడిపోతారు. కష్టపడితేనే నటుడు తయారవుతాడు. పవన్‌ కళ్యాణ్‌లా, రవితేజలా, సునీల్‌లా, తాగుబోతు రమేష్‌లా.. ఉన్నాం. మేము డైలాగ్స్‌ చెప్తాం కదా..! అని ఎంతో నమ్మకంతో వస్తారిక్కడికి. బాధాకరమైన విషయమేంటంటే.. ఇండస్ర్టీపై విపరీతమైన నమ్మకంతోనే ఇక్కడికి వస్తారు. రాత్రికి రాత్రే ఈ ఇండస్ట్రీ స్టార్‌ను చేస్తుందని నమ్ముతారు. ఇక్కడి కందకాలు తెలియవు. అన్ని ఆఫీసుల మెట్లు ఎక్కి, దిగి అలసిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఏ పని చేయలేరు. చివరికి ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళతారు.