Abn logo
Mar 26 2020 @ 01:04AM

క్వారంటైన్‌ కేంద్రం వద్దు

కైకలూరు(కృష్ణా): ఆటపాక చైతన్య స్కూల్లో ఏర్పాటుచేసే క్వారంటైన్‌ కేంద్రాన్ని నిలిపివేయాలంటూ గ్రామస్ధులు ఆందోళన చేశారు. బుధవారం స్కూల్‌గేట్లకు తాళాలు వేశారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎం.రవికుమార్‌  కేంద్రంలో 100 పడకలను ఏర్పాటుచేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు దగ్గరలో నివాస గృహాలు ఉన్నాయని ఇక్కడ క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు చేయవద్దని ఆందోళన చేశారు. ఎస్సై షణ్ముఖ సాయి తన సిబ్బందితో సంఘటనా స్ధలానికి చేరుకుని గ్రామస్ధులతో చర్చించారు. అనుమానిత కేసులు మాత్రమే ఇక్కడ ఉంటాయని, వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా అన్నిరకాల చర్యలు తీసుకుంటారని వివరించారు.  


పెడనలో అడ్డుకున్న గ్రామస్థులు

పెడన: నందమూరులో వాసవీ ఇంజనీరింగ్‌ కళాశాలలో అధికారులు ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు  చేయడాన్ని గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. మంగళవారం రాత్రి గ్రామస్థులు మూకుమ్మడిగా కళాశాలకు వెళ్లి బీభత్సం సృష్టించారు. ఈ పరిణామంతో అధికారులు భీతిల్లిపోయారు. ఐసోలేషన్‌ వార్డును ఇక్కడ నుంచి తీసేసి వేరే ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పడంతో గ్రామస్థులు శాంతించారు.


12 మంది హౌస్‌ అరెస్ట్‌

చాట్రాయి: మండలంలో తుమ్మగూడెం గ్రామానికి చెందిన రెండు కుటుంబాల్లోని ఎనిమిది మంది, పోలవరంలో ఒక కుటుంబానికి చెందిన నలుగురుని మొత్తం 12 మందిని కరోనా కట్టడిలో భాగంగా అధికారులు వారిని హౌస్‌ అరెస్ట్‌లో ఉంచారు. తెలంగాణా రాష్ట్రానికి చెందిన కరోనా పాజిటివ్‌ వచ్చిన యువకుడు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురంలో జరిగిన ఒక శుభకార్యానికి హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి మండలంలోని మూడు కుటుంబాల వారు హాజరయ్యారు. సమాచారం తెలియడంతో ఎమ్డీవో నాగేశ్వరరావు, తహసీల్దార్‌ జనార్ధనరావు, ఎస్సై శివనారాయణ, వైద్యాధికారి లీనాబెంజ్‌మెన్‌, వైద్య బృందం వారి ఇళ్ల వద్దే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తూ వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఐసోలేషన్‌ నుంచి బయటకు రావద్దని ఈ కుటుంబాలను కోరుతున్నారు. 


ఎన్‌ఆర్‌ఐల ఆరోగ్య స్థితిపై నిఘా

ముసునూరు: విదేశాల నుంచి స్వగ్రామం వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రతిరోజు నిఘా ఉంచుతున్నట్లు ముసునూరు పీహెచ్‌సీ వైద్యులు జాస్తి జగన్మోహనరావు తెలిపారు. మండల పరిధిలోని చెక్కపల్లి అక్కిరెడ్డి గూడెం ముసునూరు, తదితర గ్రామాలకు విదేశాల నుంచి వచ్చిన 10 మంది వ్యక్తుల వివరాలు, వారి ఆరోగ్య స్థితిగతులు సచివాలయ, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఎఎన్‌ఎంలు, వలంటీర్లు బుధవారం పరిశీలించారు. మండల పరిధిలోని 16 గ్రామాలకు వివిధ దేశాల నుంచి 23 మంది వచ్చారని ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగానే ఉందని జగన్మోహనరావు తెలిపారు.  

Advertisement
Advertisement
Advertisement