Abn logo
Sep 24 2021 @ 20:44PM

థానే అత్యాచారం కేసు.. ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఇదే

ముంబై: థానేలో నిన్న వెలుగుచూసిన దారుణ సామూహిక అత్యాచారం కేసులో నిందితులకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదన్న విషయం పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 15 ఏళ్ల బాలికపై 33 మంది కలిసి కొన్ని నెలలపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనమైంది. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు నిందితుల్లో 28 మందిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. నిందితుల్లో ఇద్దరు బాలురు కూడా ఉండడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన  ఏసీపీ సోనాలీ ధోలె సారథ్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం నేడు (శుక్రవారం) దర్యాప్తు వివరాలను వెల్లడించింది. 


బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. బాలికకు నిందితుడు సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడని పేర్కొన్నారు. నిందితులకు రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నట్టు వస్తున్న వార్తలను పోలీసులు కొట్టిపడేశారు. అలాంటివేమీ లేవని ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. నిందితులందరూ బాధితురాలి స్నేహితులో, లేదంటే వారి స్నేహితులో అయి ఉంటారని అన్నారు. నిందితులందరూ బాధితురాలికి తెలిసినవారేనని దర్యాప్తు బృందం పేర్కొంది.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...